
19/2/2019 మంగళవారం సామాజిక సమరసతా వేదిక అధ్వర్యంలో నెల్లూరులోని జయభారత్ హాస్పిటల్ ప్రాంగణంలో సంత్ రవిదాసు జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న విశ్రాంత తపాలా సూపరింటెండెంట్ శ్రీ శివ ప్రసాద్ మాట్లాడుతూ చర్మకార కుటుంబంలో జన్మించిన సంత్ రవిదాసు హిందూ సమాజంలోని అసమానతలను తొలగించడానికి కృషి చేశాడని తెలిపారు. ఇందుకోసం ఆయన తాను అనేక కష్టాలు అనుభవవించాడని తెలిపారు. శ్రీ రామానందుని శిష్యులలో ఒకరైన రవిదాసు తన చెప్పులు కుట్టే వృత్తిని కొనసాగిస్తూనే కృష్ణునిపై అద్భుత రచనలు చేశారని శ్రీ శివప్రసాద్ తెలిపారు. సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర నాయకులు శ్రీ కోడూరు సత్యం మాట్లాడుతూ సంత్ రవిదాసు సౌమ్య స్వభావము కలిగిన సాధు పురుషుడని, ఆయనవల్ల ఆయన కులవృత్తికి గౌరవం లభించిందని, రవిదాసు తాను కుట్టిన చెప్పులను సాధువులకు ఉచితంగా పంచిన ఉదారుడని, మత మార్పిడులను అడ్డుకున్న మహోన్నతుడని కొనియాడారు. ఆదిత్యా కళాశాల అధినేత ఆచార్య ఆదిత్య, జర్నలిస్ట్ శ్రీ జయప్రకాష్, సామాజిక సమరసతా వేదిక ప్రధాన కార్యదర్శి శ్రీ బూదూరు కేశవరాంలు మాట్లాడుతూ పుట్టిన కులం ఏదైనా వ్యక్తి ఉన్నతుడైతే ఆ వ్యక్తికి సముచిత గౌరవాన్ని ఇవ్వడానికి హిందూ సమాజం ఏనాడూ వెనుకంజ వెయ్యలేదనటానికి రవిదాసు జీవితమే ఉదాహరణ అని పేర్కొన్నారు. రవిదాసు త్యాగ నిరతిని, ఆయన సమాజానికి చేసిన సేవను కొనియాడారు.
ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ఇందుకూరు పేట శ్రీ లలితా మహేశ్వరీ పీఠాధిపతి పూజ్యశ్రీ మహేశానంద, ఆచార్య ఆదిత్యలు నగరంలోని కొందరు చర్మకారులను సత్కరించారు.
ఇంకా ఈ కార్యక్రమంలో శ్రీ నాగారెడ్డి హరికుమార్ రెడ్డి, శ్రీ గుర్రం సుధాకర్, శ్రీ ముప్పిరాల సుబ్రహ్మణ్యం, శ్రీ బాలాజీ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.





