News

శ్రీశైల క్షేత్రంలో ఈ నెల 12 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

297views

శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రమణ పుణ్యకాలన్ని పురస్కరించుకొని ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని దేవస్థానం ఈవో లవన్న తెలిపారు. పంచాహ్నిక దీక్షతో ఏడు రోజులపాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 18న ముగుస్తాయని ఆయన వివరించారు. ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి మల్లికార్జునస్వామికి ఏటా రెండు సార్లు అనగా సంక్రాంతికి, శివరాత్రికి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారన్నారు. ఈ సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈనెల 12 న ఉదయం 9 గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశంతో సంక్రాంతి ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.

అదేరోజు సాయంత్రం 5:30 గంటలకు అంకురార్పణ అగ్ని ప్రతిష్టాపన ఏడు గంటలకు ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్బంగా శ్రీ స్వామి అమ్మవార్లకు రోజూ విశేష పూజలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన రెండో రోజు నుంచి అంటే ఈనెల 13 నుంచి శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రతిరోజు సాయంత్రం విశేషపూజలు, వాహనసేవలు నిర్వహిస్తామని ఈనెల 15వ తేదీ మకర సంక్రాంతి పురస్కరించుకొని శ్రీస్వామి అమ్మవారికి బ్రహ్మోత్సవ కళ్యాణం అదేవిధంగా మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు భాగంగా చిన్న పిల్లలకు భోగి పండ్లు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తునట్లు ఈవో లవన్న తెలిపారు.

ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న అధికారులు..
శ్రీశైల క్షేత్రంలో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఆలయ అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈక్రమంలో ఉత్సవాల సందర్భంగా ఈ నెల 12 నుంచి 18 వరకు ప్రత్యక్ష, పరోక్ష సేవలైన రుద్రహోమం, చండీ హోమం, మృత్యుంజయహోమం, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం, శ్రీ స్వామి అమ్మవార్ల కల్యాణం, ఏకాంత సేవలు తాత్కాలిక నిలుపుదల చేస్తామని ఆలయ ఈవో తెలిపారు.