Articles

మనకు తెలియని మనవారి వ్యధలు 2 – “హే భగవాన్”

896views

న్నకూతుళ్ళను భగవాన్ దాస్ ఎందుకు అలా చేశాడు ?………

మాలా దాస్ కథ విని చెమర్చిన మాకళ్ళు తుడుచుకుంటూ పక్కకు చూసాం. ఆదరణ కోసం అమాయకంగా మావైపే చూస్తున్న అతని ముఖం మమ్మల్ని పిలిచినట్టు అనిపించింది. మాకు తెలియకుండానే మా అందరి అడుగులు అతని గుడారం వైపు చకచకా కదలిపోసాగాయి.

అతని పేరు భగవాన్ దాస్. ఆపేరు సార్థకమైనదేనని గుడారం లోపల చూసిన తరువాత అనిపించింది. చిన్న దీపం, అగరుబత్తి ధూపం. అలంకరించిన వివిధ దేవతా మూర్తుల రూపం మమ్మల్ని ఆకర్షించింది. ఎందుకు మీరు ఇక్కడకు వచ్చారు ? అనగానే అతని శరీరం కంపించింది. ముఖం నిండా చెమటలు, అర్ధమైంది అతని లోపల ఏదో భయంకరమైన విషాదం దాగుందని.

నీ కుటుంబం ఎక్కడ? అని అడగగానే గుడారాన్ని నిశ్శబ్దం ఆవరించింది. అప్రయత్నంగా భగవాన్ దాస్ కంటి నుండి కన్నీరు ప్రవహిచడం మొదలైంది. మాట్లాడటానికి అతని గొంతు రావడం లేదు. ఇంతలో మా చూపులు పక్కనే ఏవో శబ్ధాలు వినిపిస్తున్న పెట్టె వైపు తిరిగాయి. మాలో ఒకరు వెళ్లి చూడగానే షాక్ కి గురయ్యాం.

ఆ పెట్టె లోపల 6, 7 సంవత్సరాల వయసున్న ఇద్దరు పసిపాపలు ఉన్నారు. ఇంతలోనే బయటికి వచ్చి పరిగెడుతూ వెళ్లి భగవాన్ దాస్ ని నాన్నా అంటూ కౌగిలించుకొన్నారు. భయపడుతూ మావైపు చూస్తున్న ఆ చిన్నారుల చూపులు మేం గమనిస్తున్నాం. మేము కోపంగా “కన్న కూతుళ్ళని ఎందుకిలా చేశావు భగవాన్ దాస్ కనికరం లేకుండా పెట్టెలో బంధిస్తావా ?” అని అడిగితే…. అతను చెప్పిన సమాధానం విని మా కళ్ళ నుండి అప్రయత్నంగా కన్నీరు రావడం ప్రారంభించింది.

“మేం హిందువులం. పాకిస్తాన్లో రెండవ శ్రేణి పౌరులం. మాకు ఆస్తులు ఉన్నాయి కానీ అవి దోచుకోబడ్డాయి. మాకు కుటుంబాలు ఉన్నాయి. కానీ బానిసలుగా మార్చివేయబడ్డాయి. అన్న, చిన్నాన్న అని పిలిచిన వాళ్ళే నా భార్యను నాకళ్ళ ముందే అత్యాచారం చేసి చంపేశారు. పోలీసులు నవ్వుతూ “నువ్వైనా మిగిలావ్ సంతోషించు” అని చెప్పేశారు.

అక్కడ చదువుండదు. ఖురాన్ చదవడం మాత్రమే ఉంటుంది. బడిలో పాఠాలు ఉంటాయి. హిందువుల పిల్లలను రానివ్వరు. అనుమతించినా చదువుతో పాటు వేధింపులు ఉంటాయి.
అక్కడ బడిలో పనివాళ్ళు, ఆఖరికి ఐస్ క్రీం లు అమ్ముకునే వాళ్ళు సైతం చిన్న పిల్లలని కూడా చూడకుండా నా కూతుళ్ళను వేధిస్తుంటే, వాళ్ళు ఏడుస్తుంటే చూసి తట్టుకోలేక పోయాను. నాకున్నవన్నీ వదిలేసి నాచిట్టి తల్లుల సంతోషం కోసం, భవిష్యత్తు కోసం ఇక్కడకు వచ్చేశా. పాకిస్థాన్ వీధి  రాక్షసుల వికృతాల భయంతో నా బంగారు తల్లుల్ని ఇలా కాపాడుకోవడం అలవాటైపోయింది ” అని పిల్లల్ని పట్టుకుని భగవాన్ దాస్ ఏడుస్తుంటే చూసి తట్టుకోలేక పోయాం.

అక్కడ హిందువుల ఆడపిల్లలను అలాగే కాపాడుకోవాలేమో ? అనిపించగానే నేను నా సహాయకుడి చేతిని ఎందుకో గట్టిగా పట్టుకున్నాను. బహుశా పాకిస్థాన్ రాక్షసత్వం నన్ను కలవరపెట్టినట్టుంది.

కొద్దినెలలుగా నరకకూపంలాంటి పాకిస్థాన్ నుంచి ప్రాణాలు దక్కించుకోవడానికి, తమ కుటుంబ సభ్యులను కాపాడుకోవడానికి ఇంటిని, ఆస్థిని వదిలి కట్టుబట్టలతో, ఆకలితో నిండిన పొట్టలతో భారతమాత ఒడిలోకి వందలాదిగా చేరుతున్న హిందువులలో మూడు వారాల క్రితం కొత్తగా ఢిల్లీకి వచ్చిన 71 మందిలో ఒకడు భగవాన్ దాస్.

గత ఐదు సంవత్సరాలలో పాకిస్థాన్ నుండి ఢిల్లీకి వలస వచ్చిన వారిలో సుమారు 1,200 మంది మూడు శిబిరాల్లో నివసిస్తున్నారు. అటువంటి వారికోసం ఒక ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేసి వారికి కావాలిసిన కనీస అవసరాలు అందించడం వారిని ఆదరించడం ఇప్పుడిప్పుడే మొదలైంది.

ఢిల్లీ లో BBC వారు నిర్వహించిన ముఖాముఖీ సమావేశంలో వెలుగు చూసిన వాస్తవాలకు అక్షర రూపం ఈ యదార్థ కథనం.