News

ప్రపంచం చెబుతోంది ‘నమస్తే’

825views

రోనా వైరస్ దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా సంప్రదాయాలు మారిపోతున్నాయి. జనాలు షేక్ హ్యాండ్ ఇవ్వడం మానేశారు. భారతీయులు అనుసరించే నమస్తేకు అందరూ జై కొడుతున్నారు. దేశాధినేతలు సైతం నమస్తే చెప్పాలంటూ సూచిస్తున్నారు. తాజాగా నిన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ఐర్లండ్ ప్రధాని లియో వరాద్కర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరూ నమస్తే చెప్పుకున్నారు. ఐర్లండ్ ప్రధాని లియోకు భారతీయ మూలాలున్న విషయం గమనార్హం.

లియోను ఏ విధంగా గ్రీట్ చేశారంటూ ట్రంప్ ను మీడియా ప్రశ్నించగా ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. మేమిద్దరం షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు. ఒకరినొకరు చూసుకున్నాం. కాసేపు ఇబ్బందిగానే అనిపించింది. నమస్తే చెప్పుకున్నాం. కొన్ని రోజుల క్రితమే నేను ఇండియా నుంచి వచ్చా. అక్కడ ఎవరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు. నమస్తే పెట్టడం చాలా సులభం అని చెప్పారు.

ఇదే విషయం గురించి లియోను మీడియా ప్రశ్నించగా ఆయన రెండు చేతులు జోడించి నమస్తే పెట్టారు. వెంటనే పక్కనే ఉన్న ట్రంప్ కూడా చేతులు జోడించారు. ఆ తర్వాత ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ, వాస్తవానికి తాను ఎక్కువగా షేక్ హ్యాండ్ ఇవ్వనని… కానీ రాజకీయాల్లోకి వచ్చిన వారికి ఇది తప్పదని అన్నారు.

నమస్తే అంటున్న ప్రిన్స్‌ చార్లెస్‌

ఇప్పటికే ఇరాన్‌లో ఎంపీలు, బ్రిటన్‌ ఆరోగ్యశాఖ మంత్రి ఈ వైరస్‌ బారినపడ్డారు. దీంతో ఒకరితో ఒకరు చేయి కలిపేందుకు భయపడుతున్నారు. వైద్యులు కూడా వైరస్‌ వ్యాప్తిని అరికట్టాలంటే కరచాలనం చేయొద్దని సూచించారు. ఈ నేపథ్యంలో బ్రిటన్ రాజ కుటుంబానికి చెందిన ప్రిన్స్‌ చార్లెస్‌ నమస్తే పెడుతున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రిన్స్‌ చార్లెస్‌ కారు దిగి వచ్చే సందర్భంలో ఆయన అక్కడున్న వారికి షేక్‌హ్యాండ్ ఇచ్చేందుకు చేయి చాపారు. అయి అక్కడున్న వ్యక్తి ఆయన చెవిలో ఏదో చెప్పటంతో ఆయన షేక్‌హ్యాండ్ ఆపేసి నమస్తే పెట్టడం వీడియోలో కనిపించింది. అక్కడున్న మరో ఇద్దరు కూడా ఆయన్ను అదే విధంగా విష్ చేయడంతో ప్రతిగా ఆయన కూడా నమస్తే చెప్తారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రవీణ్‌ కశ్వాన్‌ అనే ఫారెస్ట్‌ ఆఫీసర్‌ తన ట్విటర్‌ ఖాతా షేర్‌ చేస్తూ ”భారతీయులు ఈ పద్ధతిని పాటించాలని ఎన్నో ఏళ్ల క్రితం చెప్పారు. అయితే ఇప్పుడు నమస్తే సరిగా ఎలా పెట్టాలని చిన్న క్లాస్‌ నిర్వహించాలి” అని ట్వీట్‌ చేశారు. ఆయన షేర్‌ చేసిన వీడియోని చూసిన నెటిజన్లు ‘హలో వరల్డ్‌ నుంచి నమస్తే వరల్డ్‌’, ‘యోగా తర్వాత నమస్తేనే అతి పెద్ద ఎగుమతి’, ‘మన పూర్వీకులది ఎంత ముందు చూపో’ అని కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.