ArticlesNews

పాములు ప్రకృతి వరాలు… చంపకండి…

1.4kviews
  • నాగుల చవితి పర్వదినం సందర్భంగా…

పాములు ప్రకృతి వరాలు… అనాదిగా మానవాళి భావోద్వేగాలతో, లెక్కలేనన్ని ప్రయోజనాలతో ఎంతగానో పాములు పెనవేసుకుపోయాయి. అయితే, అర్థంలేని భయం, మూఢ నమ్మకాలతో ఒక పక్క పాముల్ని పూజిస్తూనే … మరోపక్క కనిపిస్తే… విచక్షణా రహితంగా చంపటం వలన ప్రపంచ వ్యాప్తంగా పాముజాతులు నేడు అంతరించిపోయే స్థితిలో ఉన్నాయి. ఈ దృష్ట్యా సర్ప జాతులపట్ల అవగాహన కల్పించి, వాటిని కాపాడేందుకు గ్రీన్ మెర్సీ సంస్థ, దాని అనుబంధoగా పనిచేస్తున్న సేవ్ స్నేక్స్ సొసైటీ సంయుక్తంగా చేస్తున్న చిరు ప్రయత్నాలను నాగుల చవితి పర్వదినం సందర్భంగా… వివరించే ప్రయత్నంలో భాగమే నాగ జాతులపై ఈ ప్రత్యేక వ్యాసం.

నాగుపాము… త్రాచుపాము… కోడె నాగు… రాచనాగు, కోబ్రా… ఇలా ఏ పేరుతొ పిలిచినా… పడగ విప్పి, రాజసంతో హుందా హొయలు ప్రదర్శించగల ప్రత్యేకత నాగ జాతి పాములకే సొంతం. భౌగోళిక స్థితిగతులు, వాతావరణ పరిస్థితులు కారణంగా నాగుపాముల్లో (Cobras ) వైవిధ్యభరితమైన రంగులు, శారీరక నిర్మాణం కనపడినా.. పడగ(Hood ) మాత్రం ప్రత్యేకంగా ఉండి, వాటికి గుర్తింపు తెస్తుంది. మెడ భాగంలోని రిబ్స్ విచ్చుకొనేలా చేసి పడగని ప్రదర్శిoచగల సత్తా నాగు పాములకి మాత్రమే ఉంది.

నాగ జాతుల్లో రకాలు

ప్రపంచం వ్యాప్తంగా కనిపించే నాగుపాముల్లో ప్రధానంగా ఆరు జాతులు ఉన్నాయి. అవి… కృష్ణ పాద ముద్రలు కలిగిన క్రిష్ణ నాగు లేదా నాగుపాము ( Spectacled Cobra – Naja naja), పడగ మీద విష్ణు చక్రం గుర్తుతో కనిపించే శేష నాగు (Monocled Cobra – Naja kaouthia ), నల్ల త్రాచు (Black Cobra – Naja melanolueca ), శ్వేత నాగు (Albino Cobra – Naja siamensis ), రాచ నాగు లేదా కింగ్ కోబ్రా (KingCobra – Ophiophagus hannah), ఈజిప్షియన్ కోబ్రా ( Eegipshian Cobra – Naja haje ), విషాన్ని విరజిమ్మే స్పిటింగ్ కోబ్రా (Spitting Cobra – Naja nigricollis ) తదితర నాగ జాతులు ఉన్నాయి. వీటన్నిటినికి ‘పడగ’ కలిగి ఉండే సారూప్యత కనిపిస్తుంది. వీటి విషం నూరోటాక్సిక్ గుణం కలిగి ఉంటుంది. వీటి విషంతో ఎంతో విలువైన ప్రాణ రక్షక ఔషధాలు తయారవుతున్నాయి. విష సర్పం కరిచినపుడు వాడే యాంటీ వెనం (Anti Venom ) ఇంజక్షన్ సైతం పాము విషం నుండే తయారవుతుంది. పాములు పగబడతాయనే మూఢ నమ్మకం ప్రచారంలో ఉంది. ఇందులో వాస్తవం లేదు. పాములు పగబట్టవు.

పాములలో తెల్లని ధవళకాంతులు వెదచల్లే శ్వేతనాగులు చాలా అరుదుగా కనిపిస్తాయి. దట్టమైన అడవులు, ప్రకృతి అందాలు వెల్లివిరిసే ప్రాంతాలు, ప్రశాంతతకు నెలవైన, మనుష్య సంచారంలేని చోట్లలో ఇవి దర్శనమిస్తుంటాయి. ఒంటరి తనాన్ని, ప్రశాంతతని పాములు ఇష్టపడతాయి.

కుండలినీ శక్తికి ప్రతీకలుగా వీటిని పతంజలి యోగశాస్త్రంలో పేర్కొనటం జరిగింది. సింహాచలం వరాహ నృసింహ క్షేత్రం సమీప పర్వతసానువుల అటవీ ప్రాంతంలో జల.. జల పారే జలపాతం సమీపంలో ఒక శ్వేతనాగుని నేను పదేళ్లకిందట చూసాను. అద్భుతమైన అందం, రాజసం… శ్వేతనాగు సొంతం. ఇక కింగ్ కోబ్రాల విషయానికి వస్తే… ప్రపంచంలోనే అత్యంత పొడవైన విషపూరిత సర్పం ఇది. దాదాపు 18 అడుగుల పొడవు వరకు పెరిగే ఈ జాతి పాములు భారత్, థాయిలాండ్ దేశాల్లో కనిపిస్తాయి. పర్వతం సానువుల, దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఇవి నివసిస్తాయి. అయితే… అడవుల నరికివేత, గ్రానైట్ తవ్వకాల పేలుళ్ళు వంటి మానవతప్పిదాల కారణంగా ఆవాసాలు ధ్వంసమై , అవి జనావాసాల్లోకి ప్రవేశించి మృత్యువాత పడుతున్నాయి. తూర్పు కనుమల్లో కింగ్ కోబ్రాల ఉనికిని కాపాడేందుకు గ్రీన్ మెర్సీ సంస్థ.. అటవీశాఖ, భావసారూప్యత కలిగిన స్వచ్చంద సంస్థలతో ఉమ్మడి కార్యాచరణకి సమాయత్తం అవుతోంది.

ఈజిప్షియన్ జాతి నాగులు, స్పిట్టింగ్ జాతి నాగులు మన దేశంలో లేవు. ఆఫ్రికా ఖండంలోని అడవులలో ఇవి కనిపిస్తాయి. ప్రపంచం వ్యాప్తంగా సర్పజాతులు ఆందోళన కలిగించే స్థాయిలో అదృశ్యం అయిపోతున్నాయి. పాముల పట్ల అవగాహన పెంచుకొని వాటిని కాపాడు కోవలసిన నైతిక బాధ్యత మన అందరిపై ఉంది. పాములు పూర్తిగా అంతరించిపోతే… చాలా దుష్పరిణామాలు దాపురిస్తాయి. ఎలుకల జనాభా పెరిగిపోయి… పంటల్ని ధ్వంసం చేస్తాయి. అంతేకాదు… ఎలుకల నుండి ‘ప్లేగ్ ‘ అనే వ్యాధి ప్రబలి యావత్ మానవాళిని కబళించివేస్తుంది. ఇది అక్షర సత్యo … రేపటి వాస్తవం…

ఎవరికైనా పాములు కనిపిస్తే… దయచేసి చంపకండి. విష పూరితమైనవి చాలా తక్కువ. విషరహితమైనవే ఎక్కువగా ఉన్నాయి. ఏ జాతి పామునైనా చంపొద్దు. కాపాడుకుందాం. ఎందుకంటే… పాములను కాపాడకపోతే అవి పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం పొంచి ఉంది. పాముల వలన ఎవరికైనా సమస్య వస్తే… గ్రీన్ మెర్సీ స్నేక్ రెస్క్యూ నెంబర్ (9848414658) కి, అటవీ శాఖ సిబ్బందికి దయచేసి ఫోన్ చేయండి.

– రమణ మూర్తి, గ్రీన్ మెర్సీ.