
ఈ నెల 14వ తారీఖున బెంగళూరులో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారీ మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈమధ్య దేశంలో ప్రముఖంగా చర్చనీయాంశాలుగా ఉన్న “జమ్మూకాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు”, “అయోధ్య రామజన్మభూమిలో శ్రీ రామ మందిరం నిర్మాణం”, “పౌరసత్వ సవరణ చట్టం (CAA)” లపై మూడు తీర్మానాలను ఆర్ ఎస్ ఎస్ వెలువరించింది. ఆ తీర్మానాలను మనం సవివరంగా తెలుసుకుందాం.
తీర్మానం – 1
జమ్మూకాశ్మీర్ రాష్ట్రం మొత్తానికి భారత రాజ్యాంగాన్నివర్తింపచేయడం, రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరించడం రెండూ ప్రశంసనీయమైన చర్యలు

జమ్మూకాశ్మీర్ రాష్ట్రం మొత్తానికి భారత రాజ్యాంగాన్ని వర్తింపచేయడం, గౌరవనీయ రాష్ట్రపతి ఇచ్చిన రాజ్యాంగపరమైన ఆదేశాన్ని పార్లమెంట్ ఉభయ సభల ఆమోదంతో 370వ అధికరణను నిర్వీర్యం చేయడం వంటి చర్యలను అఖిల భారతీయ కార్యకారీ మండలి హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నది. అలాగే రాష్ట్రాన్ని జమ్మూకాశ్మీర్, లడఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరించడం కూడా ప్రశంసించదగిన చర్య. ఇలాంటి చారిత్రాత్మక, సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకోవడంలో, జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యవహరించడంలో చూపిన పరిణతికి, చొరవకు కేంద్ర ప్రభుత్వానికి, అన్ని రాజకీయ పార్టీలకు కార్యకారీ మండలి అభినందనలు తెలుపుతోంది. గౌరవనీయ ప్రధానమంత్రి, ఆయన బృందం చూపిన రాజకీయ చిత్తశుద్ది, రాజనీతిజ్ఞతలు కూడా ప్రశంసనీయమైనవి.
దేశంలోని అన్ని రాష్ట్రాలకు, ప్రాంతాలకు భారత రాజ్యాంగం సమానంగా వర్తిస్తున్ననప్పటికీ, దేశ విభజన సమయంలో పాకిస్థాన్ చేసిన దాడి వల్ల ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల్లో తాత్కాలికమైన 370వ అధికరణను రాజ్యాంగంలో చేర్చారు. ఆ తరువాతి కాలంలో 370వ అధికరణ పేరు చెప్పి రాజ్యాంగంలోని అనేక అధికారణాలను జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో అమలు చేయకపోవడంగాని, పూర్తిగా మార్చివేసి అమలుపరచడంగాని జరిగింది. వేర్పాటువాద బీజాలను నాటిన 35ఏ వంటి పరిచ్ఛేదాలను ఏకపక్షంగా రాష్ట్రపతి ఆదేశాల ద్వారా రాజ్యాంగంలో చొప్పించారు. ఈ రాజ్యాంగపరమైన వైపరీత్యాల మూలంగా రాష్ట్రంలోని షెడ్యూల్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులు, గూర్ఖాలు, మహిళలు, పారిశుద్ధ్య కార్మికులు, పాకిస్థాన్ శరణార్ధులు మొదలైనవారు తీవ్ర వివక్షకు గురయ్యారు. రాష్ట్ర అసెంబ్లీలో జమ్ము, లడఖ్ ప్రాంతాలకు తగిన ప్రాతినిధ్యం, వనరుల కేటాయింపు, నిర్ణయ ప్రక్రియలో సరైన భాగస్వామ్యత లేకుండా పోయాయి. ఇలాంటి లోపభూయిష్టమైన విధానాల మూలంగా రాష్ట్రంలో `తీవ్రవాదం, ఛాందసవాదం’ పెరిగిపోవడం చూశాం. అలాగే జాతీయ శక్తులు పూర్తి నిర్లక్ష్యానికి గురయ్యాయి.
ఇటీవల తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు మూలంగా ఈ రాజ్యాంగపరమైన, రాజకీయపరమైన వైపరీత్యాలకు విరుగుడు జరుగుతుందని కార్యకారీ మండలి విశ్వసిస్తోంది. అలాగే ఈ చర్యలు `ఒకే దేశం – ఒకే ప్రజానీకం’ అనే భావనకు తగినట్లుగా ఉండడమేకాక రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగ పీఠికలో పేర్కొన్న `మనం ఈ దేశ ప్రజానీకం…’ అనే ఆలోచనను కూడా పరిపుష్టం చేసే విధంగా ఉన్నాయి.
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ వలన మూడు ప్రాంతాల్లోని అన్ని వర్గాలవారి సామాజిక, ఆర్ధికాభివృద్ధికి కొత్త దారులు తెరుచుకున్నాయని కార్యకారీ మండలి భావిస్తున్నది. పునర్వ్యవస్థీకరణ లడఖ్ ప్రాంత ప్రజానీకపు చిరకాల ఆకాంక్షలను నెరవేర్చేవిధంగా, ఆ ప్రాంతపు సమైక్యాభివృద్ధికి అనుకూలంగా ఉంది. శరణార్ధుల సమస్యలు కూడా పరిష్కారమవుతాయని కార్యకారీ మండలి ఆశిస్తోంది. కాశ్మీర్ లోయ నుంచి గెంటివేతకు గురైన హిందువుల గౌరవపూర్వకమైన పునరావాస ప్రక్రియ కూడా సాధ్యమైనంత త్వరగా మొదలుపెట్టాలి.
`విలీన ఒప్పందం’పై సంతకం చేయడం ద్వారా మహారాజా హరిసింగ్ జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని భారత్ లో విలీనం చేశారన్నది చారిత్రక సత్యం. జాతీయ సమైక్యత, జాతీయ జెండా గౌరవం కోసం డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిట్ ప్రేమ్ నాథ్ డోగ్రాల నాయకత్వంలో ప్రజా పరిషద్ ఆందోళన్ కు చెందిన సత్యాగ్రహులు ఆందోళన చేశారు. మిగిలిన దేశంలోని జాతీయవాదులు 370వ అధికరణ దుర్వినియోగం మూలంగా కలిగిన సమస్యల పరిష్కారం కోసం పోరాడారు. గత 70 ఏళ్లుగా జమ్మూకాశ్మీర్ లోని జాతీయవాదులు దేశంలోని ఇతర జాతీయవాదులతో కలిసి వేర్పాటువాదం, తీవ్రవాదాలకు వ్యతిరేకంగా పోరాడారు. ప్రాణాలను సైతం అర్పించారు. దేశ సమైక్యత, సమగ్రతలను కాపాడటంలో వేలాదిమంది సైనికులు, భద్రతాదళాలవారు అపూర్వమైన ధైర్యసాహసాలను చూపారు. మహోన్నత త్యాగాలు చేశారు. వారందరికి కార్యకారీ మండలి కృతజ్ఞతాపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తోంది.
రాజ్యాంగ స్ఫూర్తిని, రాజ్యాంగ విశిష్టతను పాదుకొలిపేందుకు దేశ ప్రజానీకమంతా, రాజకీయ విభేదాలను పక్కనపెట్టి, ఏకంకావాలని, జమ్మూకాశ్మీర్, లడఖ్ ప్రాంతాల అభివృద్ది యాత్రలో భాగస్వాములు కావడం ద్వారా దేశ సమైక్యత, సమగ్రతలను మరింత పటిష్టపరచాలని కార్యకారీ మండలి పిలుపునిస్తున్నది. అలాగే ఈ ప్రాంత ప్రజానీకపు సందేహాలు, భయాలను తొలగించి, సమర్ధమైన, న్యాయపూర్వకమైన పరిపాలన, ఆర్ధికాభివృద్ధి ద్వారా వారి ఆకాంక్షలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నది.
తీర్మానం – 2
రామజన్మభూమిలో మందిర నిర్మాణం – జాతీయ గౌరవానికి ప్రతీక

జాతి ఆకాంక్షలకు అనుగుణంగా అయోధ్య రామజన్మభూమిలో భవ్య మందిర నిర్మాణం విషయమై ఎదురవుతున్న అడ్డంకులనన్నింటిని గౌరవనీయ సర్వోన్నత న్యాయస్థానం తన ఏకగ్రీవమైన తీర్పు ద్వారా పూర్తిగా తొలగించిందని ఆర్ ఎస్ ఎస్ అఖిల భారతీయ కార్యకారీ మండలి భావిస్తోంది. 9 నవంబర్, 2019 న గౌరవనీయ సర్వోన్నత న్యాయస్థానం రామజన్మభూమి విషయమై ఇచ్చిన తీర్పు దేశ న్యాయస్థానాల చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోతుంది. వాదోపవాదాలు జరుగుతున్న సమయంలో అనేక అడ్డంకులు సృష్టించడానికి చాలా ప్రయత్నం జరిగినప్పటికి అపూర్వమైన సహనం, నైపుణ్యం చూపుతూ సర్వోన్నత న్యాయస్థానపు గౌరవనీయ న్యాయమూర్తులు ఎంతో సంతులితమైన తీర్పును వెలువరించారు. ఇలాంటి చారిత్రాత్మక తీర్పును వెలువరించిన గౌరవనీయ సర్వోన్నత న్యాయస్థానాన్ని కార్యకారీ మండలి హృదయపూర్వకంగా అభినందిస్తున్నది.
రామజన్మభూమి పక్షాన ప్రముఖులైన న్యాయవాదులు ఎంతో నైపుణ్యం, నిష్ఠతో ఆధారాలు చూపి, వాదనలు వినిపించిన తీరు ఎంతైనా ప్రశంసాపాత్రమైనది. తీర్పును ఏ ఒక్క వర్గం తమ విజయంగానో, పరాజయంగానో పరిగణించకుండా, దేశం, న్యాయవ్యవస్థ, రాజ్యాంగాల గెలుపుగా స్వీకరించడం, అంగీకరించడం చాలా సంతోషించదగిన పరిణామం. తీర్పు పట్ల ఎంతో పరిణతితో కూడిన స్పందన చూపిన దేశ పౌరులందరిని కార్యకారీ మండలి అభినందిస్తోంది.
“శ్రీ రామజన్మభూమి మందిర ఉద్యమం’’ ప్రపంచ చరిత్రలోని ప్రముఖమైన, చిరకాలం గుర్తుండే ఉద్యమాలలో కూడా ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుంది. 1528 నుండి సాగిన ఈ మహా ఉద్యమంలో, పోరాటంలో లక్షలాది మంది రామ భక్తులు తమ జీవితాలను బలిదానం చేశారు. కొన్ని సందర్భాలలో కొందరు మహా పురుషులు ఈ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలబడితే మరి కొన్నిసార్లు ప్రజలే స్వీయప్రేరణతో ముందుకు తీసుకువెళ్లారు. 1950లో ప్రారంభమైన న్యాయపోరాటం, 1983లో మొదలైన ప్రజా ఉద్యమం చివరికి విజయవంతంగా పూర్తయ్యాయి. ప్రపంచ చరిత్రలోనే అత్యున్నతమైన ఉద్యమం అనేకమంది మహామహుల అకుంఠిత, అవిశ్రాంత కృషి మూలంగా విజయశిఖరాన్ని చేరుకుంది. ఈ మహోద్యమంలో, మనకు తెలిసిన, తెలియని, అమరులైన వారందరికి కృతజ్ఞతపూర్వక శ్రద్ధాంజలి ఘటించడం పవిత్ర కర్తవ్యమని కార్యకారీ మండలి భావిస్తోంది.
తీర్పు వెలువడిన తరువాత తీర్పును సహృదయంతో స్వీకరించే విధంగా సమాజంలోని అన్ని వర్గాల వారిని మానసికంగా సంసిద్ధులను చేయడం ఏ ప్రభుత్వానికైనా చాలా కఠినమైన పని. అలా అన్ని వర్గాల విశ్వాసాన్ని పొందడంలో చూపిన చొరవకు, సహనానికి కేంద్ర ప్రభుత్వం, ప్రస్తుత రాజకీయ నాయకత్వాన్ని కార్యకారీ మండలి అభినందిస్తున్నది.
సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు, రామభక్తుల విశ్వాసాలకు తగినట్లుగా `శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర’ పేరుతో ట్రస్ట్ ను ఏర్పాటు చేసి అది తమ అదుపులో కాకుండా కేవలం సహకారం అందిస్తూ సమాజపు పర్యవేక్షణలోనే నడిచేవిధంగా రూపొందించడం ప్రభుత్వపు ముందుచూపును తెలియజేస్తోంది. ఉద్యమానికి నేతృత్వం వహించిన పూజ్య సాధుసంతుల మార్గదర్శనంలోనే మందిర నిర్మాణం జరిపించాలన్న నిర్ణయం కూడా ప్రశంసించదగినది. రామజన్మభూమిలో భవ్యమైన, పవిత్ర మందిర నిర్మాణంతోపాటు పరిసర క్షేత్ర నిర్మాణాన్ని కూడా న్యాస్ వేగంగా పూర్తిచేస్తుందని కార్యకారీ మండలి ఆశిస్తున్నది. భారతీయులందరూ, ప్రపంచమంతటా ఉన్న రామభక్తులు ఈ పవిత్ర కార్యంలో పాలుపంచుకుంటారని కార్యకారీ మండలి విశ్వసిస్తున్నది.
పవిత్ర మందిర నిర్మాణంతోపాటు మర్యాదా పురుషోత్తముడైన శ్రీ రామచంద్రుని ఉన్నతమైన ఆదర్శాలను అనుసరించే, ఆచరించే ధోరణి సమాజంలో పెరుగుతుంది. అలాగే ప్రపంచంలో శాంతి, సామరస్యం, సౌహార్ద్రాలను నెలకొల్పే కార్యాన్ని భారత్ తప్పక పూర్తిచేస్తుంది.
తీర్మానం – 3
పౌరసత్వ సవరణ చట్టం, 2019 – భారత్ నైతిక, రాజ్యాంగ కర్తవ్యం

పొరుగున ఉన్న మూడు ముస్లిం దేశాలైన పాకిస్థాన్ , బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లలో మతపరమైన వివక్షకు గురై భారత్ కు వచ్చిన హిందువులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రైస్తవులకు భారత పౌరసత్వాన్ని కల్పించే ప్రక్రియలో క్లిష్టతను తగ్గించి సులభతరం చేయడానికి వీలుకల్పించే పౌరసత్వ సవరణ చట్టం, 2019 ఆమోదించిన పార్లమెంట్ ను, అమలుచేసిన కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్ ఎస్ ఎస్ అఖిల భారతీయ కార్యకారీ మండలి హృదయపూర్వకంగా అభినందిస్తున్నది.
1947లో భారత్ ను మత ప్రాతిపదికపై రెండుగా విభజించారు. రెండు దేశాలూ తమ దగ్గర ఉన్న మైనారిటీలకు సమాన అవకాశాలు, గౌరవం, భద్రత కల్పించాలని నిర్ణయించుకున్నాయి. భారత్ లోని సమాజం, అలాగే రాజ్యం(ప్రభుత్వం) ఈ భౌగోళిక సరిహద్దులలో నివసించే మైనారిటీల ప్రయోజనాలను పరిరక్షించాయి. అలాగే మైనారిటీల సురక్ష, అభివృద్ధికి రాజ్యాంగ బద్ధమైన హామీని కల్పించే విధానాలను కూడా భారత రాజ్యం రూపొందించింది. మరోవైపు, భారత విభజన మూలంగా ఏర్పడిన దేశాలు మాత్రం నెహ్రూ – లియాకత్ ఒప్పందం కుదిరినా, వివిధ సందర్భాల్లో వారి నేతలు హామీలు ఇచ్చినా మైనారిటీలకు సురక్షితమైన స్థితిగతులను కలిగించడంలో పూర్తిగా విఫలమయ్యాయి. ఆ దేశాల్లో ఉన్న మైనారిటీలు నిరంతర మతపరమైన వివక్ష, ఆస్తుల దురాక్రమణ, మహిళలపై అత్యాచారాలు వంటి నిరంతర సంఘటనల మూలంగా కొత్తరకం బానిసత్వానికి గురయ్యారు. అక్కడి ప్రభుత్వాలు కూడా వివక్షాపూరితమైన విధానాలు, అన్యాయపూరితమైన చట్టాల ద్వారా మైనారిటీలపై అణచివేతను ప్రోత్సహించాయి. దీని మూలంగా ఆ దేశాల్లోని మైనారిటీలు పెద్ద సంఖ్యలో భారత్ కు తరలివచ్చారు. దేశ విభజన తరువాత ఏర్పడిన ఆ దేశాల్లో మైనారిటీల జనాభా శాతం బాగా తగ్గిపోవడం ఈ పరిణామాలకు స్పష్టమైన ఋజువు.
ఆ ప్రాంతాల్లో చిరకాలంగా నివశిస్తున్న భారతీయ సమాజం సంస్కృతి పరిరక్షణతోపాటు దేశ స్వాతంత్ర్య సమరంలో కూడా ప్రముఖమైన పాత్ర పోషించిందన్నది మరచిపోరాదు. కాబట్టి అణచివేతకు, వివక్షకు గురవుతున్న ఈ మైనారిటీల ప్రయోజనాలను పరిరక్షించడం భారతీయ సమాజం, భారత ప్రభుత్వపు నైతిక, రాజ్యాంగపరమైన కర్తవ్యం. గత 70 ఏళ్లలో ఈ మైనారిటీ సోదరుల గురించి పార్లమెంట్ లో అనేకసార్లు చర్చించారు. అలాగే వివిధ ప్రభుత్వాలు అనేక చర్యలు కూడా చేపట్టాయి. కానీ విధానపరమైన అడ్డంకుల మూలంగా ఈ మైనారిటీలలో అధిక శాతం పౌరసత్వ హక్కును ఇప్పటి వరకు పొందలేకపోయారు. అభద్రత, అనిశ్చితి, ఆందోళనల మధ్య జీవిస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ సవరణ మూలంగా వీరు గౌరవప్రదమైన జీవితాన్ని గడిపే అవకాశం లభిస్తుంది.
పార్లమెంట్ లోనూ, ఇతరత్రా జరిగిన అనేక చర్చల్లో ఈ కొత్త చట్టం భారతీయ పౌరులెవరినీ, ఏవిధంగానూ ప్రభావితం చేయదని ప్రభుత్వం పదేపదే స్పష్టం చేస్తూ వచ్చింది. ఈశాన్య ప్రాంతంలో నివసించే ప్రజల భయాలు, సందేహాలను తీర్చడానికి ప్రభుత్వం ఈ చట్టంలో పొందుపరచిన అంశాలపట్ల కార్యకారీ మండలి సంతృప్తిని వ్యక్తం చేస్తున్నది. ఈ చట్ట సవరణ మూడు దేశాల్లో మత వివక్షకు గురై భారత్ కు వచ్చిన నిర్భాగ్యులకు పౌరసత్వం ఇవ్వడానికి ఉద్దేశించిందేతప్ప ఏ భారత పౌరుడి పౌరసత్వాన్ని తొలగించడానికో, రద్దుచేయడానికో కాదు. కానీ ఒక వర్గానికి చెందినవారి మనస్సుల్లో భయాందోళనలు సృష్టించడం ద్వారా జిహాదీ – వామపక్ష కూటమి, మతరాజకీయాలతో స్వార్ధ ప్రయోజనాలు పొందాలనుకునే రాజకీయ పార్టీలు, కొన్ని విదేశీ శక్తుల మద్దతుతో, దేశ వ్యాప్తంగా అరాచక, హింసాత్మక పరిస్థితులను వ్యాపింపచేయడానికి కుట్రపూరితమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నది. కార్యకారీ మండలి ఇలాంటి కార్యకలాపాలను తీవ్రంగా ఖండించడమేకాక మత సామరస్యాన్ని, జాతీయ సమైక్యతను దెబ్బతీయడానికి ప్రయత్నించే శక్తుల గురించి క్షుణ్ణంగా దర్యాప్తు చేసి, అవసరమైన కఠిన చర్యలు తీసుకోవలసిందిగా ప్రభుత్వాలను కోరుతున్నది.
కచ్చితమైన ఆధారాల వెలుగులో విషయాలను ఆర్ధం చేసుకోవడమేకాక దేశ వ్యతిరేక కార్యకలాపాలను నిరోధించడంలో చురుకైన పాత్ర పోషించి, దేశంలో సుహృద్భావపూర్వకమైన వాతావరణం ఏర్పాటు చేయడంలో సమాజంలోని అన్ని వర్గాలవారు, ముఖ్యంగా జాగరూకమైన, బాధ్యతాయుతమైన నాయకత్వం, ముందుండాలని అఖిల భారతీయ కార్యకారీ మండలి విజ్ఞప్తి చేస్తున్నది.
VSK TELANGANA సౌజన్యంతో….





