News

మన భూభాగంలో చైనా గ్రామాలా? అవాస్తవం!

439views
  • సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌

న్యూఢిల్లీ: భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుని గ్రామాలను నిర్మిస్తున్నట్టు వచ్చిన వార్తలను చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ తోసిపుచ్చారు. వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి భారత దేశం అవగాహనకు వ్యతిరేకంగా ఎటువంటి అతిక్రమణలు ఇప్పటి వరకు జరగలేదని స్పష్టం చేశారు.

భారత దేశం వైపు గ్రామాల నిర్మాణం కోసం చైనా దళాలు వచ్చినట్టు వెలువడుతున్న కథనాలపై వివాదం రేగిన నేపథ్యంలో ఈ కథనాలు పూర్తిగా అవాస్తవమని తెలిపారు. అయితే, గ్రామాలు ఉన్నప్పటికీ, అవి ఎల్‌ఏసీ నుంచి చైనా వైపు ఉన్నాయని తెలిపారు. భారత్‌-చైనా మధ్య ఇటీవలి ఘర్షణల నేపథ్యంలో భవిష్యత్‌లో ప్రజలను కానీ, సైన్యాన్ని కానీ ఎల్‌ఏసీ వద్దకు చేర్చాలనేది చైనా వ్యూహం అయి ఉండవచ్చునని ఓ మీడియా కాంక్లేవ్‌లో మాట్లాడుతూ వివరించారు.

ఇటీవల అమెరికన్‌ కాంగ్రెస్‌కు ఆ దేశ రక్షణ శాఖ పెంటగాన్‌ సమర్పించిన నివేదికలో భారత్‌-చైనా వివాదాస్పద భూభాగంలో గ్రామాలను చైనా నిర్మిస్తోందని పేర్కొన్న సంగతి తెలిసిందే. టిబెట్‌ అటానమస్‌ రీజియన్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌ మధ్యలో ఈ గ్రామాలు ఉన్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో సీడీఎస్‌ జనరల్‌ రావత్‌ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది.

చైనా ఆక్రమణలను అంగీకరించం

కాగా, పెంటగాన్‌ నివేదికపై భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందిస్తూ చైనా చట్టవిరుద్ధ ఆక్రమణను, అన్యాయమైన వాదనను అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. భారత్‌-చైనా సరిహద్దుల్లో వివాదంలో ఉన్న భూభాగంలో 100 ఇళ్లతో ఓ గ్రామాన్ని చైనా నిర్మించినట్టు చెప్తున్న పెంటగాన్‌ నివేదికను గమనించినట్టు భారత ప్రభుత్వం తెలిపింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి