కరోనా వ్యాప్తి గురించి చైనాకు ముందే తెలుసు – అయినా ఆ సమాచారాన్ని కప్పిపుచ్చింది – WHO మౌనంగా ఉండిపోయింది – చైనా వైరాలజిస్ట్ వెల్లడి

“డిసెంబర్ నుండి వుహాన్ నుండి కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు చైనా ప్రభుత్వానికి తెలుసు, కాని అంతర్జాతీయంగా చైనా ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉన్నందున ఆ సమాచారాన్ని చైనా కప్పిపుచ్చింది.” అని చైనా వైరాలజిస్ట్ యాన్ లి – మెంగ్ ఆన్ వెల్లడించారు.
హాంగ్ కాంగ్ విశ్వవిద్యాలయంలోని మాజీ పరిశోధకురాలు యాన్ లి – మెంగ్ ఆన్ ‘ఫాక్స్ న్యూస్’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైనా కరోనా వైరస్ వ్యాప్తి సమాచారాన్ని కప్పిపుచ్చిందని ఆరోపించారు. అది బహిర్గతమవడానికి ముందే ఆ ప్రాణాంతక వైరస్ గురించి చైనా అధికారులకు బాగా తెలుసునని తాను నమ్ముతున్నానని యాన్ లి అన్నారు. గతంలో విశ్వవిద్యాలయ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) రిఫరెన్స్ ల్యాబ్‌లో పనిచేసిన యాన్, ప్రారంభంలోనే ఆ మహమ్మారి మనుషులలో ఒకరి నుంచి మరొకరికి సోకుతుందని తాను చేసిన పరిశోధనల వివరాలను తన పర్యవేక్షకులు విస్మరించారని, కానీ ఆ సమాచారం చాలా మంది ప్రాణాలను రక్షించగలిగి ఉండేదని ఆమె అన్నారు.
ఈ విషయాలను వెల్లడించిన తర్వాత ఆమె (యాన్) చైనా అధికారుల నుండి తన ప్రాణానికి ముప్పు వస్తుందనే భయంతో ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. ఏప్రిల్ 28 న కాథే పసిఫిక్ విమానంలో తాను హాంకాంగ్ నుంచి అమెరికాకు పారిపోయి వచ్చానని యాన్ తన ఇంటర్వ్యూలో చెప్పారు. హాంకాంగ్‌లో గనుక తన పరిశోధనల వివరాలను పంచుకుంటే ఇతర విజిల్-బ్లోయర్స్ మాదిరిగానే తాను కూడా “అదృశ్యమై చంపబడతానని” ఆమె భయపడ్డారు. COVID-19 యొక్క సత్యాన్ని ప్రపంచానికి వివరించడానికి మరియు పాండమిక్ విషయంలో చైనా మరియు WHO ల పాత్రను వివరించడానికి తాను అమెరికాకు వచ్చానని యాన్ చెప్పారు.
Covid – 19 వ్యాప్తి ప్రారంభమైనప్పుడు అనేక మంది చైనా శాస్త్రవేత్తలు వైరస్ గురించి ప్రజలను హెచ్చరించడానికి ప్రయత్నించారని, కానీ తరువాత వారు వారి గొంతుకను మార్చవలసి వచ్చిందని, లేదా అకస్మాత్తుగా వారు అదృశ్యమైపోవడం జరిగిందని యాన్ తెలిపారు. ఈ విషయాన్ని కొనసాగించవద్దని చైనా ప్రభుత్వం చాలా మందిని హెచ్చరించిందని, చైనాలోని వైద్య యంత్రాంగం వైరస్ గురించి చర్చించడాన్ని నిషేధించారని, అయితే మాస్కులు ధరించమని మాత్రం కోరినట్లు ఆమె ఫాక్స్ న్యూస్ కు తెలిపింది.
చైనా వెలుపల నుండి నడుస్తున్న ఒక చైనీస్ న్యూస్ పోర్టల్ మరియు ఫాక్స్ న్యూస్ లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, యాన్ మాట్లాడుతూ, COVID-19 మనుషులలో ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే సామర్ధ్యం గురించి డిసెంబరు చివరలో చైనా యొక్క సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సిడిసి) శాస్త్రవేత్తతో తాను సమాచారాన్ని పంచుకున్నానని, అయితే , జనవరి 16 న తన ఫలితాలను తన పర్యవేక్షకులకు సమర్పించినప్పుడు, “ఎరుపు గీతను తాకవద్దు” (హద్దు మీరవద్దు), “వ్యాఖ్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి” అంటూ తనకు హెచ్చరికలు జారీ అయ్యాయని ఆమె వెల్లడించారు.
WHO సలహాదారు మాలిక్ పీరిస్ కు వ్యాధి వ్యాప్తి గురించి తెలుసునని, కానీ చర్య తీసుకోకూడదని నిర్ణయించుకున్నారని యాన్ పేర్కొన్నారు. పీరిస్ WHO- అనుబంధ ప్రయోగశాల సహ-డైరెక్టర్‌గా ఉన్నారు. కానీ ఆయన జూలై 3 న తన పదవి నుంచి తప్పుకున్నారు.
కానీ వుహాన్ వైరస్ యొక్క స్వభావం మరియు మనుషులలో ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే దాని సామర్ధ్యం గురించిన సమాచారాన్ని తాను ఎప్పుడూ నిరోధించలేదని చైనా పేర్కొంది. వైరస్ పై చైనా యొక్క పల్లవిని ఎల్లప్పుడూ అనుసరించే WHO, జనవరిలో కరోనా వైరస్ మానవుని నుంచి మానవునికి సంక్రమించినట్లు ఎటువంటి రుజువు లేదని పేర్కొంది. ఇప్పుడు, యాన్ వాదనల తరువాత, చైనా మరియు WHO ల వాదనలు పరస్పర విరుద్ధంగా కనిపిస్తున్నాయి.
వుహాన్ వైరస్ వ్యాప్తికి సంబంధించి చైనా శాస్త్రవేత్తలతో తాను సంప్రదిస్తున్నానని డబ్ల్యూహెచ్ఓ చైర్మన్ టెడ్రోస్ పదేపదే చెప్పారు. కానీ చాలా మంది డబ్ల్యూహెచ్ఓ అధికారులు మాత్రం సంస్థలోని శాస్త్రవేత్తల నుండి సంబంధిత సమాచారాన్ని అందుకున్నారని, టెడ్రోస్ పేర్కొన్నట్లు చైనా అధికారుల నుండి కాదని పేర్కొన్నారు.
Source : Organiser
https://www.organiser.org/Encyc/2020/7/11/China-knew-about-Wuhan-virus-but-did-everything-to-cover-it-up-and-WHO-remained-silent.html





