
జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని బుద్గాం జిల్లా సూస్టూ గ్రామంలో శుక్రవారం ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఓ ఇంట్లో ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేర జవాన్లు, జమ్మూకశ్మీర్ పోలీసులు కలిసి దాడి చేశారు. భద్రతాబలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. మరో ఉగ్రవాది కోసం జవాన్లు గాలిస్తున్నారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు సైనికులు సైతం గాయపడ్డారు.

జమ్మూలో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది అరెస్ట్:
జమ్మూలోని అనంతనాగ్ జిల్లాలో హిజ్బుల్ ముజాహిదీన్‌కి చెందిన ఓ ఉగ్రవాదిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు.. బిజ్బెహారా ప్రాంతంలో రమీజ్ అహ్మద్ దార్ అనే ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు. కుల్గాంకి చెందిన రమీజ్ అహ్మద్.. గత ఏడాదిన్నరగా హిజ్బుల్ ముజాహిదీన్ ద్వారా ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నట్టు స్థానిక పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు. అరెస్ట్ సమయంలో అతడి వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్టు ఆయన వెల్లడించారు.






