
సంస్కారాన్ని నేర్పించే పాఠశాలలో భారతీయ సనాతన ధర్మాన్ని పట్టపగలే అత్యంత దారుణంగా అవమానించిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడులో చోటు చేసుకుంది. ఈ మధ్య హిందూ దేవాలయాలు, దేవతా విగ్రహాలు, దేవాలయాలలోని రధాలను కొందరు దుండగులు ధ్వంసం చేస్తున్న విషయం పాఠకులకు విదితమే.
తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం దేవాలయాలలోని విగ్రహాల ధ్వంసం, గుంటూరు జిల్లాలోని మండల కేంద్రమైన రొంపిచర్లలో రుక్మిణీ సత్యభామ సమేత మదన గోపాల స్వామి వారి ఆలయంలోని విగ్రహాల ధ్వంసం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరంలో దేవాలయ ముఖ ద్వారం ధ్వంసం, నెల్లూరు జిల్లా కొండ బిట్రగుంట దేవాలయ ఉత్సవ రధాన్ని తగులబెట్టడం వంటివి చోటు చేసుకున్నాయి. వీటికి కొనసాగింపు అన్నట్లుగా పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులోని బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని చదువులతల్లి సరస్వతీ దేవి విగ్రహాన్ని ఎవరో గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు.
ఈ దురదృష్టకర ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో జరిగిన దాడుల కారకులపై ప్రభుత్వము, పోలీసులు కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు మరళా పునరావృతం అయ్యుండేది కాదని వారు అభిప్రాయపడుతున్నారు. హిందూ దేవాలయాలు, దేవీదేవతల విగ్రహాలపై ఇలా వరుస దాడులు జరుగుతున్నా కూడా పోలీసులు, ప్రభుత్వము, మంత్రులు ఎవరూ కిమ్మనకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నదని, హిందూ దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులకు ప్రభుత్వ పరోక్ష మద్దతు ఉన్నదనే భావనకు మరింత బలం చేకూరుతున్నదని వారు ఆవేదన చెందుతున్నారు.





