NewsProgrammsSeva

విజయవంతమైన ఆరోగ్య సేవా యాత్ర

212views

ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలుకు చెందిన “చెంచు లక్ష్మి” ,“సేవా భారతి” మరియు ఎన్ఎమ్ఓ ల సంయుక్త ఆధ్వర్యంలో ఫిబ్రవరి 28,29 మరియు మార్చి 1 తారీఖులలో ఆరోగ్య సేవా యాత్ర నిర్వహించబడినది. కర్నూలులోని స్వర్గీయ జి. పుల్లారెడ్డి దంత వైద్య కళాశాల ఆడిటోరియంలో ప్రారంభోత్సవ వేడుక కార్యక్రమంతో ఉచిత ఆరోగ్య శిబిరాలు మరియూ ఆరోగ్యం అవగాహనా కార్యక్రమాలు ప్రారంభమైనవి.

ఈ కార్యక్రమంలో స్వర్గీయ జి. పుల్లారెడ్డి దంత కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్ర శేఖర్, కర్నూలు అశ్విని హాస్పిటల్ పల్మోనాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్ ఎస్ ఎస్ కర్నూలు విభగ్ సంఘచాలక్ డాక్టర్ రఘురామ్, వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ (ENT) డాక్టర్ విశ్వంభర్ సింగ్, కర్నూలు మెడికల్ కళాశాల మైక్రో హెచ్ఓడి ప్రొఫెసర్ సురేఖ, జాతీయ వైద్య విద్యార్థుల సంస్థ (ఎన్ఎంఓ) జాతీయ ఉమ్మడి ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ అర్చన శర్మ, స్వర్గీయ జి. పుల్లారెడ్డి దంత వైద్య కళాశాల ఎన్‌ఎంఓ అధ్యక్షుడు డాక్టర్ గరిమా రాజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

కర్నూలు జిల్లా అత్మకూరు సమీపంలోని ఎన్ గోకవరం చుట్టుప్రక్కల గల మారుమూల గిరిజన గ్రామాల్లో 22 శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ శిబిరాలలో రాష్ట్రంలోని 5 వైద్య కళాశాలలు, 1 దంత కళాశాల పాల్గొన్నాయి. 38 మంది దంత వైద్యులు మరియు 19 మంది వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.

అందుబాటులో ఉన్న సమాచారం  ప్రకారం మొత్తం  512 మంది రోగులు ప్రయోజనం పొందారు, ఇందులో 187 చిన్నపిల్లలు, 86 మంది పురుషులు మరియు 139 మంది మహిళలు ఉన్నారు. 76 మంది రోగులను మెరుగైన చికిత్స కొరకు సమీప ఆసుపత్రులకు పంపడం జరిగింది.

స్థానిక స్వయం సేవకులు, సేవా భారతి, కర్నూలు మరియు నంద్యాల బృందాలు హృదయ పూర్వకంగా సేవలు అంద చేశారు. రక్తపోటు, డయాబెటిస్, పొగాకు నమలడం, ముందస్తు నోటి గాయాలు, చర్మ వ్యాధులు వంటివి సాధారణంగా కనుగొన బడ్డాయి. 1/3/2020 న సాయంత్రం 5 – 7 గంటల నుండి శాంతిరామ్ మెడికల్ కాలేజ్ ఆడిటోరియంలో ముగింపు కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమానికి ఆరెస్సెస్ విభాగ్ కార్యకారిణి శ్రీ గూడా రఘురామయ్య ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేశారు. కర్నూలు విభాగ్ ప్రచారక్ శ్రీ నవీన్, విభాగ్ కార్యవాహ శ్రీ మనోహర్ మరియు నంద్యాలకు చెందిన ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.

ముగింపు కార్యక్రమాన్ని NMO రాష్ట్ర కార్యదర్శి ప్రముఖ ఆప్తాల్మాలజిస్ట్ డాక్టర్ భూషణ మూర్తి నిర్వహించారు. డాక్టర్ అర్చన శర్మ కార్యక్రమ విజయానికి కృషిచేసిన వారందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియ జేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ప్రమాణపత్రాలు, జ్ణాపికలు అందజేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.