News

శ్రీవారి ఆలయంలోకి కారు… తిరుమలలో బయటపడ్డ భద్రతా సిబ్బంది వైఫల్యం!

268views

తిరుమలలో సాధారణంగా మూడంచల భద్రతతోపాటు, చెక్‌పోస్టులు అధికంగానే ఉంటాయి. కానీ అక్కడ భద్రతా వైఫల్యం మరోసారి బయటపడింది. మూడంచల భద్రతా సిబ్బంది, చెక్‌పోస్టులను దాటి శ్రీవారి ఆలయంలోకి ఓ కారు వచ్చింది. వాహనంపై సీఎంవో స్టిక్కర్ ఉంది. కారును అసలు టీటీడీ భద్రతా సిబ్బంది పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సాధారణంగా రామ్‌బగీచ వద్ద ఉన్న చెక్‌పోస్టు నుంచి ప్రముఖులకు సంబంధించిన కార్లతో పాటు టీటీడీ కార్లను లోనికి అనుమతిస్తారు. రామ్‌బగీచ నుంచి శ్రీవారి పుష్కరిణి వరకు మూడు చెక్‌పోస్టులు ఉంటాయి. వాహనాల్లో ఎవరున్నారో తనిఖీ చేసిన అనంతరమే భద్రతా సిబ్బంది వారిని వీఐపీ కారు పార్కింగ్‌లోకి అనుమతిస్తారు. ఈ క్రమంలో సీఎంవో స్టిక్కర్ వేసుకున్న ఓ కారు శ్రీవారి ఆలయ పుష్కరిణి సమీపంలోకి వెళ్లింది. అలా వెళ్లిన కారును భద్రతా సిబ్బంది పట్టించుకోకపోవడం భద్రతలోని డొల్లతనాన్ని బట్టబయలు చేస్తోంది.

సీఎం కారుకు కూడా రామ్‌బగీచ నుంచి పుష్కరిణి ముందున్న సెక్యూరిటీ గేట్ వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. అయితే సీఎంవో స్టిక్కర్ వేసుకున్న కారు నేరుగా పుష్కరిణికి వెళ్లిపోయినప్పటికీ భద్రతా సిబ్బంది గుర్తించకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.