News

మ‌రో బ‌డా స్కాం నిందితుణ్ణి అరెస్ట్ చేసిన మోదీ స‌ర్కార్

1.1kviews

ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్) ఆర్థిక నేర‌గాళ్ల భ‌ర‌తం ప‌డుతుంది. బ్యాంకుల‌కు రుణాలు ఎగ్గొట్టి విదేశాల‌లో విలాస‌వంత‌మైన జీవితాలు గ‌డుపుతున్న మాయ‌గాళ్ల‌ను ప‌ట్టుకునే ప‌నిలో చ‌క‌చ‌కా పావులు క‌దుపుతుంది. రూ.8,100 కోట్ల బ్యాంకు రుణం మోసం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గుజరాత్‌ ఫార్మాసంస్థ స్టెర్లింగ్‌ బయోటెక్‌ గ్రూప్‌నకు చెందిన హితేష్‌ పటేల్‌ను శుక్రవారం అల్బేనియాలో అదుపులోకి తీసుకున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) జారీ చేసిన ఇంటర్‌పోల్‌ నోటీసు ఆధారంగా అల్బేనియా రాజధాని టిరానాలో ఆ దేశ పోలీసులు పటేల్‌ను అదుపులోకి తీసుకున్నారు. త్వరలోనే ఆ దేశానికి వెళ్లి, అతన్ని భారత్‌కు రప్పించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు చెప్పారు.

ఈ కేసు ప్రధాన నిందితుల్లో ఒకరైన చేతన్‌ సందేసరాకు పటేల్‌ సమీప బంధువు అవుతారని తెలిపారు. నితిన్‌ సందేసరా ఈ కేసులో మరో ప్రధాన నిందితుడు. సందేసరా సోదరులు ఉపయోగించిన డొల్ల కంపెనీలకు నకిలీ డైరెక్టర్లను ఏర్పాటు చేయడంలో పటేల్‌ కీలకంగా వ్యవహరించినట్లు అధికారులు తెలిపారు. సందేసరా సోదరుల కోసం పటేల్‌ అక్రమ నగదు లావాదేవీలను నిర్వహించారని, పలు కంపెనీలకు డైరెక్టర్‌గా వ్యవహరించారని, రుణం ద్వారా పొందిన నిధులను విలాసవంతమైన కార్లను కొనుగోలు చేసేందుకు మళ్లించారని ఈడీ ఆరోపిస్తోంది.