News

వందేమాతరం గీతం 150 వసంతాల వేడుక

5views

వందేమాతరం గీతం ప్రతి భారతీయుడి హృదయంలో దేశభక్తి స్ఫూర్తిని నింపుతుందని రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని సాగి రామకృష్ణరాజు ఇంజనీరింగ్ కళాశాలలో కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం, ఏబీవీపీ, కళాశాల యాజమాన్యం సంయుక్తంగా వందేమాతరం గీతం 150 వసంతాల వేడుకతో పాటు ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి భీమవరం పరిసర ప్రాంతాల్లోని వివిధ కళాశాలలు, విద్యాసంస్థలకు చెందిన వేలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులంతా ఒకే గొంతుతో వందేమాతరం గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటుకున్నారు.

ఎస్ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.వి. మురళీకృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన సభలో రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ.. స్వాతంత్ర్యోద్యమ కాలంలో వందేమాతరం గీతం దేశభక్తుల హృదయాల్లో జాతీయ స్ఫూర్తిని రగిలించిందన్నారు. ఆ గీతం ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల్లో విప్లవ జ్వాలను వెలిగించి, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడేలా ప్రేరేపించిందని పేర్కొన్నారు.

150 ఏళ్ల చరిత్ర కలిగిన వందేమాతరం గీతాన్ని సంపూర్ణంగా ఆలపించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు చారిత్రాత్మకమైనవని ఆయన అభివర్ణించారు. ప్రతి ఒక్కరూ వందేమాతరం స్ఫూర్తితో దేశం పట్ల బాధ్యతను గుర్తించి సమాజానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు.

ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. బంకిమ్ చంద్ర చటర్జీ రచించిన వందేమాతరం గీతం భారతీయ యువత హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుందని అన్నారు. తరతరాలకు దేశభక్తి స్ఫూర్తిని అందిస్తున్న ఈ గీతం జాతీయ ఐక్యతకు ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు.

కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సాగి రామకృష్ణ నిషాంత్ వర్మ, డైరెక్టర్ డాక్టర్ జగపతి రాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కె.వి. మురళీకృష్ణంరాజు, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిహెచ్. దిలీప్ చక్రవర్తి మాట్లాడుతూ.. వేలాది మంది విద్యార్థులు కలిసి వందేమాతరం ఆలపించడం తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ భావాలను పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు.

బీజేపీ సీనియర్ నాయకుడు కలిదిండి వినోద్ వర్మ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా యువతలో దేశభక్తి, జాతీయ బాధ్యతా భావాలను పెంపొందించే కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు.

భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నషా ముక్త్ భారత్ అభియాన్’లో ఏబీవీపీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు, మద్యపానానికి దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.

అనంతరం విద్యార్థులు సుమారు 3,000 అడుగుల భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ కళాశాల నుంచి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ అల్లూరి సీతారామరాజు విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. దేశభక్తి నినాదాలతో సాగిన ఈ కార్యక్రమం భీమవరం నగరంలో జాతీయ స్ఫూర్తిని చాటిచెప్పింది.