News

జిమ్‌కు వెళ్లే మహిళలే లక్ష్యంగా మతమార్పిళ్లు.. ముఠా గుట్టురట్టు

46views

నాసిక్‌లోని ఓ బహుళజాతి కంపెనీలో బలవంతపు మత మార్పిళ్లు, లైంగిక వేధింపులు చోటుచేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అటువంటి మరో ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపుర్‌లో వెలుగులోకి వచ్చింది. జిమ్‌లలో చేరే మహిళలను లక్ష్యంగా చేసుకొని మత మార్పిళ్లు చేస్తున్న నెట్‌వర్క్‌ను పోలీసులు గుర్తించారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. మీర్జాపుర్‌లోని ఓ జిమ్‌ యజమాని మతం మారాలని బలవంతం చేస్తున్నట్లు ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసుపై విచారణ చేస్తుండగా.. దీని వెనుక పెద్ద నెట్‌ వర్క్‌ ఉన్నట్లు గుర్తించారు.

నిందితులు రాష్ట్రంలోని వివిధ జిమ్‌లు, సోషల్‌మీడియాల్లో ముందుగా మహిళలతో పరిచయాలు పెంచుకొని.. అనంతరం మత మార్పిడి చేసుకోవాలని వారిపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. దాదాపు 50 మందికి పైగా మహిళలను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్‌ చేపట్టినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో సన్నో అనే మహిళ ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. ముందుగా జిమ్‌లలో చేరి అక్కడి యువతులతో పరిచయం పెంచుకుంటుందని.. అనంతరం తన స్నేహితులుగా పేర్కొంటూ పలువురు ముస్లిం యువకులను వారికి పరిచయం చేస్తుందని పేర్కొన్నారు.

మరికొందరు మహిళలను నిందితులు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ల ద్వారా పరిచయం పెంచుకొని.. వారిలో మతమార్పిడి ఆలోచనలు కలిగేలా బ్రెయిన్‌ వాష్‌ చేసేవారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ ఫోన్‌లలో వందలాది మంది మహిళల ఫొటోలు, వీడియోలు, చాట్‌లు ఉన్నాయని.. వాటిపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ కేసు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ దృష్టికి వెళ్లడంతో ఆయన తీవ్రంగా స్పందించారు. నిందితులపై గ్యాంగ్‌స్టర్‌ చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ కేసులో ఇప్పటివరకు 10మంది అనుమానితులను అరెస్ట్‌ చేశామని.. దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు.