News

శ్రీశైలంలో ఘనంగా యోగాంధ్ర కార్యక్రమం

44views

శ్రీశైలం క్షేత్రంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని భక్తి, ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభోత్సవం నిర్వహించారు.

ఈ సందర్భంగా దేవస్థానం సిబ్బంది, శివసేవకులు సమిష్టిగా యోగాసనాలు ప్రదర్శించారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ స్వయంగా యోగా సాధనలో పాల్గొని అందరికీ ఆదర్శంగా నిలిచారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, యోగాను కేవలం కొన్ని రోజులపాటు మాత్రమే కాకుండా జీవితాంతం నిత్యకృత్యంగా అలవర్చుకోవాలని సూచించారు. రెండు మూడు నెలలు సాధన చేసి విరమించకుండా ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని తెలిపారు. సరైన ఆహార నియమాలతో కూడిన యోగా సాధన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ఆయుర్దాయాన్ని కూడా పెంచుతుందని పేర్కొన్నారు.

యోగ సాధన ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఉత్సాహం పెరుగుతాయని జాయింట్ కలెక్టర్ వివరించారు. నంద్యాల జిల్లా ప్రజలందరూ ప్రతిరోజూ యోగా చేసి ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో యోగా గురువులు, దేవస్థానం ఈవో శ్రీనివాసరావు, శివసేవకులు, దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.