News

భారతదేశ వ్యాపారానికి కేంద్ర బిందువుగా విశాఖ: ప్రధాని నరేంద్ర మోదీ

387views

విశాఖపట్నం: విశాఖపట్నం భారతదేశం వ్యాపారానికి కేంద్ర బిందువుగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మౌలిక సదుపాయల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని చెబుతూ రైల్వేలు, రోడ్లు, పోర్టుల అభివృద్ధిలో దూసుకుపోతున్నామని చెప్పారు. రక్షణ, వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో విశాఖది కీలక పాత్ర అని గుర్తు చేశారు.

విశాఖపట్నంలో 10,500 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాప‌న చేసి, జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ లతో ఏపీ ప్రజలకు ఎంతో అభివృద్ధి జరుగుతుందని భరోసా వ్యక్తం చేశారు. టెక్నికల్, మెడికల్ రంగం ఏదైనా ఏపీ ప్రజలు ప్రత్యేకతను కనబరుస్తున్నారని, ఏపీ ప్రజల ఉన్నత వ్యక్తిత్వం వారిని ప్రత్యేకంగా నిలుపుతోందని ప్రధాని చెప్పారు. తెలుగు ప్రజలు అందరి బాగుకోసం పాటుపడుతారని ప్రధాని కొనియాడారు.

మిషన్ గతిశక్తి ద్వారా మౌలిక సదుపాయాల కల్పన చేస్తామని పేర్కొంటూ మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ ప్రతి నగరానికి అవసరమని, విశాఖపట్నం కూడా ఈ దిశగా ముందడుగు వేస్తోందని మోదీ పేర్కొన్నారు. పురాతన భారతదేశంలో విశాఖపట్నం ఒక ముఖ్యమైన ఓడరేవుగా వేల సంవత్సరాల క్రితం పశ్చిమాసియా మరియు రోమ్‌ లకు వాణిజ్య మార్గంలో భాగమని, నేటికీ ఇది భారత దేశ వాణిజ్యానికి కేంద్ర బిందువుగా నిలిచి ఉందని ఆయన పేర్కొన్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి