News

కరోనాను కలసి ఎదుర్కుందాం : సార్క్‌ దేశాలతో ప్రధాని మోడీ

938views

రోనా వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యలపై చర్చించేందుకు సార్క్‌ సభ్య దేశాలు ఆదివారం సమావేశమయ్యాయి. ఈ సమావేశంలో భారత్‌, శ్రీలంక, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, మాల్దీవులు, అఫ్గానిస్థాన్‌, భూటాన్‌, నేపాల్‌ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ‘కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు భారత్‌ సిద్ధంగా ఉంది. వైరస్‌ గురించి అతిగా భయపడొద్దు. మన ప్రజల మధ్య సంబంధాలు ప్రాచీనమైనవి. మన దేశాలు కూడా ఎప్పటి నుంచో సత్సంబంధాలు కలిగి ఉన్నాయి. మన దగ్గర వ్యాపిస్తున్న కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు మనందరం కలిసి పోరాడాలి. అప్పుడే విజయం సాధ్యం. కరోనాను అడ్డుకునే కార్యక్రమంలో భాగంగా భారత్‌ 10మిలియన్‌ డాలర్లతో నిధి ఏర్పాటుకు ప్రతిపాదన చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న మీ అందరికీ కృతజ్ఞతలు. ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకున్నప్పటికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేపాల్‌ ప్రధాని కేపీశర్మ ఓలికి ప్రత్యేకంగా కృతజ్ఞలు. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.

శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే మాట్లాడుతూ.. ‘ఈ సమావేశ ఏర్పాటుకు పిలుపునిచ్చినందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు. దీని ద్వారా మన అనుభవాలు, ఆలోచనలు పంచుకోవడంతోపాటు సవాళ్లను అర్థం చేసుకోవడానికి, ఆపై తీసుకోవలసిన చర్యలపై చర్చించడానికి అవకాశం కలిగింది. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడానికి దక్షిణాసియా దేశాలు తమ ఆలోచనలు, పద్ధతులు పంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా ప్రత్యేక యంత్రాగాన్ని ఏర్పాటు చేయాలి’ అని అన్నారు.

మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్‌ మాట్లాడుతూ.. ‘కరోనా వైరస్‌ను అడ్డుకోవడంలో భాగంగా సార్క్‌ సమావేశం ఏర్పాటుకు చొరవ చూపించిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు. మాల్దీవులకు సహాయం చేసేందుకు భారత్‌ ఉన్నందుకు అదృష్టంగా భావిస్తున్నాం. భారత ప్రజలకు, మోడీకి మా కృతజ్ఞతలు. ఈ వైరస్‌ను ఎదుర్కోవడంతో ఏ దేశం ఒంటరిగా విజయం సాధించలేదు. అందరం కలిసి పోరాడాలి’ అని అన్నారు.

బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా మాట్లాడుతూ.. తమ దేశంలోని 23 మంది విద్యార్థులను వుహాన్ నుంచి తిరిగి తీసుకువచ్చినందుకు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.

పాకిస్థాన్‌ ప్రధాని ప్రత్యేక సహాయకుడు జాఫర్ మీర్జా మాట్లాడుతూ.. ‘కరోనా ప్రభావంతో ఇప్పటికే 1,55,000కు పైగా బాధితులుగా మారారు. 5,833 మంది ప్రాణాలు కోల్పోయారు. 138 దేశాలకు ఈ వైరస్‌ వ్యాపించింది. ఈ విషయంలో ప్రపంచంలోని ఏ దేశం స్పందించకుండా ఉండలేదు’ అని అన్నారు.

అఫ్గానిస్థాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘని మాట్లాడుతూ.. ‘కరోనాను అడ్డుకునేందుకు టెలీ మెడిసిన్ చేయాలి. అందుకోసం మనమంతా ఒక జట్టుగా ఏర్పడాలి. సరిహద్దులను మూసివేయడం వల్ల ఆహారం, మందులు ఇతర ప్రాథమిక వస్తువుల లభ్యతలో తీవ్రమైన సమస్య ఏర్పడుతుంది’ అని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.