వ్యవసాయ ఉత్పత్తులను MSP కంటే తక్కువకు కొనుగోలు చేయడాన్ని నేరంగా పరిగణించాలి – భారతీయ కిసాన్ సంఘ్

డిల్లీ సమీపంలోని సింగు సరిహద్దు వద్ద కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న రైతుల ఆందోళనపై ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ భారతీయ కిసాన్ సంఘ్ (బికెఎస్) మౌనం వీడింది. ప్రభుత్వ, ప్రైవేటు మండీలలో కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) కు భరోసా ఇవ్వడానికి తాము అనుకూలమని, ఆహార ధాన్యాలను కనీస మద్దత్తు ధరకంటే తక్కువకు రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయడాన్ని నేరంగా పరీగణించాలని BKS పేర్కొంది.
డిల్లీ సరిహద్దుల్లో నిరసన వ్యక్తం చేస్తున్న రైతు సంఘాలు కొత్త చట్టాలను పూర్తిగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేయడానికి ఒక ప్రధాన కారణం, ఆ చట్టాలలో ప్రైవేటు కొనుగోలు దారులు రైతుల ఉత్పత్తులను కనీస మద్దతు ధర MSP కన్నా తక్కువకు కొనుగోలు చేయకుండా చూసుకోవటానికి తగిన విధంగా నిబంధనలు లేకపోవడమే.
ప్రస్తుత నిబంధనలకు బదులుగా రైతులు మరియు ప్రైవేటు కొనుగోలుదారుల మధ్య వివాదానికి సంబంధించిన వివాదాలను విచారించడానికి ప్రభుత్వం ప్రత్యేక వ్యవసాయ న్యాయస్థానాలను ఏర్పాటు చేయాలని BKS కోరింది. అలాంటి వివాదాలను ప్రస్తుతం స్థానిక ఎస్‌డిఎమ్‌కి పంపుతున్నారు.
ప్రస్తుతం ప్రభుత్వం తీసుకొచ్చిన వసాయ చట్టాల ప్రకారం ఒక రైతు తన ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు. అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ (ఎపిఎంసి) (ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మండిస్) లో లేదా రోడ్లపై ప్రైవేట్ మండీల్లో ఎక్కడైనా రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు.
“ మా లక్ష్యం ఏమిటంటే రైతులు ఎప్పుడూ తమ కనీస మద్దతు ధరను పొందాలి. ఎంఎస్‌పి కంటే తక్కువకు రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయడం క్రిమినల్ నేరంగా పరిగణించాలి ”. అని బికెఎస్ ప్రధాన కార్యదర్శి బద్రి నారాయణ్ చౌదరి శుక్రవారం విలేకరుల సమావేశంలో అన్నారు.
మూడు వ్యవసాయ బిల్లులను తీసుకొచ్చ్చిన తరువాత కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన ప్రారంభించిన మొదటి రైతు సంఘం బికెఎస్ అని చౌదరి అన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 3 వేల తహసీళ్లలో బికెఎస్ నిరసన కార్యక్రమాలు నిర్వహించిందని, వ్యవసాయ బిల్లుల సమస్యపై 20,000 గ్రామ సమావేశాల ద్వారా రైతులతో సంప్రదింపులు జరిపామని ఆయన చెప్పారు.
కానీ ప్రస్తుత ఆందోళన హింసాత్మకంగా మారినందున బికెఎస్ దానికి దూరంగా ఉండాలని ఎంచుకున్నట్లు చౌదరి వివరించారు.
“రైతులకు తమ ఎంఎస్‌పి పారదర్శకంగా మరియు ప్రయోజనకారిగా ఉండేలా చూడటానికి బికెఎస్ ప్రయత్నిస్తోంది.
రైతుల కోసం పని చేసిన 40 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర మాకు ఉంది. కాని మా కార్యకలాపాలెప్పుడూ అహింసాయుత పద్ధతిలోనే ఉంటాయి. అందుకు అనుగుణంగానే మేము పనిచేస్తున్నాము.
బికెఎస్ మరియు ప్రభుత్వం మధ్య పరస్పర చర్చలపై ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, బిల్లులను ప్రవేశపెట్టే ముందు ప్రభుత్వం తమతో ఎటువంటి సంప్రదింపులూ జరుపలేదని ఆయన అన్నారు. రైతులకు బకాయిలు ఇప్పించడానికి బికెఎస్ పోరాడటమే కాదు, ప్రభుతంపైన, దాని యంత్రాంగంపైన ఒత్తిడి తెచ్చిందని శ్రీ చౌదరి అన్నారు.
“ప్రస్తుత చట్టం ప్రకారం, రైతు మరియు కొనుగోలుదారు మధ్య ఏదైనా వివాదం ఉంటే, దానిని పరిష్కరించే అధికారం DM మరియు SDM లది అవుతుంది. బిజీగా ఉండి నిరంతరం పెద్ద పెద్ద సందర్శకుల క్యూ లైన్లు కలిగి ఉండే అధికారుల కార్యాలయాలలోకి వెళ్ళడానికి కూడా రైతులు ఎలా భయపడతారో మనందరికీ తెలుసు. మేము రైతుల కోసం ప్రత్యేక కోర్టులను డిమాండ్ చేశాము “అని చౌదరి చెప్పారు. ప్రతిష్టంభన ఏర్పడిన సమయంలో రైతులు మరియు ప్రభుత్వం ఇద్దరూ ప్రతిష్ఠంభనను పరిష్కరించడానికి మధ్యే మార్గంగా కలుసుకోవాలని కోరారు.
“ఈ మూడు చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతులు అంటే, అది సరియైన పరిష్కారం కాదు. అలాగే ప్రభుత్వం రైతుల ఆందోళనలను అర్థం చేసుకుని వారితో తగిన విధంగా చర్చించాలి. అప్పుడే పరిష్కారం సాధ్యం”. అని శ్రీ చౌదరి తెలిపారు.
శుక్రవారం నాటికి దేశ రాజధాని సరిహద్దులో రైతుల ఆందోళన తొమ్మిదవ రోజుకి చేరింది. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్, నిరసన తెలిపిన రైతు సంఘాల నాయకులతో ఏడు గంటల సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. సమావేశం తరువాత, వ్యవసాయ చట్టాలలో కొన్ని మార్పులు చేయడానికి ప్రభుత్వం సుముఖంగా ఉందని కూడా మంత్రి ప్రకటించారు.
అయితే, ప్రభుత్వం ఈ చట్టాలను వెనక్కి తీసుకొని తమతో విస్తృత సంప్రదింపులు జరపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయ మంత్రి, రైతుల మధ్య చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి.
SOURCE : NEWS 18





