News

అయోధ్య నిర్వహణలో ప్రక్షాళన అవసరం : ఛైర్మన్‌ నృపేంద్ర మిశ్ర సూచన

5views

అయోధ్య రామాలయ నిర్వహణ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని రామ జన్మభూమి ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్, ప్రధాని మోదీ మాజీ ముఖ్యకార్యదర్శి నృపేంద్ర మిశ్ర సూచించారు. ఆలయ విరాళాల దుర్వినియోగ ఆరోపణలు పర్యవేక్షణ, జవాబుదారీతనం, నిర్దేశిత విధానాల అమలులో తీవ్ర లోపాలను బయటపెడుతున్నాయన్నారు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి రిటైరైన తర్వాత ఈయనకు అయోధ్య నిర్మాణ కమిటీ కీలక బాధ్యతలు అప్పగించారు. రామాలయంలో నిధుల అవకతవకలపై వచ్చిన ఆరోపణలు భక్తుల విశ్వాసాలను దెబ్బతీయడంతోపాటు ఆలయ పరిపాలన వ్యవస్థలో లోపాలను కళ్లకు కట్టాయని నృపేంద్ర మిశ్రా ఓ టీవీ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తంజేశారు.

‘‘విరాళాల దుర్వినియోగానికి సంబంధించి అధికారికంగా ఎటువంటి ప్రతిపాదనలను సమర్పించలేదు. అయితే నా ఆలోచనలను వెల్లడిస్తున్నాను. నా నిశ్చితాభిప్రాయం ప్రకారం ఆలయ నిర్వహణ వ్యవస్థను పునర్వ్యస్థీకరించి దానిని అనుభవజ్ఞులైన నిపుణులకు అప్పగించాలి. నాకు అప్పగించిన ఆలయ నిర్మాణ పనులు పూర్తికావస్తున్న సమయంలో విరాళాల్లో అక్రమాల వ్యవహారం నన్ను చాలా బాధ పెట్టింది. ఆలయ పరిసరాల్లో సుమారు 1500 మంది విధులు నిర్వహిస్తున్నారు. వారిలో చాలా మంది వాలంటీర్లు. వారికి బాధ్యతలు అప్పగించడానికి సరైన వ్యవస్థ లేదు’’ అని నృపేంద్ర మిశ్ర పేర్కొన్నారు.

ఆలయ విరాళాల లెక్కల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలతో వివాదం మొదలైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో సుమారు రూ.ఏడు కోట్లు అంతకు పైబడిన మొత్తం అపహరణకు గురైందని ఆరోపణలున్నాయి. ఆలయ ఉద్యోగి ఇంటి నుంచి కొంత నగదు స్వాధీనానికి దారితీశాయి. అలాగే ఈ వ్యవహారంపై ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)ను ఏర్పాటు చేసి విచారణ మొదలెట్టింది.

అపఖ్యాతి తెచ్చే ప్రయత్నాలు: యోగి
ప్రఖ్యాత అయోధ్యకు అపఖ్యాతి తెచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆరోపించారు. అలాగే శ్రీ రామజన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్టు పనితీరుపై అనుమానాలు రేకెత్తించేందుకూ యత్నాలు జరుగుతున్నాయన్నారు. ‘‘సిట్‌ ఏర్పాటైంది. అది పాలను.. నీళ్లను వేరు చేస్తుంది. ఆలయం కోసం 500 ఏళ్లు ఆగాం… సిట్‌ నివేదిక కోసం 15 రోజులు ఆగలేమా? దోషులుగా తేలితే ఏ స్థాయి వ్యక్తులనైనా వదిలేది లేదు’’ అని యోగి స్పష్టం చేశారు.