ArticlesNews

హస్తకళే దైవ సేవగా- లక్షకుపైగా జగన్నాథుని విగ్రహాలు చెక్కిన శిల్పి

7views

ఒక చెక్క ముక్కను అద్భుతమైన కళాఖండంగా మలచడం ఎంతోమంది శిల్పులు చేసే పని. కానీ అదే చెక్కలో భక్తి, సంప్రదాయం, ఆధ్యాత్మికతను మేళవించి భక్తుల ఆరాధ్య దైవంగా తీర్చిదిద్దడం కొద్దిమందికే సాధ్యం. ఒడిశాలోని ఓ కళాకారుడు ఈ రెండో కోవకు చెందిన వారు. ఆయన చిన్ననాటి నుంచి జగన్నాథ స్వామిపై ఉన్న భక్తిని, చెక్క పనిపై ఉన్న ఆసక్తిని కలిపి చెక్కతో భగవంతుని విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. అలా నేడు వేలాది మంది భక్తుల ఇళ్లలో, ఆలయాల్లో జగన్నాథ స్వామి కొలువుదీరేలా చేస్తున్నాడు.

ఒడిశా, ఖోర్ధా జిల్లాలోని టంగీ సమీపంలోని పరియోరాడ గ్రామంలో జన్మించిన చింతామణి మహారాణాకు చెక్క పనిపై ఆసక్తి కుటుంబం నుంచే వచ్చింది. చిన్నతనంలో ఆయనకు జగన్నాథ స్వామి చిత్రాలను గీయడం ఎంతో ఇష్టం. ఆ అభిరుచి క్రమంగా శిల్పకళ వైపు మళ్లింది. అయితే ఈ రంగంలోకి రావొద్దని కుటుంబ సభ్యులు తొలుత తనను వారించేవారని ఆయన అన్నారు. ఈ వృత్తిలో కష్టాలు ఎక్కువని, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి అని చెప్పారని తెలిపారు. కానీ జగన్నాథ స్వామి రూపాన్ని చెక్కాలన్న తన సంకల్పం మాత్రం మారలేదని చెప్పారు. అదే తన జీవిత లక్ష్యంగా మారిందని అన్నారు.

శిల్పకళపై ఆసక్తితో
చింతామణి పాఠశాల విద్యాభ్యాసం కోసం పూరీలోని ఆయన మేనమామ ఇంట్లో నివసించారు. ఆ సమయంలో రథయాత్ర కోసం రథాలను తయారు చేసే పనిని దగ్గరగా చూసే అవకాశం ఆయనకు లభించింది. అదే ఆయనలో శిల్పకళపై మరింత ఆసక్తిని పెంచింది. అనంతరం తన సోదరులు కాహ్ను మహారాణా, ఫకీర్ మహారాణా వద్ద విగ్రహాల తయారీని నేర్చుకున్నారు. దాదాపు పదేళ్ల పాటు శిక్షణ తీసుకుని జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్రమ్మ, సుదర్శన స్వామి విగ్రహాల తయారీలో నైపుణ్యం సంపాదించారు.

‘శ్రీ జగన్నాథ హస్తకళా కేంద్రం’
చింతామణి భువనేశ్వర్‌లోని బరాముండా జగన్నాథ ఆలయం సమీపంలో గత 20 ఏళ్లుగా ‘శ్రీ జగన్నాథ హస్తకళా కేంద్రం’ నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఆయనతో పాటు తన తండ్రి, సోదరులు, బంధువులు, ఇతర నైపుణ్యం కలిగిన కళాకారులు కలిసి పూర్తిగా వేప చెక్కతో విగ్రహాలను తయారు చేస్తున్నారు. ఒక అంగుళం పరిమాణంలో ఉండే చిన్న విగ్రహాల నుంచి ఆరు అడుగుల ఎత్తైన దారు విగ్రహాల వరకు వివిధ పరిమాణాల్లో రూపొందిస్తారు. ఆయన రూపొందించిన విగ్రహాలు ఒడిశాలోని అనేక ఆలయాల్లో ప్రతిష్ఠించారు. అంతేకాదు దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్, చైనా తదితర దేశాల్లోని ఆలయాలు, భక్తుల ఇళ్లకు కూడా అవి చేరాయి. గత 26 ఏళ్లలో లక్షకు పైగా జగన్నాథ స్వామి చెక్క విగ్రహాలను తయారు చేసినట్లు ఆయన తెలిపారు.

వాటి తయారీకి ప్రత్యేకమైన ఆచారాలు
దేవాలయాల కోసం తయారు చేసే దారు విగ్రహాల(త్రిమూర్తుల చెక్క విగ్రహాలు) విషయంలో మాత్రం ప్రత్యేకమైన ఆచారాలను పాటించాల్సి ఉంటుందని చింతామణి తెలిపారు. కళాకారులు 21 రోజుల పాటు పవిత్ర నియమాలు పాటిస్తూ, కొత్త సంప్రదాయ వస్త్రాలు ధరించి, నిరంతరం దీపం వెలుగు ఉండే గదిలో ఏకాంతంగా ఉంటూ విగ్రహాలను చెక్కుతారని అన్నారు. ఈ ప్రక్రియలో విశ్వకర్మ ఆశీస్సులు తమకు ఉంటాయని విశ్వసిస్తానని చెప్పారు.

30 ఏళ్ల నాటి విగ్రహానికి పునరుద్ధరణ
కొత్త విగ్రహాల తయారీతో పాటు పాత, దెబ్బతిన్న విగ్రహాలను పునరుద్ధరించడం కూడా ఆయన కేంద్రం ప్రత్యేకత. ప్రమాదవశాత్తు పాడైన 30 ఏళ్ల నాటి జగన్నాథ స్వామి విగ్రహాన్ని చింతామణి పునరుద్ధరించిన తర్వాత ఆయన సేవలకు మౌసుమి సమల్ ఆకర్షితురాలు అయ్యారు. ప్రస్తుతం ఆమె చింతామణికి చెందిన కేంద్రంలో విగ్రహాలకు రంగులు వేయడం, అలంకరించడం వంటి పనుల్లో సహకరిస్తున్నారు. మరో భక్తురాలు శ్రద్ధా షెఫాలికా కూడా తొలుత చిన్న మరమ్మత్తు కోసం వచ్చినప్పటికీ, తర్వాత జగన్నాథ సేవలో భాగస్వామిగా మారారు. అలాగే మీనాక్షి దాస్ ప్రతి ఏడాది స్నాన పూర్ణిమ నుంచి రథయాత్ర మధ్య కాలంలో తన ఇంటి జగన్నాథ విగ్రహాన్ని పునరుద్ధరణ కోసం ఈ కేంద్రానికే తీసుకువస్తున్నారు. చింతామణి పనితనం, భక్తి తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఆమె చెబుతున్నారు.

భవిష్యత్తులో జగన్నాథ చెక్క విగ్రహాలకు సంబంధించిన సంప్రదాయాలు, ఆచారాలను పరిరక్షించేలా ఒక ప్రత్యేక మఠాన్ని ఏర్పాటు చేయడమే తన లక్ష్యమని చింతామణి. ప్రభుత్వం సహకరిస్తే ఈ శతాబ్దాల నాటి కళను యువతకు చేరవేసి, జగన్నాథ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు. ప్రతిరోజూ ఆయన కార్యశాలలో వేప చెక్క సువాసన మధ్య శిల్పుల పనిముట్ల శబ్దాలు మార్మోగుతుంటాయి. సాధారణ చెక్క ముక్కలు దేవతా రూపాలుగా మారుతుంటాయి.