News

అహ్మదాబాద్ బాంబు పేలుళ్ళ‌ కేసు: 38 మందికి ఉరిశిక్ష!

540views

గుజరాత్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో గుజరాత్ స్పెషల్ కోర్టు 38 మందికి ఉరిశిక్ష విధించింది. సీరియల్ బాంబు పేలుళ్ళ కేసులో ఇప్పటికే 49 మందిని దోషులుగా తేల్చిన కోర్టు.. వారికి ఇవాళ శిక్ష ఖరారు చేసింది. ఈ మేరకు జడ్జి ఏఆర్‌ పాటిల్‌ తీర్పు వెలవరించారు. ఒక కేసులో ఇంత మందికి ఉరిశిక్ష విధించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి.

ఈ కేసులో 38 మందికి ఉరిశిక్ష విధించగా.. మరో 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2008 జూలై 26న గంట వ్యవధిలోనే అహ్మదాబాద్ సిటీలోని 21 చోట్ల వరుస బాంబు పేలుళ్ళు సంభవించాయి. ఈ పేలుళ్ళ‌లో సుమారు 56 మంది చనిపోగా… 200 మందికి పైగా గాయాలపాలయ్యారు.

నిషేధిత స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్ మెంట్ ఆఫ్ ఇండియాకి చెందిన ఉగ్రసంస్థ ఇండియన్ ముజాహిదీన్‌తో సంబంధం ఉన్న వాళ్ళే ఈ పేలుళ్లకు పాల్పడ్డారని నిఘా సంస్థలు తేల్చాయి. 2002 గోద్రా అల్లర్లకు ప్రతీకారంగానే ఉగ్రవాదులు ఈ దారుణానికి పాల్పడ్డారని తెలిపాయి.

ఈ కేసులో మొత్తం 77 మంది నిందితులను గుజరాత్ స్పెషల్ కోర్టు విచారించింది. వీరిలో 49 మందిని దోషులుగా నిర్ధారించగా… సరైన సాక్ష్యాలు లేవని మరో 28 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి