ArticlesNews

సంఘ కార్యానికి ప్రచారకులు ఎలా ఉపయోగపడతారంటే..

21views

ఏ సంస్థలో లేని విధంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో ‘‘ప్రచారక్’’ అనే ఓ పద్ధతి వుంది. అంటే పూర్ణ సమయం దేశం కోసం, సంఘ కార్య విస్తరణ కోసం పనిచేయడం. మొదట్లో ఈ పద్ధతి ఎక్కువగా వుండేది కాదు. కానీ.. ఎప్పుడైతే సంఘ కార్యాన్ని దృఢపరిచిన సమయంలో సఫలత కనిపించిందో అప్పుడు సంఘ కార్యాన్ని బాగా వేగంగా విస్తరింపజేయాలంటే ,పూర్తి సమయమిచ్చి పనిచేసే ప్రశిక్షిత కార్యకర్తలు ఎవరినైతే ఆ తర్వాత ప్రచారకులుగా పేర్కొనడం జరిగిందో పెద్ద సంఖ్యలో వుండాలన్న ఆలోచన బలంగా కలిగింది.

ఈ ఆలోచన ఓ వైపు.. సంఘ కార్యం చేయడానికి స్వచ్ఛందంగా తమ పూర్తి కాలాన్ని వెచ్చించడానికి సిద్ధపడిన వారి సంఖ్య కూడా దేశం లో పెరిగింది. వారు తమ తమ చదువును పూర్తి చేసుకొని, వేర్వేరు క్షేత్రాలకు, ప్రాంతాలకు వెళ్లడం ప్రారంభమైంది.

సంఘ కార్యానికి ప్రచారకులు ఎలా ఉపయోగపడతారంటే..
ప్రచారకుల మాధ్యమంగా సంఘ కార్యం వేగంగా విస్తరిస్తుంది. సంఘ్ లో ఓ గమ్మత్తు వుంటుంది. గృహస్థులైన స్వయంసేవకులు, ప్రచారకులు ఇరువురూ సంఘానికి అవసరమే. పరస్పర పూరకాలు. స్థానికంగా వుంటూ విద్యాభ్యాసం కొనసాగిస్తున్న వారితో, గృహస్థులుగా వుంటూ వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో నిమగ్నమైన వారితో ఆశించిన స్థాయిలో సంఘ కార్యం విస్తరించడం లేదని అనుకున్నారు.

ప్రచారకులుగా వున్న వారు కార్యాన్ని పెంచేవాళ్లు, అయితే సంపూర్ణ కార్యానికి ముఖ్య ఆధారం సమాజంలోని సామాన్య వ్యక్తులే. చదువుతూ వున్నవారు. చదువు ముగించుకొని వృత్తిలో, వ్యాపారంలో ప్రవేశించిన వారు, గృహస్థులై ఇంటిని నడుపుతూ వున్న వారు, మొదలైన వారే. యుద్ధ మైదానంలోకి వెళ్లి నిలబడే సైనికులకు కూడా ఇల్లు, కుటుంబం వుంటుంది.సైనికులు వుంటేనే దేశంపై జరిగే ఆక్రమణలను ఎదుర్కుంటాము, అంతర్గత సమస్యల పరిష్కారానికి ప్రయత్నం జరుగుతుంది.

గృహస్థులుగా వుంటూ ఇంటి బాధ్యతను మోస్తూ వున్న స్వయంసేవకులే సంఘానికి వాస్తవమైన ఆధారం. ప్రచారకుల జీవితం ఓ విధంగా అస్వాభివికం. సంఘచాలక్, కార్యవాహ వంటి బాధ్యతలలో వుంటూ సర్వ సాధారణ జీవితం గడుపుతూ వున్న స్వయంసేవకులు ఎన్నో రకాలుగా తమ మీద వచ్చి మీద పడుతున్న వ్యక్తిగత సమస్యలను, మోహాలను, అనుబంధాలను, సుఖదుఃఖాలను తమ వృత్తి వ్యాపారాలలో ఎదురయ్యే ఇబ్బందులను లెక్కచేయకుండానో, పరిష్కరించుకుంటూనో, భరిస్తూనో సంఘ కార్యాన్ని నిర్వహించే కార్యకర్తలే సంఘానికి వాస్తవమైన ఆధారం.

మన పనిని ప్రచారకుల మీద ఆధారపడి జరిగే ప్రచారకానువర్తిగా చేయరాదు. సామాన్య జీవినం గడుపుతూ వున్న వారిలో నుంచి ఒక బృందంగా కొందరు కార్యకర్తలైనా బాధ్యతలు వహించడానికి సిద్ధపడకపోయినట్లయితే, సంఘకార్యం సంతులితంగా వుండదు. రకరకాల సమస్యలతో సతమతమయ్యే స్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ ఆలోచించుకొని, సంతులితంగా సంఘ కార్యాన్ని ముందుకు తీసుకెళ్లాలి.

అయితే.. సంఘ కార్యాన్ని వేగంగా విస్తరింపజేయడానికి, అన్ని చోట్లా ఒకే రీతిలో పనిచేసే విధంగా ఒక నమూనా కార్య వ్యవస్థను నిర్మించడానికీ ప్రచారకులు అవసరమవుతారు.ఇతర సంస్థల మాదిరిగా ఇక్కడ కూడా కార్యకలాపాలు డీలాగా జరిగేటట్లయితే నిత్యసిద్ధ శక్తి నిర్మాణం సాధ్యమే కాదు. సంఘ కార్యం కొరకు అంకితులైన ప్రచారకులు మంచి సంఖ్యలో వున్నట్లయితే, మన కల్పనను అనుసరించి సంఘ కార్యాన్ని మంచిగాను, వేగంగానూ ముందుకు తీసుకొని పోగలుగుతాం. ప్రచారకుల ఉపయోగం స్పష్టంగా కనపడుతున్నందున ఈ వర్గం యొక్క అస్తిత్వాన్ని నిలిపి వుంచడం అవసరమవుతోంది. అంతేకాదు, వీరి సంఖ్య పెరుగుతూ వుండాలనే విషయంలోనూ ఎల్లప్పుడు శ్రద్ధ, పట్టుదల కలిగి వ్యవహరిస్తాం.

అయితే.. అన్నీ ప్రచారకే చేయాలని లేదు. గృహస్థులైన స్వయంసేవకులు కూడా ఓ ప్రచారక్ గా పనిచేయాలని స్వయంసేవకులు అనుకుంటుంటారు. గృహస్థులుగా వుంటూ, ప్రచారకుల మాదిరి అధిక సమయం ఇచ్చే కార్యకర్తలు కూడా సంఘ్ లో వుంటారు. ఎక్కడైనా శిబిరం జరిగినా అక్కడ పనులలో ఏవైనా లోటుపాట్లు ఏర్పడితే, వాటిని చేయడానికి ప్రచారక్ సిద్ధంగా వుంటారు. సంపూర్ణ సమయాన్ని సంఘ్ కే అర్పించినందున ఏ పనికీ అతడు కాదు అని చెప్పడు. అయితే అన్ని పనులూ ప్రచారకే చేస్తాడన్న దృష్టి కోణం కూడా సరైంది కాదు.