
తెలుగు మాసాల్లో అత్యంత శక్తిమంతమైంది జ్యేష్ఠ మాసం. సూర్యతాపం గరిష్ట స్థాయికి చేరే ఈ కాలంలో ఆ వేడిని తట్టుకుంటూ ఆధ్యాత్మికచింతన ఎలా పెంచుకోవాలో ఈ మాసం బోధిస్తుంది.
జ్యేష్ఠం అంటే పెద్దది, శ్రేష్ఠమైంది. ‘జ్యేష్ఠ మాస ఇతి ఖ్యాతః సర్వపాప ప్రణాశనః’ అన్నారు. అంటే జ్యేష్ఠమాసం సర్వ పాపాలను నశింపజేస్తుంది, పవిత్రమైంది అని అర్థం. ఈ మాసం విశిష్ట పూజలకు వేదిక. పురాణాల ప్రకారం ఈ మాసంలో చేసే స్నాన, దానాలు అనంత ఫలితాలనిస్తాయి. జ్యేష్ఠ శుద్ధ తదియనాడు స్త్రీలు సౌందర్యం, సౌభాగ్యాల కోసం ‘రంభ తృతీయ’ వ్రతాన్ని ఆచరిస్తారు. జ్యేష్ఠ శుద్ధ పంచమి శ్రుత పంచమి. దీన్ని జైనులు జ్ఞాన సముపార్జనకు ముఖ్యమైన రోజుగా పరిగణిస్తారు. జ్యేష్ఠ పౌర్ణమినాడు వట సావిత్రి వ్రతం, ఏరువాక పున్నమి, జగన్నాథుని స్నాన యాత్ర నిర్వహిస్తారు. పాడ్యమి నుంచి దశమి వరకూ గంగావతరణ వేడుకలు జరుగుతాయి. పురాణాల ప్రకారం జ్యేష్ఠ శుద్ధ దశమినాడు గంగానది స్వర్గం నుంచి భూమికి దిగివచ్చింది. దీనిని గంగా దసరా, దశపాపహర దశమి అంటారు. ఈ పది రోజుల్లో గంగానదిలో స్నానం ఆచరిస్తే పది రకాల పాపాలు తొలగిపోతాయని పెద్దలు చెబుతారు. మరో ప్రధాన ఘట్టం నిర్జల ఏకాదశి. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు ఎండలు తీవ్రంగా ఉన్నప్పటికీ చుక్క నీరు తీసుకోకుండా ఉపవాసం ఉండటం ఇంద్రియ నిగ్రహానికి పరాకాష్ఠ. భీముడు ఏకాదశి ఉపవాసాలు ఉండలేక ఇబ్బంది పడుతుంటే, వేదవ్యాసుడు- జ్యేష్ఠ ఏకాదశి ఒక్కటి ఆచరిస్తే చాలని సూచించాడని, అందుకే దీన్ని ‘భీమ ఏకాదశి’ అంటారని తెలియజేసే పౌరాణిక కథనాలున్నాయి.
జ్యేష్ఠ మాసం పూజలకే పరిమితం కాదు, దీని వెనుక ఆరోగ్య రహస్యాలున్నాయి. ఎండలు మండే ఈ కాలంలో మన పూర్వీకులు ధర్మంతో ముడిపెట్టి కొన్ని నియమాలను ఏర్పరిచారు. ఈ మాసంలో జలదానం చేయడం, చలివేంద్రాలు నడపటం, దాహంతో ఉన్న బాటసారులకు నీరు ఇవ్వడం మాధవసేవగా పరిగణించారు. తీవ్ర ఎండల దృష్ట్యా దూర ప్రయాణాలను ఈ మాసంలో నివారించారు. ఆహార నియమాల విషయానికి వస్తే, శరీర ఉష్ణోగ్రతను తగ్గించే పానకం, వడపప్పు, మజ్జిగ, తాటి ముంజలు, పుచ్చకాయ వంటి చలవ చేసే పదార్థాలను సేవించడం మంచిదని సూచించారు. బహుళ ఏకాదశి ‘యోగిని ఏకాదశి’. ఈ రోజు వ్రతం ఆచరించి, ఉపవాసం ఉంటే.. శారీరక రుగ్మతలు తగ్గుతాయి, మానసిక ఉల్లాసం కలుగుతుంది అంటారు. జ్యేష్ఠ మాసం, జ్యేష్ఠ నక్షత్రం కలిసి వచ్చినప్పుడు జ్యేష్ఠ (ప్రథమ) సంతానానికి వివాహం లేదా ఇతర శుభకార్యాలు చేయకూడదన్న సంప్రదాయం ఉంది. జ్యేష్ఠ మాసం మనకు ఓర్పును, ప్రకృతితో మమేకం కావడాన్ని నేర్పుతుంది. సూర్యుడి ప్రచండ వేడిని తట్టుకుని, భగవంతుని స్మరిస్తూ.. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడమే ఈ మాసపు అంతరార్థం. మట్టిని ప్రేమించమని ఏరువాక పున్నమి, నీటిని పూజించమని గంగా దసరా, బంధాలను గౌరవించమని వట సావిత్రి వ్రతం ప్రబోధిస్తాయి.





