
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు.. విజయాలు అలవాటుగా మారాయి. ఇటీవలికాలంలో ఇస్రో ప్రయోగాలకు ఎదురులేకుండా పోతోంది. ముఖ్యంగా ఓటమన్నది ఎరుగని పీఎస్ఎల్వీ.. ఇస్రో కీర్తిని మరింత పెంచింది. రక్షణ అవసరాల కోసం చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ45 ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగం ద్వారా.. ఇంటలిజెన్స్ శాటిలైట్ ఇమిశాట్ తో పాటు.. విదేశాలకు చెందిన 28 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి చేర్చింది ఇస్రో. డీఆర్డీవో, ఇస్రో సాధించిన ఘనతకు.. ఇప్పుడు దేశమంతా గర్వపడుతోంది. పీఎస్ఎల్వీ-సీ45 ప్రయోగం సక్సెస్ పట్ల జేజేలు కొడుతోంది. ఇమిశాట్ ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టడం పట్ల రక్షణ రంగ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ.. ఇమిశాట్ గొప్పతనమేంటి..? ఈ ఉపగ్రహాన్ని ఉపయోగించుకుని శత్రువుకు మన సైన్యం ఎలా చెక్ పెడుతుంది..? అదెలా సాధ్యం..? దేశ సరిహద్దు రక్షణకు ఏమాత్రం విఘాతం కలగకుండా ఉండాలంటే.. బలమైన సైనిక పాటవం కావాలి. అత్యాధునిక ఆయుధాలుండాలి. వాటిని సరైన దిశలో నడిపించగల సమర్దవంతమైన నాయకత్వం కావాలి. కానీ, ఇవి మాత్రమే ఉంటే.. ఇప్పుడు లాభం లేదు. అంతరిక్షం నుంచి దూసుకువచ్చే ముప్పును కూడా తట్టుకోగలగాలి. అందుకే.. ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది భారత్. శత్రుదేశాల ఉపగ్రహాల పనిపట్టే.. అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటోంది.





