కుంతీమాధవస్వామి కోనేరులో కేక్ కటింగ్.. బాధ్యులు క్షమాపణ చెప్పాలి: నిత్య విద్యానంద భారతి స్వామిజీ

కాకినాడ జిల్లా పిఠాపురంలోని ప్రాచీన పుణ్యక్షేత్రమైన శ్రీ కుంతీమాధవస్వామి ఆలయం కోనేరులో జన్మదిన వేడుకల పేరుతో కేక్ కటింగ్ నిర్వహించడం హిందూ ధార్మిక సంప్రదాయాలను అవమానించడమేనని నిత్య విద్యానంద భారతి స్వామిజీ తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
పంచ మాధవ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన కుంతీమాధవస్వామి ఆలయ కోనేరులో ఇటీవల అభివృద్ధి పనులకు భూమిపూజ నిర్వహించిన సందర్భంగా కొందరు దేవాలయ ప్రాంగణంలోనే జన్మదిన వేడుకలు జరుపుకోవడంపై స్వామిజీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
హిందూ ధర్మంలో జన్మదిన వేడుకలు నిర్వహించాలంటే అన్నదానం, వస్త్రదానం, గోసేవ, కల్యాణోత్సవాలు వంటి సత్కార్యాలు చేయడం సంప్రదాయమని ఆయన పేర్కొన్నారు. దేవాలయ వాతావరణంలో కేక్ కటింగ్, కొవ్వొత్తులు ఆర్పడం వంటి పాశ్చాత్య పద్ధతులు హిందూ సంస్కృతికి అనుగుణం కాదని వ్యాఖ్యానించారు.
దేవాలయంలో వేదమంత్రాల నడుమ పూజా కార్యక్రమాలు జరుగుతుండగా వాటిని పట్టించుకోకుండా కేక్‌లు పంచుకోవడం, హర్షధ్వానాలు చేయడం భగవంతుని పూజను అవమానించడమే కాకుండా భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని స్వామిజీ అన్నారు.
ఈ ఘటనకు బాధ్యులైన వారు హిందూ సమాజానికి, భక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు వెంటనే స్పందించి, వేద పండితులతో కోనేరులో సంప్రోక్షణ నిర్వహించాలని కోరారు.
దేవాలయాల పవిత్రత, ఆచార వ్యవహారాల పరిరక్షణ విషయంలో నిర్లక్ష్యం తగదని, అవసరమైతే ధార్మిక వర్గాలు తదుపరి కార్యాచరణను ప్రకటిస్తాయని నిత్య విద్యానంద భారతి స్వామిజీ హెచ్చరించారు.





