
పోలవరం జిల్లాలోని చింతూరు మండలం గొంది గూడెం గ్రామంలో “అరణ్య శ్రీ – అటవీ ఆధారిత సమృద్ధి” పేరుతో గిరిజన మహిళల ఆర్థికాభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక పైలట్ ప్రాజెక్టును ఘనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కే. దినేష్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అరణ్య శ్రీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
అటవీ ఉత్పత్తుల ఆధారంగా గిరిజన మహిళలకు స్థిరమైన జీవనోపాధి కల్పించడం, వెదురు సాగు ద్వారా ఆర్థిక సాధికారతను పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆయన వెల్లడించారు. పర్యావరణానికి హాని కలగకుండా వెదురు సాగును శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
జిల్లాలోని రెండు అటవీ ప్రాంతాల పరిధిలో 15 గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని, తొలి దశలో సుమారు లక్ష వెదురు మొక్కలను పెంచే లక్ష్యంతో చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా లభించే ఆదాయంలో 50 శాతం లాభాన్ని ఆయా గ్రామాల స్వయం సహాయక సంఘాల మహిళలకు అందజేయనున్నట్లు వెల్లడించారు.
వెదురుతో గృహోపకరణాలు, అలంకరణ వస్తువులు, బుట్టలు, కుర్చీలు, హస్తకళ ఉత్పత్తుల తయారీపై మహిళలకు ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. తయారైన ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలపై కూడా అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా ఎస్. బొజ్జిరెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ మహిళలు స్వయం ఉపాధి ద్వారా కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపరచుకునేందుకు “అరణ్య శ్రీ” కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.
శుభం నొక్వాల్ మాట్లాడుతూ, చింతూరు ఐటీడీఏ పరిధిలో ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించడం సంతోషకరమని తెలిపారు. వెదురు ఆధారిత ఉత్పత్తుల తయారీలో మహిళలు శిక్షణ పొంది అదనపు ఆదాయం పొందాలని ఆకాంక్షించారు.
కార్యక్రమ ప్రారంభానికి ముందు ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి, కొబ్బరికాయలు కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గొంది గూడెం గ్రామస్తులు గిరిజన సంప్రదాయ నృత్యాలతో అతిథులకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గిరిజనులతో కలిసి సంప్రదాయ “కొమ్ము” ధరించి నృత్యంలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.





