
దాదాపు 18 సంవత్సరాల క్రితం కంచె ఐలయ్య ఎప్పటిలాగానే హిందూ ధర్మం మీద దాడి చేస్తూ, ” షెడ్యూల్డ్ కులాల వారికి శాస్త్రాలు నేర్పించి వాళ్ళు అర్చకులుగా మారేందుకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు మీ అర్చకులు సిద్ధంగా ఉన్నారా?” అని ఒక సవాలును విసిరాడు. (అర్చకుడిని పూజారిగా (priest ) గా మార్చడం చాలా సులభం. కానీ క్రైస్తవ పూజారులు చేసేదానికి భిన్నముగా హిందూ అర్చకులు దేవునికి నిర్వర్తించవలసిన రోజూవారీ కైంకర్యాలన్నీ చేసే సేవకులలాగా పనిచేస్తారు. కంచె ఐలయ్య వేసిన ప్రశ్న కేవలం అలంకార ప్రశ్నగా అడిగినది. కాబట్టి దానికి సమాధానం ఇవ్వవలసిన అవసరం లేదు.
అయితే, కంచె ఐలయ్య ఆ ప్రశ్నని సంధించినప్పుడు దానికి సకారాత్మక సమాధానం అప్పటి తెలంగాణ అర్చక సమాఖ్య అధ్యక్షులు డాక్టర్ ఎం.వీ. సుందరరాజన్ ఇస్తారని ఆశించి ఉండరు.
“తిరుకులత్తార్ యువత అర్చకత్వం వృత్తిని చేపట్టడానికి ముందుకు వస్తే, నేను వ్యక్తిగతంగా వాళ్లకి శిక్షణ ఇస్తాను”
(వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించి దళిత వర్గానికి చెందినవారిని ఉద్దేశిస్తూ హిందూ వేదాంతి శ్రీ రామానుజాచార్యులు వాడిన పదం ‘తిరుకులత్తార్’)
దీనికి అవతల వైపు నుండి స్పందన లేదు.
అక్కడే అంకురించింది…
గతం లోకి వెళ్తే, 2018 జనవరిలో ‘ఎస్.సి / ఎస్. టీ రిజర్వేషన్ల రక్షణ సమితి’ ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో నిర్వహించిన సమావేశానికి ప్రస్తుతం చిలుకూరి బాలాజీ దేవస్థానం అర్చకులుగా ఉన్న డాక్టర్ సుందర రాజన్ గారి పుత్రుడు శ్రీ రంగరాజన్ గారిని , ఇతర మతాల ప్రతినిధుల తోపాటు ఆహ్వానించడం జరిగింది. షెడ్యూల్డ్ వర్గాలవాళ్ళు ఈనాటికీ ఎదుర్కొంటున్న సమస్య మీద చర్చ సాగుతున్నప్పుడు శ్రీ రంగరాజన్, ఈ దురాగతాలు హిందూ మతం వల్ల కలిగినవి కావు అనీ, నిజానికి అవి హిందూ మత బోధనలకు విరుద్ధమనీ చెప్పారు.
ఆ సందర్భంగా వారు తిరుప్పాన్ ఆళ్వార్ చరిత్రను చెప్పారు. ఆ రోజుల్లో (మూఢ నైతిక విలువలు మరియు వైదిక సంప్రదాయాన్నినిర్లక్ష్యం చేయడం లాంటి వాటి వలన ) అంటరానివారుగా భావించబడుతున్న ఒక గాయకుల సామాజిక వర్గంలో ఆళ్వార్ జన్మించారు. ఒక రోజు శ్రీరంగంలో రంగనాయక స్వామి అభిషేకానికి నీళ్లు తేవడం కోసం వెళ్తున్న అర్చకుడు, దారిలో తన్మయత్వంతో విష్ణువుని కీర్తిసూ గానం చేస్తున్న ఆళ్వార్ ని చూసాడు. అతని ఏకాగ్రతకి భంగం కలిగించి, అక్కడి నుండి కదిలేలా చేయడం కోసం ఆ అర్చకుడు ఒక రాయిని అతని మీదకి విసిరాడు. అది అతని కణతకి తగిలి రక్తం స్రవించసాగింది. ఆలయానికి తిరిగివచ్చిన ఆ అర్చకుడు ఆలయంలోని శ్రీ రంగనాథుని విగ్రహంలో కణత భాగం నుండి రక్తం స్రవించడం చూసి నివ్వెరపోయాడు. అప్పుడు లోకసారంగుడు అనే పేరు గల ఆ అర్చకునికి అశరీరవాణి వినిపించి, ఆ ఆళ్వార్ ని భుజాల మీద మోసుకుని ఆలయంలోకి తీసుకురమ్మని ఆజ్ఞాపించింది. అతను అలాగే చేశాడు. అర్చకుని భుజాల మీద ఎక్కి వచ్చాడు కాబట్టి అప్పటినుండి తిరుప్పన్ ఆళ్వార్ కి ‘ముని వాహనుడు’ అనే పేరు వచ్చింది.
శ్రీ రంగనాధుడే అస్పృశ్యతకి, ఆలయ ప్రవేశానికి ఉన్న నిబంధనలకు వ్యతిరేకుడు అన్న సత్యాన్ని ప్రస్తావిస్తూ, శ్రీ రంగరాజన్ ఈ కథను చెప్పినప్పుడు, ఈ రోజుల్లో అది సాధ్యమవుతుందా అన్న ప్రశ్న ఆయనను అడగడం జరిగింది.
“ప్రస్తుతం మీరు అలా చేయగలరా?” అన్న ఈ ప్రశ్న కేవలం తమ వాక్చాతుర్యాన్ని నిరూపించుకోవడానికి కాకుండా, షెడ్యూల్డ్ కులాల వాళ్ళు ఎదుర్కొంటున్న అవమానాల నుండి, వేదన నుండి పుట్టిన ప్రశ్న అది.
శ్రీ రంగరాజన్ తక్షణమే, “నేను ఆ పని చేస్తాను” అన్నారు.
చర్చ పక్క దారి పడుతున్న తీరుని గమనించిన నిర్వాహకులు దానిని వేరే అంశం మీదకి మళ్లించారు.
సాక్షాత్తూ రంగనాథుడే…
తరువాతి రోజుల్లో, చిలుకూరి బాలాజీ దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నసమయంలో, శ్రీ రంగరాజన్ స్వామి వారి విగ్రహం ముందు నిలబడి ఉన్నప్పుడు, ఆయనకు హృదయాంతరాలలో ‘ముని వాహనా’ అన్న మాటలు స్పష్టంగా వినిపించాయట. అవి శ్రీ రంగనాధుడు అన్నవా, లేక నా మనస్సాక్షి అన్నవా అనేది చెప్పడం కష్టం. కానీ నాకు స్పష్టంగా వినిపించాయి అని ‘స్వరాజ్య’ తో మాట్లాడుతున్నప్పుడు అన్నారు ఆయన.
లోకసారంగుడు అన్న అర్చకుడు తిరుప్పాన్ ఆళ్వార్ కి చేసిన సేవను ఇప్పుడు నేను చేస్తాను అని ఆయన ఆలయ అధికారులతో చెప్పినప్పుడు ఒక్కరు కూడా దానిని వ్యతిరేకించలేదు. తరువాత జరిగినది సామాజిక సమరసతకు సంబంధించిన చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. హైదరాబాదులోని జియాగూడలో నాలుగు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ రంగనాథుని దేవాలయం ఇందుకోసం ఎంపిక చేయబడింది. దళిత వర్గానికి చెందిన హిందువుని అరవై సంవత్సరాల వయసు ఉన్న శ్రీ రంగరాజన్ తన భుజాల మీద మోసుకుంటూ ఆలయ ప్రవేశం చేయించారు.
ఆదిలో ఆదిత్యునితో…
ఆ భాగ్యానికి నోచుకున్న ఆదిత్య పర్సారి సామాన్య వ్యక్తి కాదు. శాస్త్రాల మీద మంచి పట్టు కలిగిన శ్రీ ఉపాసకుడు ఆయన. అందుకని ఆయన తెల్ల ధోవతిని కాకుండా ఎర్ర ధోవతిని ధరిస్తానని పట్టు పట్టాడు. అందుకు అర్చకులు అంగీకరించారు. మంచి శాస్త్ర పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నప్పటికీ నిమ్న కులానికి చెందిన వారు కావడం వలన పర్సారి మరియు అతని కుటుంబ సభ్యులు, అగ్రకులాలకు చెందిన వారి వివక్షకు గురైనారు. తన స్వస్థలమైన మహబూబ్ నగర్ లోని హనుమాన్ ఆలయంలోకి తమను అనుమతించనప్పుడు కలిగిన వ్యధను ఆయన గుర్తు చేసుకున్నాడు. కానీ శాస్త్రాలు, ఉపనిషత్తుల్లో అలాంటి వివక్షకు తావు లేదని అతనికి స్పష్టంగా తెలుసు. ఈ వివక్ష అనేది శాస్త్రాల్లో లేదని, అది మానవుల ఆలోచనా విధానంలోనే ఉన్నదని ఆయన నమ్ముతాడు.
మనుషుల ఆలోచన మారాలి…
శ్రీ రంగరాజన్ కూడా దీనికి అంగీకరిస్తారు. ‘స్వరాజ్య’ తో మాట్లాడుతూ ఆయన, ” రాజ్యాంగంలో ఏర్పాట్లు ఉన్నప్పటికీ, రిజర్వేషన్లు కల్పించబడినప్పటికీ, అంటరానితనం, కుల వివక్ష సమసిపోవాలంటే, మనుషుల ఆలోచనా విధానంలో మార్పు రావడం తక్షణ అవసరమని డాక్టర్ అంబేడ్కర్ అభిప్రాయపడ్డారు.
ఎస్.సి, ఎస్. టీ అట్రాసిటీస్ చట్టం తీసుకురాలేని మార్పును తాను తీసుకురావాలనే లక్ష్యం ఆయన మనసులో స్పష్టంగా ఉంది. ఈ చట్టం పై పై లక్షణాలకు చికిత్స చేసే అల్లోపతీ వైద్యం లాంటిదని, వ్యాధి మూలానికి చికిత్స చేసే ఆయుర్వేద వైద్యం లాంటిది ఇప్పుడు అవసరమనీ అయన అభిప్రాయం.
సామాజిక న్యాయమూ, సామాజిక సమరసతల కోసం చేపట్టిన ఈ నిర్ణయాత్మక చర్య భాషా బేధాలను కూడా అధిగమించింది. నాదస్వరంలో అన్నమాచార్య కీర్తన ‘బ్రహ్మమొక్కటే’ వినిపిస్తుండగా, తమిళ్ ఆల్వార్ యొక్క జీవితంలోని ఒక సంఘటన మళ్ళీ కళ్ళకు కట్టబడింది. ఈ అన్నమయ గీతం కులభేదాలు లేకుండా, అందరిలో ఉన్న పరమాత్మను మనకు వివరిస్తుంది.
నేను వాహకుడను. కూర్చోను…
ముని వాహన సేవ తరువాత ఒక విలేకరుల సమావేశం కూడా నిర్వహించబడింది. ఆ సందర్భంలో విలేకరుల ప్రశ్నలకు సమాధానం చెప్పడం కోసం శ్రీ రంగరాజన్ ని, పర్సారిని కూచోమని అడిగినప్పుడు, నేను వాహకుడిని, కూర్చోకూడదు అని రంగరాజన్ నిలబడే సమాధానాలు చెప్పారు.
ఆ సమావేశంలో వాళ్ళని “మీరు దీనిని ఘర్ వాపసి కోసం చేస్తున్నారా?” “ఎస్. సి, ఎస్. టీ చట్టాలు నీరుగారిపోతున్నందుకు దళితులకు కలుగుతున్న కోపాన్ని తగ్గించడం కోసం ఇలా చేశారా?” లాంటి కొన్ని ప్రత్యేకమైన ప్రశ్నలు అడగబడ్డాయి. చాలా వార్తా పత్రికలూ ఈ వార్తను మొదటి పేజీలో ప్రచురించాయి. మీడియాలో వచ్చిన ఈ ప్రచారం పర్సారి, రంగరాజన్ లను ఏ మాత్రం ప్రభావితం చేయలేదు. వాళ్ళ లక్ష్యం కుల వివక్షను రూపుమాపి, దానికి గురైన వారి ఆలోచనా ధోరణిని మార్చడం. వాళ్ళ సంకల్పము, నమ్మకము ఈ ప్రయత్నానికి అద్భుతమైన ప్రారంభాన్ని ఇచ్చాయి.
సామాజిక వివక్షను ఎదుర్కొనడంలో ప్రజల ఆలోచనా ధోరణిని మార్చడమే అసలైన సమస్య అన్న అంబేద్కర్ అభిప్రాయాన్ని పర్సారి, రంగరాజన్ ల ఆలోచనా ధోరణి ప్రతిబింబించడం కేవలం కాకతాళీయం కాకపోవచ్చు. రిజర్వేషన్లు, న్యాయ సహాయం అనేవి ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి పనికొస్తాయి. అందుకు అన్ని జీవులు ఒక్కటే అన్న ఆధ్యాత్మిక ధోరణి ఉపకరిస్తుంది.
అంబేద్కర్ కూడా స్వయంగా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. నిజానికి ఆయన శ్రీ రామానుజుల వారిని ఎక్కువగా గౌరవించేవారు. రామనందుల ద్వారా ఆయన శ్రీ రామానుజుల వారి సంప్రదాయం తాను విశ్వసించే కబీర్ మార్గానికి చాల దగ్గరగా ఉంటుందని తెలుసుకోగలిగారు. శ్రీ రామానుజుల వారు సమానత్వం కోసం ఎప్పుడూ నిలబడ్డారని ఆయన అభిప్రాయం.
కేవలం విగ్రహమా?
“తిరుపాన్ ఆళ్వార్ కి తగిలిన దెబ్బ రంగనాధ స్వామి విగ్రహానికి కూడా తగిలింది అన్న కథ మన ఆరాధనా పద్దతులను విగ్రహారాధన అని ఒక ముద్ర వేసి అవహేళన చేయడం ఎంత తప్పో తెలియజేస్తోంది. గర్భాలయంలోని దేవుడు మనం నిర్మించుకున్న సామజిక కట్టుబాట్లను ఛేదించుకుని మనలో అందరి హృదయాలలో ఉంటాడు. నా తండ్రి ఇచ్చిన జ్ఞాన దృష్టి, శ్రీ రంగానాధుని కృప వీటన్నిటికీ కారణం” అని ఒకింత భావోద్వేగంతో చెప్తారు రంగరాజన్.
సమాజానికి మేలుకొలుపు…
తిరుపాన్ ఆళ్వార్ చరిత్రను తలచుకుని, ఆనాటి సంఘటనను మళ్ళీ దర్శించినప్పుడు చలించకుండా ఉండటం చాలా కష్టం. మనం వివక్ష చూపడానికి కారణం మన శాస్త్రాలు కాదు, తిరుపాన్ ఆళ్వార్ జీవితంలోని ఒక సంఘటనలో మనకు చూపబడిన మన స్వంత ధర్మాన్ని విస్మరించడం. కాబట్టి మన ధర్మం అంటే ఏమిటో ప్రస్తుత తరానికి అర్ధమయ్యేలా ఒక ప్రాయశ్చిత్తంగా, ఒక మేలుకొలుపుగా దీనిని చెప్పవచ్చు.
SOURCE : SWARAJYA





