
జమ్ముకాశ్మీర్ కు చెందిన ప్రజల ఆర్ధిక, సామాజిక, జీవన స్థితిగతులను అతలాకుతలం చేస్తున్న ఆర్టికల్ 35A అత్యంత ప్రమాదకరమైనదని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు.
పండిట్ నెహ్రూ కాలంలో తీసుకున్న ఈ నిర్ణయం ఒక “ చారిత్రాత్మక తప్పిదం” అని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 35A రాష్ట్రపతి ఆమోదంతో 1954లో రహస్యంగా రాజ్యాంగంలో చొప్పించబడింది. రాజ్యాంగ రచనా కమిటీ రూపొందించిన రాజ్యాంగంలో గాని, ఆర్టికల్ 368 ప్రకారం ఉభయసభలలో 2/3వ వంతు మెజారిటీ సభ్యుల ఆమోదం ద్వారా చేసిన రాజ్యాంగ సవరణ ద్వారా గానీ పొందు పరచ బడినది కాదు. అని చెప్పారు.
ఆర్టికల్ 35A జమ్మూ కాశ్మీర్ ప్రజలను, ప్రభుత్వాన్ని మిగతా భారత దేశ ప్రజల నుండి వేరు చేస్తున్నదని ఆయన అన్నారు. జమ్మూ కాశ్మీర్లో నివసించే ప్రజలను, స్థానికులు, స్థానికేతరులు (కాశ్మీర్లో నివసిస్తున్న భారత్లోని ఇతర రాష్ట్రాల ప్రజలు)గా విభజిస్తున్నది. దశాబ్దాల నుంచి నివసిస్తున్నా సరే స్థానికేతరులకు కేవలం లోక్ సభ ఎన్నికలలో మాత్రమే తమ ఓటు వేసే హక్కు వుంటుంది. అసెంబ్లీ, మునిసిపల్, ఇతర స్థానిక సంస్థల ఎన్నికలలో ఓటు వేయడానికి అవకాశం వుండదు. వారి పిల్లలకు ప్రభుత్వోద్యోగాలు రావు అని వివరించారు.

అరుణ్ జైట్లీ మాట్లాడుతూ దశాబ్దాలుగా జమ్మూ కాశ్మీర్ ఆర్ధికంగా వెనుకబడి ఉండడానికి ఈ క్రూరమైన ఆర్టికల్ 35A నిబంధనలే కారణమన్నారు. ఆర్టికల్ 35A కారణంగా అక్కడ ఎలాంటి ఆర్ధిక సంస్కరణలకు గాని ఆర్ధిక స్థితిగతుల మెరుగుదలకుగాని అవకాశం లేకుండా పోతున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “అక్కడ ఏవైనా పరిశ్రమలుగాని, హోటళ్ళుగాని, ప్రైవేటు విద్యా సంస్థలు గానీ, హాస్పిటళ్ళుగానీ ఏర్పాటు చెయ్యడానికి ఏ ఒక్కరూ ముందుకు రారు. కారణం ఆర్టికల్ 35A ప్రకారం వారుగాని, వారి ప్రతినిధులుగాని అక్కడ భూమినిగాని, మరే ఇతర ఆస్తులుగాని కొనడం సాధ్యపడదు. కేవలం స్థానికులుగా గుర్తింప బడిన వారు మాత్రమే అక్కడ స్థిరాస్తులు కొనగలుగుతారు.” అని ఆయన అన్నారు.





