News

భారత్ అమ్ములపొదిలో సీహాక్‌ హెలికాప్టర్లు

A pair of US Navy Sikorsky MH-60R Seahawks, NE 712 166556 and NE 700 166541 of HSM-77 'Sabrehawks', cruise over the Pacific Ocean
724views

భారత నావికా దళం అమ్ములపొదిలో రెండు అత్యాధునిక హెలికాప్టర్లు చేరాయి. అమెరికా నేవీ నుంచి రెండు ఎమ్‌హెచ్‌-60ఆర్‌ సీహాక్‌ హెలికాప్టర్లను భారత్‌ కొనుగోలు చేసింది. వాటిని శాన్‌ డియాగోలోని నావికాదళ వైమానిక కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో అమెరికా నేవీ నుంచి భారత నేవీ అందుకుంది. నావికాదళం తరఫున వాటిని అక్కడి భారత రాయబారి తరణ్‌జిత్‌ సింగ్‌ సంధు స్వీకరించారు. ఈ మేరకు నేవీ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ హెలికాప్టర్ల చేరికతో భారత నావికాదళ పోరాట సామర్థ్యం మరింత పెరిగిందని తెలిపారు. వీటిని నడిపేందుకు నావికా దళ సిబ్బందికి చెందిన తొలి బృందం ప్రస్తుతం అమెరికాలో శిక్షణ పొందుతున్నట్లు వివరించారు.

ఎమ్‌హెచ్‌-60ఆర్‌ హెలికాప్టర్లను అమెరికాకు చెందిన లాక్‌హీద్‌ మార్టిన్‌ కార్పొరేషన్‌ తయారు చేసింది. ఎలాంటి వాతావరణంలోనైనా సమర్థంగా విధులు నిర్వర్తించగలగడం వీటి ప్రత్యేకత. పలు ప్రత్యేక విధులు నిర్వర్తించేందుకు వీలుగా ఆర్ట్‌ ఏవియానిక్స్‌, సెన్సార్ల తో వీటిని అభివృద్ధి చేశారు. ఈ శ్రేణిలో మొత్తం 24 హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు అమెరికాతో భారత్‌ ఒప్పందం కదుర్చుకుంది. భారత నావికాదళ వినియోగానికి, ఆయుధ ప్రయోగాలకు అనుగుణంగా ఈ హెలికాప్టర్లలో మార్పులు చేస్తారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.