
మహారాష్ట్రలోని థానే జిల్లా ముంబ్రాకు చెందిన AIMIM కార్పొరేటర్ సహర్ షేక్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మొఘల్ పాలకుడు ఔరంగజేబును ప్రశంసిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.
ఔరంగజేబు చిత్రాన్ని షేర్ చేసిన సహర్ షేక్.. ఆయనపై ఎన్ని ప్రచార చిత్రాలు తీసినా, ఎంతగా అప్రతిష్టపాలు చేయాలని ప్రయత్నించినా నిజాన్ని మార్చలేరని పేర్కొన్నట్లు సమాచారం. అంతేకాకుండా, ఔరంగజేబును ‘మాలిక్-ఉల్-హింద్’గా అభివర్ణిస్తూ, ఆయన నిజాయితీగా పాలించారని కొనియాడారు.
ఇంతటితో ఆగకుండా, “ఇన్షా అల్లాహ్.. మొఘల్ సామ్రాజ్య వైభవం చిరకాలం వర్ధిల్లాలి” అంటూ ఆమె చేసిన వ్యాఖ్య మరింత చర్చకు దారితీసింది. “పుస్తకాల నుంచి మొఘలులను తొలగించవచ్చు.. కానీ ఈ నేల నుంచి వారిని ఎలా తొలగిస్తారు?” అంటూ ప్రశ్నించారు.
ఔరంగజేబు పాలనపై దేశవ్యాప్తంగా చారిత్రక, రాజకీయ చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో.. ఒక ప్రజాప్రతినిధి ఇలా మొఘల్ పాలకుడిని ప్రశంసించడం వివాదాస్పదంగా మారింది. ప్రజాప్రతినిధులు చారిత్రక వ్యక్తులపై చేసే వ్యాఖ్యలు సామాజికంగా ఎలాంటి ప్రభావం చూపుతాయన్న చర్చకు ఈ పోస్ట్ మరోసారి తెరలేపింది.
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలన భారత చరిత్రలో వివాదాస్పద అధ్యాయంగా నిలిచిపోయింది. ముఖ్యంగా అతని పాలనలో హిందూ దేవాలయాల కూల్చివేతలు, జిజియా పన్ను పునరుద్ధరణ, మతపరమైన ఆంక్షలు చరిత్రలో నమోదయ్యాయి.





