News

చిరుధాన్యాల విక్రయాలతో అధిక ఆదాయం

3views

రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా చిరుధాన్యాల విక్రయాలు చేపట్టి మంచి ఆదాయాన్ని పొందవచ్చని వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ వై.వి. రమణారావు తెలిపారు.  అల్లూరి సీతారామ రాజు జిల్లా చింతపల్లి   రాజుపాకలలో నిర్వహిస్తున్న లంబసింగి రైతు ఉత్పత్తిదారుల సంఘం కార్యకలాపాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎఫ్‌పీఓ ద్వారా చిరుధాన్యాలతో తయారు చేస్తున్న విలువ ఆధారిత ఉత్పత్తుల వివరాలను సంఘ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌ రీసెర్చ్‌ నిధులతో రూ. 50 లక్షలతో ఏర్పాటు చేసిన చిరుధాన్యాల ప్రాసెసింగ్‌ యూనిట్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలు గ్రామీణాభివృద్ధికి తోడ్పడటమే కాకుండా, సంఘ సభ్యుల ఆర్థిక బలానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.  ప్రస్తుతం సమాజంలో అంతా చిరుధాన్యాల ఆహారం వైపే మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. ఈ తరుణంలో ఏజెన్సీ రైతులు పండించే చిరుధాన్యాలను శుద్ధి చేసి విక్రయించడం ద్వారా మంచి మద్దతు ధరతో పాటు అధిక లాభాలు పొందవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ బీవీ తిరుమలరావు, ఏవో మధుసూదనరావు, ఎఫ్‌పీవో నిర్వాహకులు రూతు, ఇందిర తదితరులు పాల్గొన్నారు.