News

జోరు వానలోనూ ట్రాఫిక్ కంట్రోల్. “శాల్యూట్ టు సూపర్ పోలీస్” అంటున్న నెట్ జనులు.

575views

ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తుండగా హఠాత్తుగా వర్షం వస్తే.. ట్రాఫిక్ పోలీసులు తడవకుండా ఉండేందుకు ఏ చెట్టుకిందకో.. రోడ్డు పక్కకో వెళ్తుంటారు. అయితే ఓ కానిస్టేబుల్ మాత్రం కుండపోత వర్షంలోనూ డ్యూటీ చేస్తూ.. ఉద్యోగంపై తనకున్న ప్రేమను చాటాడు. గువాహటిలో నిన్న భారీ వర్షం కురిసింది. బసిస్థ చరియాలి ట్రాఫిక్ పాయింట్ వద్ద కుండపోత వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు మిథున్ దాస్ అనే కానిస్టేబుల్. రోడ్డు మధ్యలో ఎలాంటి రూఫ్ టాప్ లేని స్థలంలో నిలబడి.. వర్షంలో తడుస్తూ ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. వర్షాన్ని పట్టించుకోకుండా విధులు నిర్వర్తించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ వీడియో ఇపుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

వ‌ర్షంలోనూ చెక్కు చెదరని అంకిత భావంతో ఓ సిగ్నల్ వద్ద విధులు నిర్వహించిన‌ ట్రాఫిక్ పోలీస్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. వాహనదారులు ఆయనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. ‘‘మీ పేరులోనే అంకితభావం ఉంది. విధుల పట్ల అసాధారణ శ్రద్ధ కనబర్చిన ఏబీ కానిస్టేబుల్ మిధున్ దాస్‌కు సెల్యూట్ చేస్తున్నాం. అంకిత భావం ఉంటే తుపానునైనా చెల్లాచెదురు చెయ్యెచ్చని మీరు నిరూపించారు. అభినందనలు..’’ అని గువహటి పోలీస్ విభాగం ట్వీట్ చేసింది.