
కాల్పుల విరమణ ఒప్పందం జరిగి నెల రోజులు కూడా పూర్తికాకుండానే మరోసారి గాజా బాంబుల మోతతో దద్దరిల్లింది. బుధవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ వాయుసేనకు చెందిన విమానాలు గాజాలోని ఖాన్ యూనిస్ అనే ప్రదేశంపై దాడులు చేశాయి. ప్రమాదకర పదార్థాలతో నింపిన బెలున్లను గాజా నుంచి వదులుతున్నారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ పేర్కొంది. ఈ బెలున్ల కారణంగా దేశంలోని పలు చోట్ల నిప్పు అంటుకొందని వెల్లడించింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ఫైర్ సర్వీస్ కూడా ధ్రువీకరించింది. 20 అగ్నిప్రమాద ఘటనలు చోటు చేసుకొన్నట్లు పేర్కొంది.
హమాస్ కార్యకలాపాలు నిర్వహిస్తోందన్న అనుమానంతో ఖాన్ యూనిస్‌పై ఇజ్రాయెల్ విమానాలు బాంబులు కురిపించాయి. ఎటువంటి పరిస్థితిని అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నట్లు ఇజ్రాయెల్ దళాలు పేర్కొన్నాయి. ఇక ఇజ్రాయెల్ దాడుల్లో గాయపడిన వారి వివరాలు మాత్రం తెలియలేదు. ఈ దాడులపై హమాస్ ప్రతినిధి మాట్లాడుతూ ”జెరూసలెంలోని పవిత్ర ప్రదేశాల్లో హక్కును కాపాడుకోవడానికి ప్రతిఘటన కొనసాగిస్తాం” అని పేర్కొన్నారు. మే 21 తర్వాత జరిగిన హింసాత్మక ఘటన ఇది.
గత నెలలో ముస్లింలకు పవిత్రమైన జెరూసలేంలోని అల్-అక్సా మసీదు వద్ద భద్రతా దళాలు.. స్థానికుల మధ్య భారీగా ఘర్షణలు జరిగాయి. తూర్పు జెరూసలేంలోని షేక్ జర్రా, సిల్వాన్ వద్ద పాలస్తీనీయులను ఖాళీ చేయించే క్రమంలో వివాదం చెలరేగింది. శుక్రవారం ప్రార్థనలకు వచ్చిన వారికి ఇజ్రాయెల్ దళాలకు మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ పరిణామాల తర్వాత గాజాపట్టీ నుంచి హమాస్ ఉగ్రవాద సంస్థ రాకెట్ దాడులను చేసింది. వందల సంఖ్యలో రాకెట్లను వినియోగించినట్లు ఇజ్రాయెల్ దళాలు పేర్కొంటున్నాయి. ప్రతి మూడు నిమిషాలకో రాకెట్ చొప్పున ప్రయోగించాయని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ట్విటర్‌లో పేర్కొంది. ఈ దాడులకు ప్రతిగా ఇజ్రాయెల్ ఎఫ్-16 యుద్ధవిమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడిలో పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. 11 రోజుల ఘర్షణ తర్వాత ఈజిప్ట్, అమెరికా చొరవతో కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది.





