
జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య విషయంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పై తప్పుడు ఆరోపణలు చేసిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధి, CPIM పోలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరిల నుంచి చెరో రూపాయి నష్ట పరిహారం ఇప్పించవలసిందిగా RSS కోర్టును అభ్యర్ధించింది.
రాహుల్, ఏచూరిలకు ఇద్దరికీ దేశంలో ఎక్కడ హింసాత్మక ఘటన జరిగినా అందుకు ఆరెస్సెస్ కారణమని నిందించటం అలవాటుగా మారిందని, అది వారు మానుకునేలా చెయ్యాలని ఆరెస్సెస్ సభ్యుడు, పిటిషనర్ చంపేర్కర్ కోర్టును అభ్యర్ధించారు. రాహుల్, ఏచూరిలనిద్దరినీ వెంటనే పై విధంగా ఆదేశించవలసిందిగా చంపేర్కర్ తరపు న్యాయవాది ఆదిత్య ఆర్ మిశ్రా కోర్టును అభ్యర్ధించారు.
న్యాయవాది ఆదిత్య మిశ్రా మాట్లాడుతూ తమ వైపు నుంచి తాము రెండు విషయాలపై కోర్టును అభ్యర్ధించామని తెలిపారు. జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్యపై కాంగ్రస్, CPIM నాయకులు, కార్యకర్తలు ఆరెస్సెస్ పై అకారణంగా చేసిన, చేస్తున్న అసత్య ఆరోపణలను వెంటనే నిరోధించాలని కోర్టును అభ్యర్ధించడం అందులో మొదటిది కాగా, రాహుల్ గాంధీ, సీతారాం ఏచూరిల నుంచి చెరో రూపాయి పరువు నష్ట పరిహారం ఇప్పించవలసిందిగా కోర్టును అభ్యర్ధించామని తెలిపారు.

అడ్వకేట్ ఆదిత్య మిశ్రా
2017, సెప్టెంబర్ 5వ తేది జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య జరిగిన తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ “బీజేపీ, ఆరెస్సెస్ ల సిద్దాంతానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారెవరైనా ఒత్తిడికి, భౌతిక దాడులకు, చివరికి హత్యలకు కూడా గురి కావలసిందే” అని వ్యాఖ్యానించారు. సీతారాం ఏచూరి కూడా దాదాపు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అందుకే సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా ఆరెస్సెస్ ను నిషేదించారని ఏచూరి పేర్కొన్నారు. అయితే ఇవన్నీ అసత్యాలని, తమ పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలనీ పేర్కొంటూ ఆరెస్సెస్ కోర్టును ఆశ్రయించింది.
పిటిషనర్ వాదనలు విన్న తర్వాత సివిల్ జస్టిస్ భాటియా ఏప్రిల్ 30న రాహుల్ గాంధీ, సీతారాం ఏచూరిలిద్దరూ కోర్టు ముందు హాజరు కావలసిందిగా ఆదేశిస్తూ ఇద్దరికీ సమన్లు జారీ చేశారు.





