
మిషన్‌శక్తి పరీక్ష ప్రకటన అంశంపై డీఆర్‌డీవో చైర్మన్ సతీశ్‌రెడ్డి స్పందించారు. అంతరిక్షంలో ఉపగ్రహాన్ని కూల్చివేసేందుకు భారత్ చేపట్టిన ప్రయోగం ‘మిషన్ శక్తి’ కారణంగా మిగిలిపోయిన ఉపగ్రహ శకలాలు 45 రోజుల్లో ధ్వంసమవుతాయని సతీష్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారత్ లాంటి శక్తిమంతమైన దేశాలు ఇలాంటి ప్రయోగాలు చేసినప్పుడే మన సామర్థ్యం గురించి ప్రపంచ దేశాలకు ఒక అవగాహన ఉంటుందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో అంతరిక్షంలో మిషన్ శక్తి వంటి ప్రయోగాల ద్వారా రక్షణ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో తెలుస్తుందన్నారు. ఇక మిషన్ శక్తి గురించి కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి పి.చిదంబరం చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘ ఇలాంటి ప్రయోగాలు చేసినప్పుడు వాటి ఫలితాలను రహస్యంగా ఉంచడం సాధ్యంకాని విషయం. ప్రయోగ సమయంలో మన ఉపగ్రహాన్ని ప్రపంచలోని అన్ని స్పేస్ స్టేషన్లు ట్రాక్ చేశాయి. ఇందుకు సంబంధించి మేము అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే ముందుకు సాగాం’ అని సతీష్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మిషన్ శక్తికి సంబంధించిన వీడియోను ఆయన విడుదల చేశారు.
కాగా శత్రుదేశాల ఉపగ్రహాలు కూల్చేసేందుకు ఇటీవల భారత్ చేపట్టిన శాటిలైట్ విధ్వంసక క్షిపణి (ఏశాట్) పరీక్ష వల్ల అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికే (ఐఎస్‌ఎస్) ముప్పు వాటిల్లనుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఆ ప్రయోగం వల్ల అంతరిక్షంలో దాదాపు 400 వ్యర్థ శకలాలు ఏర్పడ్డాయని, ఐఎస్‌ఎస్‌ను వ్యర్థాలు ఢీకొనే ప్రమాదం 44 శాతం పెరిగిందని నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రైడెన్‌స్టిన్ తెలుపగా, ఐఎస్‌ఎస్‌కు భద్రతను దృష్టిలో పెట్టుకునే తమ టీమ్ ఈ ప్రయోగాన్ని చేపట్టిందని, 45 రోజుల్లోగా ఈ శకలాలు నాశనమవుతాయని సతీష్ రెడ్డి పేర్కొన్నారు.





