ArticlesNews

సుఖం గురించి మన భావన ఏమిటి ?

1.7kviews

ఈ విషయంలో భారతీయ తాత్వికులు ఈ విధంగా చెప్పారు. మానవ జీవితాన్ని ముక్కలు ముక్కలుగా చేసి చూడలేం. మనిషి అంటే కేవలం శరీరం మాత్రమే కాదు. శరీరం, మనస్సు, బుద్ధి, ఆత్మ – వీటన్నిటి సమ్మేళనమే మనుష్యుడు. జీవితంలో ఏకాత్మత ఉన్నట్లే మనిషి వ్యక్తిత్వంలో కూడా ఏకాత్మత ఉంది. అలాంటప్పుడు “ఈ క్షణంలో కలిగిన శరీర సౌఖ్యమే సౌఖ్యం”అని భావించడం సరైనదేనా ? కాదు. జీవితం, మనిషి వ్యక్తిత్వం రెండూ కూడా ఏకాత్మత గలవే అయినప్పుడు సౌఖ్యం అనేది కేవలం శరీరానికి సంబంధించినదిగా ఉండజాలదు.

జీవితం గురించి ఇంత లోతుగా ఆలోచించని వ్యక్తి “సిద్ధాంత దృష్టికి ఇదంతా నిజమే కావచ్చు. వ్యవహారిక ప్రపంచంలో మాత్రం ఇటువంటి పరిపూర్ణ సౌఖ్యం గురించిన ఆలోచన నెరవేరేది కాదు”. అనిపిస్తుంది. అలా అనుకోవడంలోని పొరపాటును అతడు గ్రహించలేరు. మనం నమ్మినా, నమ్మకపోయినా మనిషి జీవితము, వ్యక్తిత్వము కూడా ఏకాత్మకమైనవే.

మన పెద్దలు సుఖదుఃఖాలకు చాలా సరళమైన నిర్వచనం చెప్పారు. “అనుకూల సంవేదనాత్మకం సుఖం, ప్రతికూల సంవేదనాత్మకం దుఃఖం” ఇది మనుష్యుల విషయంలోనే కాదు, పశు పక్ష్యాదుల విషయంలోనూ సత్యమే. సైబీరియా మొదలైన చలి ప్రాంతాలలో శీతాకాలం ప్రారంభమయ్యే సరికి అక్కడి పక్షులు సుదూరమైన ఉష్ణప్రాంతాలకు వలస వెళ్లిపోయి చలియొక్క ప్రతికూల సంవేదన నుంచి తమను తాము రక్షించుకుంటాయి.

చేసే పనులకు శరీర సుఖం అనేది ప్రేరణగా ఉన్నంతవరకూ ఈ విషయంలో మనిషి ఇతర ప్రాణులకు భేదం లేదు.

“ఆహార నిద్రా భయ మైధునం చ సామాన్య మేతత్ పశుభి ర్ నరాణాం”

కానీ ఆ సమానత్వం ఇంతవరకే పరిమితం. పశుపక్ష్యాదులకు వలె కేవలం శరీర భోగానుభవంలో మానవునికి సౌఖ్యప్రాప్తి కలగదు అనేది అన్ని ప్రాంతాలలో అన్ని కాలాలలో మానవ జాతి యొక్క అనుభవం. తాత్కాలికమైన ఇంద్రియ సుఖానుభవంతో మనుష్యులు

“సుఖం లభించింది” అనుకోలేరు. మధుమేహ రోగుల రసగుల్లా తినాలనే బలమైన ఆ కలగవచ్చు. అతడి ముందు రసగుల్లా ఉంచితే, అతడి మనస్సు ‘నిన్ను తినేస్తాను. అన పొందుతాను’ అనుకోవచ్చు. కాని తరువాత ఇన్సులిన్ ఇంజక్షన్ తీసికొనేటప్పుడు అతని మనస్సులో ఆనందం ఉండదు.

ఇలా వస్తూ పోతూ ఉండే సౌఖ్యం నిరర్దక మైనదని మన ఋషులు చెప్పారు. పదిగంటలు సుఖం, పదింపావుగంటలు దుఃఖం; మళ్లీ పదిన్నర గంటలు సుఖం, ఆ పైన పదకొండు గంటల దుఃఖం – ఇలా వచ్చేపోయే సుఖానుభవం వాంఛనీయం కాదు. ఇతర ప్రాణుల కన్నా అధికమైన బుద్ధి విశేషం మనిషికి ఉంటే “నా సౌఖ్యం ఎందులో ఉంది? ” అని అతడు ఆలోచించవలసి ఉంది.

విషయేంద్రియ సంయోగాత్

యత్ తదగ్రేమృ తోపమమ్ పరిణామే విషమివ

తత్సుఖం రాజసం స్మృతం (భగవద్గీత)

ఇంద్రియాలు విషయములలో కలవడం వల్ల మొదట అమృతతుల్యమైన సౌఖ్యం అనుభూతమైనట్లు అనిపిస్తుందిగాని అది పరిణామ స్వరూపంలో విషతుల్యమవుతుంది. దానిని శ్రీకృష్ణుడు రాజస సుఖం అన్నాడు. దాని నుంచి దూరంగా ఉండమని అర్జునుడికి బోధించాడు.

మరొక్క విషయం… ఆగ్నిని నెయ్యిపోసి ఆర్పాలని ప్రయత్నిస్తే అది మరింతగా ప్రజ్వరిల్లుతుంది. అదే విధంగా విషయ వాసనలు తృప్తి లభించిన కొద్దీ ప్రబలంగా తయారవుతాయి.

న జాతు కామః కామానామ్ ఉపభోగిన శామ్యతి,

హవిషా కృష్ణ వర్మేవ భూయం ఏవాభివర్ధతే.

కనుక “మనసులో పుట్టిన వాంఛలను నెరవేర్చుకొంటే సుఖం ప్రాప్తిస్తుంది” అనుకోవడం సరికాదని స్పష్టమవుతుంది.

అంతేకాదు భోగవాంఛ అధికమైన కొద్దీ భోగానుభవ సామర్థ్యం క్షీణిస్తూ ఉంటుంది.

ఇది ప్రకృతి ధర్మం. చివరికి భర్తృహరి చెప్పినట్లుగా

భోగా న భుక్తా, వయమేవ భుక్తాః

తృష్ణా న జీర్ణా, వయమేవ జీర్ణాః

(భోగాలు భుజించబడలేదు. మనమే భుజించబడుతున్నాం. ఆశ జీర్ణం కాలేదు. మనమే

జీర్ణమై పోతున్నాం) అనే పరిస్థితి ఏర్పడుతుంది.

ఇందుకు మనవద్ద యయాతి ఉదాహరణ ఉంది. అతడు జీవితమంతా విషయ భోగానుభవంలో గడిపాడు. అయినా అతనిని విషయ వాంఛ వదలలేదు, ఉదృతమవుతూనే ఉంది. శాపవశాత్తూ వార్ధక్యం వచ్చినప్పుడు తన కుమారుడిని పిలిచి బొత్తిగా సిగ్గు విడిచి అతడి యవ్వనాన్ని అడిగి పుచ్చుకొని తన వార్థక్యాన్ని ఆ కొడుకుకిచ్చాడు. మళ్ళీ విశృంఖలంగా భోగానుభవంలో మునిగిపోయాడు. కాని చివరకు విషయవాంఛలు తీర్చిన కొద్దీ అధికమవుతాయిగాని ఉపశమించవని గ్రహించాడు. పాశ్చాత్య ప్రపంచంలోనూ అటువంటిదే “కాసనోవా” అనే వ్యక్తి ఉదాహరణ ఉంది. కనుక భోగానుభవం వల్ల వాంఛా పరితృప్తి కలుగుతుందని, సుఖం లభిస్తుందని అనుకోవడం పొరబాటు.

సుఖప్రాప్తికి రెండవ సాధనం అర్థం-అనగా సంపద. దాని విషయమూ ఇంతే. ధనం వల్లనే సమస్తమూ లభిస్తాయని ఇంచుమించు అందరూ భావిస్తారు. కాని ధనార్జన చేసిన వారికి సంపూర్ణంగా సుఖశాంతులు సిద్ధించాయా?

మహమ్మద్ గజనీ యొక్క ఉదాహరణ చరిత్రలో ఉంది. అతడు అనేక రాజ్యాలను దోచి సంపదను పోగుచేశాడు. మృత్యు ఘడియ సమీపించినపుడు మాత్రం దుఃఖితుడై “దైవమా ! నేను జీవితమంతా కష్టపడి నా పరాక్రమంతో ఈ సంపత్తిని ఆర్జించుకున్నాను. ఇప్పుడు ఇదంతా నాకు కాకుండా పోతోంది.” అని వాపోయాడు. అతడి దుస్థితిని చూసి మరణశయ్యతో బాటే అతడిని ధనాగారం వద్దకు తీసుకుపోయారు. కన్నీళ్లు పెట్టుకుంటూ, ఖజనాలోని అమూల్య సంపదవైపు చూస్తూ ఏడుస్తూనే అతడు ప్రాణాలు విడిచాడు. ధనం మాత్రం ఇక్కడే మిగిలి పోయింది. దుఃఖాన్ని అనుభవిస్తూ అతడు అంతమై పోయాడు. – ఇవాళ పాశ్చాత్య సమాజం పరిస్థితి ముఖ్యంగా అమెరికా పరిస్థితి ఇందుకు ఏమీ భిన్నంగా లేదు. ధనమా కావలసినంత ఉంది. సుఖం మాత్రం లేదు.

నేను అమెరికా వెళ్లినపుడు అక్కడి స్వయం సేవకులు కొందరు ఒక వృద్ధాశ్రమం గురించి చెప్పారు. వాళ్లు కుతూహలం కొద్దీ ఆ వృద్ధాశ్రమం గురించి తెలుసుకుందుకు వెళ్లారు. అక్కడి వృద్ధులందరు సంపన్నులు – లక్షాధికారులు, కోటీశ్వరులు. వాళ్లు ఈ స్వయంసేవకులకు మనస్ఫూర్తిగా స్వాగతమిచ్చారు. పిచ్చాపాటీ మాట్లాడారు. ఒక గంట తరువాత వీళ్లు తిరిగి వచ్చేస్తుంటే చాలా మంది కన్నీరు పెట్టుకున్నారు. “మీరు మరొక్కసారి రండి” అన్నారు.

స్వయం సేవకులకు ఆశ్చర్య వేసింది. మళ్లీ ఎందుకు రమ్మంటున్నారని అడిగితే మాకోసం వచ్చే వారేవరు ఉన్నారు? మా పిల్లలు ఎప్పుడూ రానే రారు. మా బ్యాంకు బ్యాలెన్స్ మా ఖర్చులు గడుస్తుంటాయి. పిల్లలు తమ కుటుంబాలలో మునిగిపోయి ఉంటారు, మా మాటే తల పెట్టరు. ఏ నాలుగేళ్లలో ఒకటి రెండు సారు వస్తారు. లేదో క్రిష్టమస్ పువ్వులో, ప్రజంటేషన్లో పంపుతారు. అంతకు మించి మమ్మల్ని గుర్తుంచుకోరు.” అన్నారు.

ఇది విన్నాక “ఇలా ఎందుకు జరుగుతుంది?” అని ఆ స్వయంసేవకులను అడిగాను.

ఇక్కడ ప్రతివ్యక్తి తన సుఖం చూసుకుంటాడు. ఈ వృద్ధులూ వయసులో ఉన్నప్పుడు అలా చేసిన వాళ్లే. వీరందరూ తమ వైవాహిక జీవితంలో పిల్లలకు వాత్సల్యం, ప్రేమ అందించరు,

అందించలేరు. పిల్లలను తమ సుఖానుభవానికి అడ్డంకులుగా పరిగణిస్తారు. చిన్నప్పుడు తాము ఎవరికీ అక్కరలేని వారం అన్న భావంతో పెరిగిన ఇక్కడి పిల్లలు కాస్త పెద్దవాళ్లు కాగానే తల్లిదండ్రుల నుంచి విడిపోతారు. వాళ్లు తమ పెద్దలను అంతకన్నా ఎక్కువగా ఎందుకు చూస్తారు. పెద్దవారు మరణించాక వారి నుంచి సంక్రమించే ఆస్తికోసం పోట్లాడడానికి మాత్రం వస్తారు. ప్రఖ్యాత డిటెక్టివ్ రచయిత్రి అగాథాక్రస్టీ అమెరికా జీవన శైలి గురించి ఒక వ్యంగ్యోక్తిని ఇచ్చింది “Where there is a will, there is a murder”.

……………. ఇంకా ఉంది.

– శ్రీ దత్తోపంత్ ఠేంగ్డేజీ “కార్యకర్త” పుస్తకం నుంచి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.