
వ్యాక్సిన్ల తయారీలో ప్రపంచంలోనే పేరొందిన ప్రముఖ సిరం ఇన్‌స్టిట్యూట్ కొవిడ్-19 వ్యాక్సిన్ ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం బ్రిటన్‌లో క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్న వ్యాక్సిన్ విజయవంతమైతే..భారత్‌లో 6కోట్ల డోస్‌లను ఈ సంవత్సరం ఉత్పత్తి చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్న ఈ వ్యాక్సిన్‌ను ఇప్పటికే జంతువుల్లో పరీక్షలు జరిపి..ప్రస్తుతం మానవుల్లో ప్రయోగాలు మొదలుపెట్టింది. అయితే, ‘ChAdOx1 nCoV-19’ పేరుతో అభివృద్ధి చేస్తున్న ఈ వ్యాక్సిన్ విజయవంతం కాగానే వీటిని భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సిరం ఇన్‌స్టిట్యూట్ సీఈఓ అధర్ పూనావాలా వెల్లడించారు. ఈ వ్యాక్సిన్ అభివృద్ధిలో ఎంతోమంది అత్యున్నత స్థాయి నిపుణులు నిమగ్నమయ్యారని..అందుకే వ్యాక్సిన్ తొందరలోనే వస్తుందని నమ్ముతున్నట్లు అభిప్రాయపడ్డారు.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు వెయ్యి పరిశోధనలు జరుగుతుండగా వీటిలో ఇప్పటికే కనీసం ఐదు వ్యాక్సిన్లు ఫేజ్-1 క్లినికల్ ట్రయల్స్ దశకు చేరుకున్నట్లు అంచానా వేశారు. ఇక ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చేపడుతున్న పరిశోధనలు సెప్టెంబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నామని సిరం సీఈఓ అధర్ పూనావాలా తెలిపారు.
ఒకవేశ ఇది విజయవంతమై, అన్నీ సవ్యంగా జరిగితే మాత్రం రానున్న సంవత్సర కాలంలోనే దాదాపు 40కోట్ల వ్యాక్సిన్ డోసులను తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు. వీటిని భారత్‌లోని పుణె కేంద్రంలో ఉన్న రెండు యూనిట్లలో తయారు చేయనున్నారు. ఒక్కో వ్యాక్సిన్ వెయ్యి రూపాయల ధరతో ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ…ప్రజలకు మాత్రం ఇది ఉచితంగానే ప్రభుత్వం అందజేసే అవకాశం ఉంది. అయితే కొవిడ్ వ్యాక్సిన్ తయారీకోసం కొత్తగా ఏర్పాటు చేసే యూనిట్ కోసం రూ. 600కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిరం కంపెనీ బోర్డు ఈ మధ్యే ఆమోదం తెలిపింది.
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 30లక్షలకు పైగా ప్రజలు ఈ వైరస్ బారినపడగా 2లక్షల 11వేల మంది ప్రాణాలు కోల్పోయారు.





