
కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం గోకవరం గ్రామంలో ఉన్న భక్తకన్నప్ప గురుకులం ఆవాసంలోనూ మరియు దుద్యాల గ్రామంలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం నందు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నేతాజీ జయంతిని పురస్కరించుకుని ఆయనకు సభికులు ఘనమైన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమానికి రిటైర్డ్ సంగీత అధ్యాపకులు శ్రీ స్వామన్న ముఖ్య అతిథిగా విచ్చేశారు. సమరసత సేవా ఫౌండేషన్ మండల సహ కన్వీనర్ శ్రీ రాజగోపాల్ రెడ్డి, భక్త కన్నప్ప గురుకులం ఆవాస ప్రముఖ్ శ్రీ M. రామకృష్ణ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అతిథి శ్రీ స్వామన్న మాట్లాడుతూ 1897 జనవరి 23న భారత దేశంలోని ఒడిషా లోని కటక్ పట్టణం లో ఒక ధనిక కుటుంబంలో జన్మించిన సుభాశ్ చంద్రబోస్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లో భారత దేశంలో నాలుగవ స్థానాన్ని సంపాదించాడని తెలిపారు. తన ఉద్యోగానికి రాజీనామా చేసి సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి అది ఆచరణలో పెట్టిన వాడని, బోసు బాబు భారత స్వాతంత్ర సమరయోధుల లో అగ్రగణ్యుడని ఆయన అభివర్ణించారు.
భక్త కన్నప్ప గురుకులం ఆవాస ప్రముఖ్ శ్రీ యం రామకృష్ణ మాట్లాడుతూ స్వతంత్ర పోరాటం అనే యుద్ధంలో పోరాడిన సుభాష్ చంద్రబోస్ నేతాజీగా భారతీయుల హృదయాలలో నిలచిపోయిన మహానుభావుడని కీర్తించారు. నేతాజీ స్వాతంత్ర్యం కోసం తన రక్తం ధార పోసిన భారత స్వాతంత్ర సమరయోధుడని, నా భారత జాతి కోసం ఈ క్షణమే నా ప్రాణం అంకితం చేస్తున్నాను అని శపధం చేస్తూ ఉక్కు నరాలు బిగించి,ఇనుప కండరాలతో జైహింద్ అని నినదిస్తూ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ధీరోదాత్తుడు నేతాజీ అని ఆయన పేర్కొన్నారు. ఏడు ఖండాల సైన్యాన్ని పోగేసి, బ్రిటిష్ వారి చేత ఏడు సముద్రాల నీరు తాగించిన మహా వీరుడు నేతాజీ సుభాశ్ చంద్రబోస్ అని ఆయన పేర్కొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మన జీవిత మార్గదర్శి అని శ్రీ రామకృష్ణ అన్నారు. కార్యక్రమంలో పిల్లలు, పెద్దలు అందరూ ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. కార్యక్రమం చక్కటి వాతావరణంలో, ప్రేరణదాయకంగా జరిగింది.





