
భగత్ సింహ్ రాజగురు సుఖదేవ్ ల గురించిన ఆసక్తికర అంశాలు
భగత్ సింగ్ – సావార్కర్:
భగత్ సింహ్ ను కమ్యూనిస్ట్ గా చూపించడానికి వామపక్ష చరిత్రకారులు ఎన్నోఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు. ఐతే నిజం ఏమిటంటే భగత్ సింహ్ ను ఎక్కువగా ప్రభావితం చేసిన వారిలో ఒకరు శ్రీ లాల లజపతి రాయ్ ఆర్య సమాజికుడు కాగామరొకరు హిందుత్వ సిద్ధాంతాలను గట్టిగా సమర్ధించే శ్రీ వీర సావర్కర్.
శ్రీ సావర్కర్ చే రచించబడిన “1857 స్వాతంత్ర్య సంగ్రామం” అనే పుస్తకాన్నిభగత్ సింహ్ విప్లవ వీరులకు భగవద్గీత గా పేర్కొనే వారు. తానూ స్వయంగా ఈ పుస్తకాన్ని అచ్చు వేయించి ప్రతి యువ ఉద్యమకారుడికి దీన్ని పంచిపెట్టారు. అంతేకాదు ఈ పుస్తక ప్రచురణ కోసం తగిన అనుమతి తీసుకోడానికి 1928 లో మహారాష్ట్ర లోని రత్నగిరి కి స్వయంగా వెళ్లి శ్రీ వీరసావర్కర్ ను కలుసుకున్నారు.

భగత్ సింహ్- ఆర్య సమాజ్:
భగత్ సింహ్ జీవితంలో ఆర్య సమాజం యొక్క ప్రభావం చాలా ఉంది. ఆర్య సమాజ స్థాపకుడు స్వామి దయానంద్ యొక్క జన్మస్థలం గుజరాత్. ఈయన పూర్వ నామం మూలచంద్. సన్యాసి గా మారి జీవితాన్ని సమాజం కోసం దేశం కోసం అర్పణ చేయాలని నిర్ణయించుకుని దయానందుడిగా మారాడు. దేశమంతటా పర్యటించాడు. బెంగాల్ లో రామకృష్ణ పరమహంసని కేశవ చంద్ ను కలుసుకున్నారు. ఆ తర్వాత పంజాబ్ వెళ్లారు. భగత్ సింహ్ యొక్క మేనకోడలు వీరేంద్ర సింధు ఇలా రాశారు” సర్దార్ అర్జున్ సింహ్ ( భగత్ సింహ్ యొక్క తాతగారు) స్వామి దయానందుని దర్శనంతోనే ముగ్ధులయ్యారు. అతని ఉపన్యాసం వింటూనే ఉత్తేజితులై “ నవజాగరణ సేన “ లో చేరి ఆర్య సమాజీకులుగా మారిపోయారు “. అప్పట్లో సిక్కు విద్యాలయాలపై కూడా రాజుల యొక్క జాగీర్దార్ ల యొక్క నియంత్రణ ఉండేది. అందుకని అర్జున్ సింగ్ తన పెద్ద కుమారుడైన కిషన్ సింహ్ ( భగత్ సింహ్ యొక్క తండ్రి ) ను జలంధర్ లోని సాయిదాస్ ఆంగ్లో సంస్కృతి హై స్కూల్ లో చేర్చారు. తానూ అక్కడే ఉద్యోగం లో చేరి ఉండిపోయారు. భగత్ సింహ్ యొక్క తాతగారైన అర్జున్ సింహ్ సమాజ సేవ దేశసేవ మార్గం పట్ల ఎక్కువ శ్రద్ధ కలిగి ఉండేవారు. ఆయన కుమారుడు కిషన్ సింహ్ కూడా అదే దారిలో నడిచారు. 1898 లో ఒకసారి బరార్ ( విదర్భ ) ప్రాంతంలో తీవ్ర క్షామం ఏర్పడి అంటూ వ్యాధులు ప్రబలాయి. కిషన్ సింహ్ అప్పుడు 20 సంవత్సరాలవాడు. ఆర్య సమాజం అప్పుడు బరార్ సేవా సమితి ని స్థాపించింది. ఆ ప్రాంతంలో కావలసిన సరుకులను వస్తువులను సేకరించి అవసరమైన వారికి పంచడం కోసం సంస్థ తరుపున కిషన్ సింహ్ ను బరార్ పంపించారు. అతను ఆ పనులన్నింటిని ఎంతో సమర్థతతో చేశారు. అలాగే రెండేళ్ల తరువాత 1900 లో గుజరాత్ లో ఇలాంటిదే మరొక భయంకరమైన కరువు ఏర్పడినప్పుడు కిషన్ సింగ్ తన శిబిరాన్ని అహ్మదాబాద్ లో నిర్వహించారు. 1904 లో కాంగడా లో భూకంపం వచ్చినప్పుడు సహాయత సమితి ఏర్పడి కిషన్ సింహ్ దానికి మంత్రిగా ఎన్నుకోబడ్డారు. 1905 లో జీలం నదీ వరదల్లో కాశ్మీర్ లోయ అల్లకల్లోలం ఐనప్పుడు కిషన్ సింహ్ అక్కడ కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

(భగత్ సింహ్ – ఒక రగులుతున్న చరిత్ర – జీవితం ఆలోచన 21 ,22 ,23
రచయిత – హంసరాజ్ రహబర్
ప్రచురణ – భగత్ సింహ్ ఆలోచన వేదిక – ఢిల్లీ )
భగత్ సింహ్ యొక్క హిందూ సంస్కారాలు:
శ్రీ అర్జున్ సింహ్ తన మనుమలు జగత్ సింహ్, భగత్ సింహ్ లకు బాల్యంలోనే ఉపనయన సంస్కారాలు నిర్వహించారు. ఆరోజు వారిద్దరికీ శిరోజాలు ఉన్నాయి. ఐతే హిందూ సాంప్రదాయం ప్రకారం ఉపనయన సంస్కారం లో భాగంగా శిరోముండనం జరగాలి. కానీ అర్జున్ సింహ్ గారి భార్య జయ కౌర్ సిక్కు ధర్మ మూలాలు కలిగి ఉండడం వలన ఆవిడ ఈ కార్యక్రమానికి అభ్యంతరం చెప్పారు. బాలల శిరోజాల పట్ల ఆవిడ ప్రత్యేకమైన నమ్మకం కలిగి ఉన్నారు. “మిగతా క్రతువంతా నిర్వహించండి కానీ శిరోజాలు ఉండనివ్వండి” అని ఆవిడ తన భర్తను అభ్యర్ధించారు. ఆయన కూడా సరేనన్నారు. ఈ ఉపనయన సమయానికి ఈ బాలల తండ్రి శ్రీ కిషన్ సింహ్ దేశ సేవలో భాగంగా ఉద్యమ బాటలో పయనించి కారాగారంలో ఉన్నారు. అందువలన తాతగారైన శ్రీ అర్జున్ సింహ్ ఉపనయన కార్యక్రమం నిర్వహించారు. ఆ సందర్భంగా ఆయన ఇద్దరు మనుమలను కుడి ఎడమల రెండు భుజాలపైన ఎత్తుకుని “నేను నా ఈ ఇద్దరు వంశాంకురాలను ఈ యజ్ఞ వేదిక పై నిలబడిన వారిని దేశసేవ కొరకై అర్పిస్తున్నాను”అంటూ యజ్ఞవేదిక సాక్షి గా ఉద్వేగంగా ప్రకటించారు. ఐతే ఈ సంఘటన జరిగిన కొన్నాళ్లకే జగత్ సింగ్ జ్వరంతో జబ్బు పడ్డాడు. జ్వరం టైఫాయిడ్ గా పరిణమించి అతని ప్రాణాలను బలి తీసుకుంది. ఈ సంఘటన తాతగారిని తీవ్రంగా కలచివేసింది. ( 24 ,25 ,26 పేజీలు )

భగత్ సింగ్ తాత గారు సర్దార్ అర్జున్ సింగ్
భగత్ సింహ్ రాజగురు సుఖఃదేవ్ ల ఉరిశిక్ష:
1930 అక్టోబర్ 7 న న్యాయ స్థానము తీర్పును వెలువరించింది. ఈ తీర్పు 281 పేజీల్లో ఇవ్వబడింది. విచారణ ఎదుర్కొన్న వారందరికీ ఇలా శిక్షలు ఇవ్వబడ్డాయి.
ఉరిశిక్ష: 1.భగత్ సింహ్ 2. సుఖఃదేవ్ 3. రాజగురు.

ఆజన్మాంతర జీవిత ఖైదు కాలాపాని: 1.కిశోరీలాల్ 2. మహావీర్ సింహ్ (అండమాన్లో 9 రోజులు నిరాహార దీక్ష చేసి అమరుడయ్యాడు. 3. విజయ్ కుమార్ సింహ్ 4. శివవర్మ 5. గయా ప్రసాద్ 6. జయ దేవ్ కపూర్ 7. కమల్నాథ్ తివారి
జీవిత ఖైదు: 1.కుందాన్లాల్ ( 7 సంవత్సరాలు) 2. ప్రేమదత్ ( 5 సంవత్సరాలు)
అజయ్ ఘోష్, సురేంద్రనాథ్ పాండియ ఇంకా జితేంద్రనాథ్ సన్యాల్ లను విడిచిపెట్టారు. విచారణ లో ఉన్నవారందరూ కోర్టులను బహిష్కరించడం వలన తీర్పును లాహోర్ లోని సెంట్రల్ జైలు లో వినిపించారు.
ప్రభుత్వ న్యాయవాది భగత్ సింహ్ కు తీర్పును గురించి చెప్తూ – “భగత్ సింహ్! న్యాయస్థానం మీకు మరణశిక్ష విధించడం చాలా దుఃఖ కరమైన విషయం” అన్నారు. దీనికి భగత్ సింహ్ “ ఇందులో దుఃఖ పడవలసింది ఏమి లేదు. నాకీ సమాచారం ముందే అందింది” అన్నాడు. న్యాయవాది మరల ఇలా అన్నాడు “ భగత్ సింహ్! మీరు వీరులు. నేను మీ వీరత్వాన్ని ప్రశంసిస్తాను. కానీ ఇలా చిన్న వయసులో ఉరిశిక్ష పడటం మంచిది కాదు. మీరు భవిష్యత్తులో గొప్ప నేత కావలసినవారు” భగత్ సింహ్ ఇలా జవాబిచ్చాడు. “ ఈ చిన్న వయసులో ఉరిశిక్ష పడటం మరీ మంచిది. ఈ విషయంలో లో నాకు మా పెద్దవాళ్ళు చెప్పిన కబీర్ దాస్ పద్యం గుర్తొస్తోంది.
జిస్ మర్ నే తే జగ్ డరే మేరె మన్ ఆనంద్
మర్ నే తే హీ పాయియే పూరన్ పరమానంద్
( ఏ మరణం గురించి అయితే లోకం ఎప్పుడూ భయపడుతూ ఉంటుందో అది నాకు ఆనందం. నేను చనిపోవడం తో అది పరమానందం గా మారుతుంది.)
1931 మార్చ్ 23 న సాయంత్రం 7 గంటలకు లాహోర్ లోని కేంద్ర కారాగారంలో ఉరిశిక్ష అమలు పరిచారు. జైలు లోని ఇతర ఖైదీలందరినీ 5 గంటలకే లెక్కపెట్టి తమ తమ బ్యారెక్ లలో బంధించేసారు. ఉరిశిక్ష కోసం నల్లని ముసుగులు వేసి తీస్కొచ్చినప్పుడు భగత్ సింహ్ మధ్యలోను సుఖఃదేవ్ ఆయనకీ ఎడమ వైపున రాజ్ గురు కుడివైపున ఉన్నారు. భగత్ సింహ్ తన కుడిచేతిని రాజ్ గురు ఎడమ భుజం పైన, ఎడమ చేతిని సుఖ్ దేవ్ కుడి భుజంపైన ఉంచి నడిచారు. ముగ్గురూ ఇంక్విలాబ్ జిందాబాద్, సామ్రాజ్య వాదం నశించాలి అంటూ నినాదాలు చేస్తూ సమ స్వరంతో పాడటం మొదలుపెట్టారు.
దిల్ సే నిక్ లేగి న మర్ కర్ భీ వతన్ కీ ఉల్ఫత్
మేరీ మిట్టీ సే భీ ఖుష్ బూ ఏ వతన్ ఆయేగీ
( గుండెలనిండా ఉన్న దేశం యొక్క ఆలోచనలు చనిపోయినా ఆగవు. నా మట్టిలోనించి కూడా దేశం యొక్క సువాసన వస్తూనే ఉంటుంది. )

విప్లవ వీరుడు సుఖదేవ్ :
పంజాబ్ లోని లూథియానా జిల్లాలో నౌఘారా గ్రామంలో సుఖదేవ్ జన్మించాడు. తండ్రి రాంలాల్ థాపర్, లాయల్ పుర్ కి చెందిన ప్రసిద్ధ సామాజిక రాజకీయ కుటుంబానికి చెందినవాడు. సుఖదే వ్ ఎప్పుడూ నిశ్చింత గా ఉండేవాడు. ఏదైనా ఒక విషయం మనసుకు పడితే ఇక పరిణామాలు ఆలోచించకుండా అందులో దూ కే వాడు. స్నేహితులు ఈ విషయంలో వెక్కిరిస్తూ ఉండేవారు.. ఎవరినైనా ముక్కు మీద కొడితే వారు మన ఆధీనంలో కి వస్తారని అతను ఒకసారి ఎక్కడో చదివాడు. ఇక దానిని పరీక్ష చేయాలని అనుకున్నాడు. దారిలో వెళుతూ తనకు ఎదురొచ్చిన ఒక పహిల్వాన్ ముక్కు మీద పిడిగుద్దులు కురిపించాడు. అతను వెంటనే రెండు చేతులతో తల పట్టుకుని పడిపోయాడు. సుఖదెవ్ అతనిని చూస్తూ అక్కడే నుంచుని ఉన్నాడు. తర్వాత కాసేపటికి పహిల్వాన్ తెలివి తెచ్చుకొని చూసేసరికి తనని కొట్టిన వాడు ఎదురుగానే నిలబడి చూస్తున్నాడు. అతను ఒక్కసారిగా కోపంతో సుఖదేవ్ మీదపడి విపరీతంగా కొట్టాడు. కానీ సుఖ దేవ్ అతనిని కాస్త కూడా ఎదిరించ లేదు. చుట్టుపక్కల వాళ్ళు పోగయ్యి ఇద్దరినీ విడిపించారు.అందరూ సుఖ దేవ్ ని’ పహిల్వాన్ పడిపోగానే పారిపోక ఎందుకు నుంచుని చూస్తున్నావ్’ అని అడిగారు. దానికి సుఖ దేవ్ “ముందు నేను అతన్ని కొట్టాను కదా, ఇపుడు అతను నన్ను కొడుతున్నాడు అంతే” అని తాపీగా సమాధానం చెప్పాడు. “అసలు ఒక్క దెబ్బతో ఒక వ్యక్తి ఎంత సేపు మూర్ఛ లో ఉంటాడో చూడటానికే ఇక్కడే నుంచుని చూస్తున్నా ను “అని అన్నాడు. సాండ్ ర్స్ హత్య తర్వాత భగత్ సింగ్, రాజ్ గురు లను సురక్షితంగా తప్పించి ,పోలీసులకు టోకరా ఇచ్చి తనుకూడ కాన్పూర్ చేరుకున్నాడు. అక్కడి నుండి ఆగ్రా వెళ్ళాడు. అక్కడ మళ్ళీ భగత్ సింగ్ వచ్చి కలిశాడు. ఇద్దరూ కలిసి అక్కడ యతింద్ర నాథ్ దాస్ దగ్గర బాంబులు తయారు చేయడం లో శిక్షణ పొందారు. తిరిగి లాహోర్ వచ్చి గుజర్ సింగ్ కోట దగ్గర కాశ్మీర్ బిల్డింగ్ అద్దెకు తీసుకొని బాంబుల కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. తరువాత కాలంలో జైలు లో ఉన్నపుడు కూడా అతను ఎప్పుడూ కులాసాగా సంతోషంగా ఉండేవాడు. చివరికి 1930 అక్టోబరు 7 న భగత్ సింగ్,రాజ్ గురు, సుఖ్ దేవ్ లకు ఉరి శిక్ష ఖరారు చేసారు. జైలు బయట ప్రజలు దీనికి వ్యతిరేకంగా ఎంతో ఆందోళన లు చేశారు.. సుఖ దేవ్ జైలు నుండి తన సందేశం పంపించాడు.” నిజానికి మా ఉరి శిక్ష లను మార్చడం వలన జరిగే మేలు కంటే మేము ఉరి కంబం ఎక్కడం వల్లనే దేశానికి ఎక్కువ ప్రయోజనం ఉంటుందని” చెప్పాడు. 1931 మార్చ్ 23న వారు ముగ్గురినీ ఉరికంబం దగ్గరకు తీసుకు వచ్చినపుడు సంతోషంగా పెద్దగా “ఇంక్విలాబ్ జిందాబాద్” ,అని నినాదాలు చేశాడు. దానితోపాటు ‘భగత్ సింగ్ జిందాబాద్’, ‘రాజ్ గురు జిందాబాద్’ అని కూడా అరిచాడు. ఎంతో ప్రేమతో ఉరికంబాన్ని చూస్తూ, ఆ తాడుని ముద్దు పెట్టుకొని, స్వయంగా తన చేతులతో మెడకి తగిలించుకుని బలిదానం కోసం ముందుకి నడిచాడు.

శివరాం హరి రాజ్ గురు :

విప్లవ వీరుడు భగత్ సింగ్ తో పాటు మాతృభూమి పాదాల వద్ద ప్రాణాలు అర్పించిన రాజ్ గురు పూర్తి పేరు శివరాం హరి రాజ్ గురు. మహారాష్ట్ర లోని పూనా జిల్లాలో, ఖేడ అనే గ్రామంలో 1908 ఆగస్టు 24 న ఈయన జన్మించాడు. మొదటి నుండి ఇతని జీవితం సంఘర్షణమయం గా ఉండేది. ఆరేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయాడు. అన్నగారు దినకర్ హరి రాజ్ గురు ఇతని పాలనా పోషణ చూసేవాడు. ఎంతో పేదరికంలో బాల్యం గడిచింది. 15 ఏళ్ళ వయసులో ఇల్లు వదలి వారణాసి కి వచ్చేశాడు. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి సంస్కృత విద్యాభ్యాసం చేశాడు. అక్కడే ఉద్యమకారు లతో పరిచయం ఏర్పడి వారితో కలసి లాహోర్ వెళ్ళాడు. అక్కడ భగత్ సింగ్,భగవతి చరణ్, సుఖదేవ్ లతో కలసి ఉద్యమకారుడిగా పని చేయడం మొదలు పెట్టాడు. ముందుగా రాజ్ గురు తన సహచరుడు శివవర్మ తో కలసి డిల్లీ కి చెందిన ఒక ద్రోహిని కాల్చి చం పే పనిలో నియమింపబడ్డాడు. ఈ పనిలో విజయం సాధించి తమ శక్తిని చాటుకున్నారు. లాఠీఛార్జ్ లో శ్రీ లాలా లజపతి రాయ్ హత్య , సాండర్స్ హత్య సంఘటన తరువాత పరిణామాలు మారిపోయి చంద్రశేఖర్ ఆజాద్,భగత్ సింగ్ లు కలిసి స్కాట్ కు లాహోర్ లో మృత్యు దండన విధించాలని నిర్ణయించిన కార్యక్రమంలో రాజ్ గురు కూడా చేర్చబడ్డాడు. ఆజాద్ ఉద్దేశ్యంలో “రాజ్ గురు ధైర్య వంతుడే కాదు, సమయస్ఫూర్తి కలిగినవాడు.”
మనుషులకి వ్యక్తిత్వ వికాసం, విచక్షణ చాలా ముఖ్యమైనది. ఇది సంపూర్ణ స్వేచ్ఛ ఉన్నపుడే సాధ్యమవుతుంది.
భగత్ సింగ్ వచనాలు ,.
“జీవితం మన భుజాల పైన ఆధారపడి మాత్రమే నడుస్తుంది. ఇతరుల భుజాలు కేవలం మరణం తర్వాతే”
దేశసేవ నా ధర్మం.
“దేశ భక్తులని జనం తరచూ పిచ్చి వాళ్లు గా భావించడం జరుగుతుంది”
“ఏ వ్యక్తినైనా చంపడం సులభమే కానీ అతని ఆలోచనలను కాదు. మహా సామ్రాజ్యాలు కూలిపోయి శిధిలం కావచ్చు, కానీ ఆలోచనలు ఎప్పటికీ నిలిచే ఉంటాయి.”





