News

పాకిస్తాన్ : మహిళా టిక్ టాకర్ పై వందలాది మంది పురుషుల దాడి

957views

పాకిస్తాన్ కు చెందిన ఒక భయానక వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో దర్శనమిచ్చింది. టిక్ ‌టాక్ వీడియోలతో ప్రసిద్ధి చెందిన ఒక మహిళను వందలాది మంది పురుషులు కొట్టడం, ఆమె దుస్తులను చింపివేయడం మనకు ఆ వీడియోలో కనిపిస్తుంది.

ఈ ఘటన పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగష్టు 14 న చోటు చేసుకోవడం గమనార్హం. దాంతో ఈ వీడియోకు ట్విట్టర్‌ టాప్ హ్యాష్ ‌ట్యాగ్ లు లభించాయి. వాటిలో ఒకటి, #minarPakistan, మరొకటి #400men. ఆ వీడియోని చూసి ఆగ్రహించిన నెటిజన్లు మహిళపై హింస పట్ల తమ దిగ్భ్రాంతిని మరియు అసహ్యాన్ని వ్యక్తం చేశారు.

బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఆగస్టు 14 న మినార్-ఇ-పాకిస్తాన్ సమీపంలో ఆమె తన బృందంతో కలిసి వీడియో చిత్రీకరిస్తున్నప్పుడు సుమారు 400 మంది గుంపు తనపైన మరియు తన స్నేహితులపైన దాడి చేసిందని ఆమె ఆరోపించింది.

“నన్ను లాగేశారు. నా బట్టలు చించేశారు.” అని ఆమె చెప్పింది, ఆ గుంపు ఆమెను ఎత్తుకుని గాలిలోకి ఎగురవేయడం ప్రారంభించిందని ‘ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ పేర్కొంది.

సాయం కోసం తాను ఎంత ఏడ్చినా ప్రయోజనం లేకపోయిందని, తనని ఎవరూ రక్షించలేదని ఆ మహిళ ఆరోపించింది.

వందలాది మంది పురుషులు ఆమెను కొట్టడం, ఆమె దుస్తులను చింపి గాలిలోకి విసిరేయడం వంటి దృశ్యాలున్న వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొట్టాయి.

తన బంగారు ఆభరణాలను కూడా గుంపులోని గుర్తు తెలియని వ్యక్తులు బలవంతంగా తీసుకెళ్లారని, మొబైల్ ఫోన్, నగదు కూడా లాక్కున్నారని ఆమె ఆరోపించారు.

“మన సమాజం నిజంగా ఎంత దిగజారిపోయిందో చెప్పడానికి ఇంతకంటే స్పష్టమైన ఆధారం మరొకటి ఉండదు.” అని మరియా అమీర్, డాన్ పత్రికలో వ్రాశారు. మనం స్వేచ్చ, స్వాతంత్ర్యాల అర్థాన్నే మార్చేశాం. మనం ఇంకా తీవ్రమైన లింగ వివక్ష మధ్య ఉన్నాము.

నగరంలోని లారీ అడ్డా పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్ రిపోర్టు) ప్రకారం, ఈ సంఘటన లాహోర్‌లోని గ్రేటర్ ఇక్బాల్ పార్క్ ప్రాంతంలో జరిగింది.

పాకిస్తాన్‌లో మానవ హక్కుల సంఘం (HRCP) 2020 సంవత్సరానికి విడుదల చేసిన పాకిస్థాన్‌లోని మానవ హక్కుల వార్షిక నివేదిక దేశంలోని మహిళల ఇబ్బందులను వివరిస్తోంది.

HRCP నివేదిక తోపాటు ప్రస్తుత ఈ సంఘటన కూడా దేశంలోని మహిళల హక్కుల పరిస్థితికి సంబంధించిన చిత్రాన్ని మరోసారి ప్రపంచం ముందుంచింది. HRCP నివేదిక పాకిస్థాన్ దేశవ్యాప్తంగా పెరుగుతున్న లైంగిక వేధింపులు మరియు గృహ హింసతో సహా మహిళలపై జరుగుతున్న హింసను కూడా బహిర్గతపరచింది.

Source : Organiser.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.