
విద్యా భారతి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సంఘటనా మంత్రి శ్రీ హనుమంతరావు మరణ వార్త వింటూ ఉండగానే మరో పిడుగులాంటి వార్త తెలిసి స్వయంసేవకులు ఆవేదనాభరితులయ్యారు.
అప్పటివరకూ దారిన పోతున్న వలస కూలీలకు సేవా భారతి తరపున మంచినీరు, ఆహారం అందిస్తూ ఒక్క కౌంటర్ సరిపోదు మరో కౌంటర్ కూడా తెరవాలి అని కార్యకర్తలకు సూచనలిస్తూ అందరినీ ఉత్సాహ పరుస్తూ ఉండిన శ్రీ నరేంద్ర గారు ఇక లేరు అన్న వార్త స్వయంసేవకులకు అందరికీ పిడుగులాంటి వార్తే అయింది.

విజయవాడలోని గన్నవరం ప్రాంతంలో నివాసం ఉంటున్న శ్రీ నరేంద్ర గారు పోస్టల్ డిపార్ట్మెంట్లో సుదీర్ఘ కాలం పాటు పనిచేసి రిటైర్ అయ్యారు. వారు పనిచేస్తున్న కాలంలో తనకంటే పెద్ద అధికారులు అయినా సరే ఎవరైనా ఆర్ఎస్ఎస్ కి, హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే సహించేవారు కాదు. ఎంతటివారినైనా ధైర్యంగా నిలదీసేవారు.
గొప్ప సేవా దృక్పథం కలిగిన శ్రీ నరేంద్ర విజయవాడ మహానగర్ కుటుంబ ప్రబోధన్ ప్రముఖ్ గా బాధ్యత నిర్వహిస్తూ ఉండినారు. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కూడా ఆయన చురుకుగా పాల్గొనేవారు. ప్రస్తుతం లాక్ డౌన్ సమయంలో కాలి నడకన తమ స్వస్థలాలకు వెళుతున్న వలస కూలీలకు ఆయన స్వయంగా పెద్ద ఎత్తున ఆహారము, మజ్జిగ, మంచినీరు వగైరాలను వితరణ చేశారు.

తాను మృతిచెందడానికి కొన్ని గంటల ముందు (17/5/2020) కూడా వారు నడిచి వెళుతున్న వలస కూలీలకు ఆహారాన్ని అందించారు. ఒక్క కౌంటర్ సరిపోదు, మరో కౌంటర్ కూడా ప్రారంభించాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. ఇంతలోనే హఠాత్తుగా గుండెపోటుతో వారు స్వర్గస్తులు కావడాన్ని స్వయంసేవకులు జీర్ణించుకోలేకపోతున్నారు.
శ్రీ నరేంద్ర గారు మన మధ్య లేకపోయినా వారి పట్టుదల, కార్యదీక్ష, ఉత్సాహం, నిస్వార్థ జీవనం, సేవానిరతి స్వయంసేవకులందరికీ ప్రేరణాత్మకం.





