News

హనుమంతుడిలా సంజీవనినివ్వండి – ప్రధాని మోడీకి బ్రెజిల్ అధ్యక్షుడి లేఖ

774views

కోవిడ్ 19 చికిత్స నిమిత్తం హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను సరఫరా చేయాలంటూ కోరిన దేశాల జాబితాలో ఇప్పుడు బ్రెజిల్ కూడా చేరింది. డ్రగ్ పంపిణీ గురించి మాట్లాడుతూ భారత ఇతిహాసమైన రామాయణం ప్రస్తావన తెచ్చారు ఆ దేశ అధ్యక్షుడు జైర్‌ బొల్సొనారో. ఇప్పటికి సుమారు 30 దేశాలు ఈ డ్రగ్ కోసం మనదేశానికి అభ్యర్థనలు పంపాయి. ఇప్పటికే అమెరికాకు ఈ ఔషధాలు సరఫరా చేయడానికి భారత్ అంగీకరించిన సంగతి తెలిసిందే. దానిపై ప్రధాని మోడీ మీద ట్రంప్‌ ప్రశంసలు కూడా కురిపించారు.
మలేరియాను నయం చేసే హైడ్రాక్సీక్లోరోక్విన్ కోసం జైర్‌ భారత ప్రధాని మోదీకి లేఖ రాశారు. ‘పురాణ పురుషుడు రాముడి సోదరుడు లక్ష్మణుడిని రక్షించడం కోసం హిమాలయాల నుంచి హనుమంతుడు ఔషధాన్ని తీసుకువచ్చాడు. జీసస్‌ అనారోగ్యంతో బాధపడుతున్నవారిని స్వస్థపరిచాడు. అలాగే ప్రజల రక్షణార్థం కరోనా కట్టడికి మనం కలిసి పనిచేద్దాం’ అని దానిలో కోరారు. కరోనా వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై గత శనివారం ప్రధాని మోడీ, బొల్సొనారో ఫోన్‌లో చర్చించుకున్నారు. ఈ విషయాన్ని మోడీ ట్విటర్ ద్వారా వెల్లడించారు. అలాగే తమకు సాధ్యమైన సహకారం చేస్తామని ప్రధాని బ్రెజిల్ అధినేతకు హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా 70వ గణతంత్ర దినోత్సవానికి బొల్సొనారో ముఖ్యఅతిథిగా హాజరైన సంగతి తెలిసిందే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.