
చైనాలో ఒక 41 ఏళ్ల వ్యక్తికి అరుదైన బర్డ్ ఫ్లూ స్ట్రెయిన్ ఇన్ఫెక్షన్ సోకింది. దీనిని ఈ స్ట్రెయిన్ తొలికేసుగా ధ్రువీకరించారు.
ఈ వైరస్ ఆయనకు ఎలా వచ్చిందనే వివరాలు అధికారులు వెల్లడించలేదు. కానీ, H10N3 స్ట్రెయిన్ అంత సులభంగా వ్యాపించదని భావిస్తున్నారు.
జియాంగ్సూ ప్రావిన్సులో ఉండే బాధితుడికి గత వారం చేసిన పరీక్షల్లో ఈ వైరస్ ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం కోలుకున్న ఆయనను త్వరలో డిశ్చార్జ్ చేయనున్నారు.
ఆయనకు వచ్చిన స్ట్రెయిన్ వైరస్ వేరే ఎవరికీ వ్యాపించలేదని అధికారులు కాంటాక్ట్ ట్రేసింగ్ ద్వారా గుర్తించారు.
“ఝెంజియాంగ్ నగరంలో ఉంటున్న ఆయన ఏప్రిల్ 28న ఆస్పత్రిలో చేరారు. ఒక నెల తర్వాత ఆయనకు పరీక్షల్లో H10N3 ఉన్నట్లు బయటపడింది” అని బీజింగ్ నేషనల్ హెల్త్ కమిషన్ మంగళవారం చెప్పింది.

“మనుషులకు H10N3 సోకిన కేసులు ప్రపంచంలో ఎక్కడా నమోదు కాలేదు. కోళ్ల నుంచి మనుషులకు వ్యాపించిన ఇది ఒక అరుదైన కేసు. ఇది భారీగా వ్యాపించే ప్రమాదం చాలా తక్కువే” అని ఎన్‌హెచ్‌సీ చెప్పినట్లు గ్లోబల్ టైమ్స్ తెలిపింది.
H10N3 స్ట్రెయిన్ కోళ్లలో తీవ్ర వ్యాధులకు కారణం కాదని, అది వేగంగా కూడా వ్యాపించదని కమిషన్ చెప్పింది.
ప్రస్తుతానికి ఇది మనుషుల్లో ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపిస్తున్నట్లు ఎలాంటి సూచనలు కనిపించలేదని డబ్ల్యుహెచ్ఓ రాయిటర్స్‌కు చెప్పింది.
ప్రస్తుతం H5N8 వేరియంట్ వల్ల కోళ్లలో వైరస్ వ్యాపిస్తోంది. దీంతో యూరోపియన్ దేశాల్లో కొన్ని లక్షల కోళ్లను గుంతలు తవ్వి పూడ్చిపెట్టారు.





