
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ :

భారతీయ సంగీతం అత్యంత అద్భుతమైన ఓ స్వరాన్ని కోల్పోయిందని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. యావత్ దేశ సంగీత ప్రియులకు ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం మరణం తీరనిలోటు అని రాష్ట్రపతి ట్విటర్‌లో సంతాపం వ్యక్తంచేశారు. ‘గాన చంద్రుడి’గా పిలుచుకునే బాలసుబ్రహ్మణ్యం, పద్మ భూషణ్‌తోపాటు ఎన్నో జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా బాలు కుటుంబ సభ్యులకు, మిత్రులకు భారత రాష్ట్రపతి సానుభూతి తెలియజేశారు.
కోలుకుంటున్నారని సంతోషించా.. అంతలోనే..

గాన గంధర్వుడు, ప్రఖ్యాత సినీ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మరణం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న అనుంబంధాన్ని గుర్తు చేసుకుంటూ ట్విటర్‌లో భావోద్వేగ సందేశాన్ని ఉంచారు. బాలు ఆస్పత్రిలో ఉన్న రోజుల్లో ఆయన ఆరోగ్యంపై వాకబు చేసిన విషయాన్ని వెల్లడిస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కోలుకుంటున్నారని తెలిసి సంతోషిస్తున్న తరుణంలోనే ఇలా జరగడం తీవ్ర బాధను కలిగించిందన్నారు. ఒకే ఊరివాడైనందున చిన్నప్పటి నుంచి ఉన్న పరిచయాన్ని ప్రస్తావిస్తూ.. ఆయన చేసిన కృషిని గుర్తుచేశారు.
”ప్రముఖ నేపథ్య గాయకుడు, ఐదున్నర దశాబ్దాలుగా తమ అమృత గానంతో ప్రజలను అలరింపజేసిన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం అనారోగ్య కారణాలతో పరమపదించడం దిగ్భ్రాంతి కలిగించింది. గాన గంధర్వుడైన ఎస్పీ బాలు మా ఊరివాడైనందున చిన్నప్పటి నుంచి చాలా పరిచయముంది. ఆయన కోలుకుంటున్నారని, రోజూ కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడుతున్నారని తెలిసి సంతోషిస్తుండగానే ఇలా జరగడం బాధాకరం. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వివిధ భారతీయ భాషల్లో ఎన్నో పాటలకు ప్రాణం పోసిన బాలు ఈటీవీలో పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా వేలాది యువ తెలుగు గళాల్ని వెలుగులోకి తీసుకొచ్చారు” అని వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు.





