
పొరుగు దేశాలు సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తున్న వేళ దేశ ఆయుధ సంపత్తిని పెంచుకొనే దిశగా కేంద్రం చర్యలను ముమ్మరం చేసింది. ఈ మేరకు అత్యాధునిక ఆయుధాల కొనుగోళ్లను వేగవంతం చేసింది. గత ఏడాది కాలంలో అమెరికా నుంచి 3.4 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను కొనుగోలు చేసింది. 2019లో అమెరికా నుంచి ఆయుధ కొనుగోళ్లు 6.2 మిలియన్ డాలర్లు మాత్రమే ఉండగా.. ఈసారి మాత్రం భారీగా పెంచింది.
భారత్ నుంచి కొనుగోళ్లు పెరిగినప్పటికీ అమెరికా నుంచి ఆయుధ ఎగుమతులు మాత్రం తగ్గాయని అమెరికా రక్షణ భద్రతా సహకార సంస్థ (డీఎస్‌సీఏ) నివేదిక వెల్లడించింది. 2019లో 55.7 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను ఎగుమతి చేసిన అమెరికా.. 2020లో 50.8 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను మాత్రమే ఎగుమతి చేయగలిగింది. అమెరికా నుంచి ఆయుధ కొనుగోలును ప్రపంచ దేశాలు తగ్గించడంతో ఈ పరిస్థితి ఎదురైంది. అమెరికా నుంచి సౌదీ అరేబియా దిగుమతులు భారీగా తగ్గించుకున్నట్టు ఆ నివేదిక తెలిపింది. మరోవైపు, పాకిస్థాన్ కు ఎలాంటి మిలటరీ, భద్రతా సహకారం అందించకూడదని అమెరికా బయటకు చెబుతున్నప్పటికీ ఆ దేశానికి కూడా ఆయుధ విక్రయాలు జరిగినట్టు సీఎస్‌డీఏ నివేదిక వెల్లడించింది.





