
శ్రీనగర్ : కశ్మీర్ లో యుద్ధవాతావరణం ఏర్పడింది. ఆర్టికల్ 35A ఉత్కంఠ రేపుతోంది. సుప్రీంకోర్టులో సోమవారం నాడు విచారణ జరగనున్న నేపథ్యంలో ప్రపంచ దృష్టి ఇటువైపే మళ్లింది. అంతేకాదు ఇక్కడి ప్రాంతంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచే పోలీసులు భద్రత చర్యల్లో మునిగితేలుతున్నారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత కేంద్రం కశ్మీర్‌కు బీఎస్‌ఎఫ్‌ను పంపించడం గమనార్హం.
ఉత్కంఠ రేపుతున్న ఆర్టికల్ 35A :
కశ్మీరీలకు ప్రత్యేక హక్కులు కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 35A ను సవాల్ చేస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ నేపథ్యంలో సోమవారం (25.02.2019) నాడు విచారణ జరగనుంది. అయితే సర్వోన్నత న్యాయస్థానం తీర్పు తర్వాత అనుకోని పరిణామాలు సంభవిస్తే ఎదుర్కొనేలా కేంద్రం ముందస్తు చర్యలు తీసుకుంది. దాదాపు 100 కంపెనీల పారా మిలిటరీ బలగాలను కశ్మీర్ కు తరలించింది. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తగా.. భద్రతా బలగాలు రావడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచే పోలీసులు భద్రతా చర్యల్లో మునిగితేలుతున్నారు. జమాతే ఇస్లామీ జమ్ముకశ్మీర్ సంస్థ అధినేత అబ్ధుల్ హమీద్ ఫయాజ్ సహా వివిధ సంస్థలకు చెందిన దాదాపు 140 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఎన్నికల ఏర్పాట్లలో భాగంగానే బలగాలను పంపినట్లు కేంద్రం చెబుతున్నప్పటికీ.. ఇక్కడి రాజకీయ పార్టీలు, వివిధ సంస్థలు కేంద్రం తీరును తప్పుపడుతున్నాయి.





