
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఈ సమయంలో తాజాగా 12మంది తబ్లిగీలను జైలుకు తరలించారు ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు. వీరిలో తొమ్మిది మంది థాయ్‌లాండ్ దేశస్థులు కాగా మిగతావారు తమిళనాడుకు చెందినవారు ఉన్నారు. దిల్లీ మర్కజ్ సమావేశానికి హాజరై వచ్చిన అనంతరం ఓ మసీదులో తలదాచుకున్న వీరిని ఏప్రిల్ 2వ తేదీన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరందరికీ వైద్యపరీక్షలు నిర్వహించగా ఒకరికి కరోనా పాజిటివ్ తేలింది. దీంతో అతన్ని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించగా.. మిగతా వారిని క్వారంటైన్‌లో ఉంచి పరీక్షించారు. అయితే తాజాగా చికిత్స పొందుతున్న వ్యక్తిని మళ్లీ పరీక్షించగా రిపోర్టులో నెగటివ్ వచ్చింది. ఇక మిగతావారందరికీ 28రోజుల క్వారంటైన్ గడువు ముగియడంతో వీరిని షాజాహాన్‌పూర్‌లోని తాత్కాలిక జైలుకు తరలించారు. కేంద్రప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే వీరందరి పాసుపోర్టులను సీజ్ చేశామని షాజాహాన్‌పూర్ జిల్లా సూపరింటెండెంట్ దినేష్ త్రిపాఠి వెల్లడించారు. ఇదిలాఉంటే, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇప్పటివరకు 2203పాజిటివ్ కేసులు నమోదు కాగా 39మంది ప్రాణాలు కోల్పోయారు.