
మహా తేజస్సుతో వెలుగొందుతున్న అంతర్వేది క్షేత్ర సన్నిధిలో.. బుగ్గన చుక్కతో రథసప్తమి నాడు పెళ్లి కుమారుడుగా దర్శనమిచ్చిన శ్రీ నృసింహస్వామి వారు మంగళవారం రాత్రి ఉభయ దేవేరులను పరిణయమాడేందుకు సిద్ధమయ్యారు. పంచ భూతాల సాక్షిగా అఖండ జన సందోహం నడుమ ఏటా మాఘమాసంలో కనుల పండువగా జరిగే శ్రీ నారసింహుడి కల్యాణం చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. కోరికలు తీర్చే శ్రీనారసింహుని పరిణయ వేడుక పదిరోజుల పాటు వైభవంగా జరుగుతుంది. రోహిణీ నక్షత్రయుక్త తులాలగ్న పుష్కరాంశమందు మంగళవారం రాత్రి 12:46 గంటలకు (తెల్లవారితే బుధవారం కల్యాణం జరుగుతుంది. కల్యాణ కాంతులతో మెరుస్తున్న మేఘ వర్ణుడు శ్రీస్వామివారు. కల్యాణానికి సిద్ధపడుతూ తొలుత కంచు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. తదుపరి పెళ్లి కుమారుడి తరపున ఆలయ అనువంశిక ధర్మకర్త మొగల్తూరు రాజ వంశీయులు, ఆలయ ఫ్యామిలీ ఫౌండర్ రాజా కలిదిండి కుమారరామగోపాల రాజాబహద్దూర్, పెళ్లి కుమార్తె తరపున అర్చక స్వాములు రాజా వారి వీధిలో ఎదురు సన్నాహాలు (ఒకరికొకరు బుక్కా చల్లుకోవడం) చేస్తారు.

అనంతరం శ్రీవారి ఆలయం వద్దకు చేరుకుంటారు. కల్యాణ మూర్తులైన శ్రీ స్వామివారు మేళ తాళాలు, మంగళ వాయిద్యాల మధ్య పల్లకీలో కల్యాణ మండపం వద్దకు చేరుకుని సింహాసనంపై ఆశీనులవుతారు. అనంతరం అమ్మవారు పల్లకీలో కల్యాణ మండపం వద్దకు చేరుకోవడంతో కల్యాణ తంతు ప్రారంభం అవుతుంది. ఆలయ స్థానాచార్యులు రంగాచార్యులు సమక్షంలో ప్రధాన అర్చకులు పాణింగపల్లి శ్రీనివాసకిరణ్ ఆధ్వర్యంలో కల్యాణ తంతును నిర్వహిస్తారు.





