
ముంబై: భారత సినీ పరిశ్రమ మరో లెజెండరీ సింగర్‌ను కోల్పోయింది. గొప్ప గొప్ప మధుర గీతాలను ఆలపించిన భూపిందర్ సింగ్ సోమవారం రాత్రి కన్నుమూశారు. భూపిందర్ సింగ్ మరణంతో బాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కొద్ది రోజులుగా భూపిందర్ సింగ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి పరిస్థితి విషమించి మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
భూపిందర్ సింగ్ ఐదు దశాబ్దాల పాటు బాలీవుడ్లో ఎన్నో సుమధురమైన గీతాలను ఆలపించారు. అనేక మంది దిగ్గజ సంగీత దర్శకులతో ఆయన పనిచేశారు. ‘నామ్ గమ్ జాయేగా’, ‘దిల్ ధూండతా హై’, ‘దో దివానే షెహర్ మే’, ‘ఏక్ అకేలా ఈజ్ షెహర్ మే’, ‘తోడి సి జమీన్ తోడా ఆస్మాన్’, ‘దునియా చూటే యార్ నా చూటే’ వంటి అనేక క్లాసిక్ పాటలు పాడారు భూపిందర్ సింగ్.
భూపిందర్ సింగ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఆయన పాటలు ఎంతో మందికి కదిలించాయన్నారు. దశాబ్దాల పాటు చిరస్మరణీయమైన పాటలను అందించిన భూపిందర్ సింగ్జీ మరణం బాధగిలిగిందన్నారు మోదీ. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్ సహా పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.
Source: EtvBharat





